స్నేహం మన బలం అనగనగా నారాయణపురం అనే గ్రామం వుండేది. ఆ గ్రామంలో దివ్య, నవ్య, భవ్య అనే ముగ్గురు స్నేహితురాళ్ళు వుండేవారు. ఎనిమిదో తరగతి చదువుతున్న ఈ ముగ్గురు ప్రాణ స్నేహితులు. నారాయణపురంలో పాఠశాల లేకపోవడంతో, ప్రతిరోజూ పక్క గ్రామమైన బండ్లపల్లి పాఠశాలకు అడవి గుండా నడిచి వెళ్ళేవారు. బాగా ఆడుకునేవారు, నవ్వుకునేవారు ఎవరికైనా సహాయం అవసరమైతే ముందుండి ముగ్గురు కలిసి సహకరించేవారు. ఒకసారి నవ్య తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడింది. ఆమెను దగ్గర పట్టణంలోని కొత్తచెరువు ఆసుపత్రికి తీసుకెళ్ళగా, డాక్టర్ ఆమెకు అపెండిసైటిస్ అని చెప్పాడు. 24 గంటలలోగా ఆపరేషన్ చేయకపోతే చాలా ప్రమాదం, ఆపరేషన్‌కి పదివేల రూపాయలు ఖర్చు అవుతుంది అన్నాడు డాక్టర్. నవ్య తల్లిదండ్రులు పేదవారు. ఈ విషయం తెలుసుకున్న దివ్య, భవ్య తమ కుటుంబాల దగ్గర నుంచి సహాయం అందించారు. ఆపరేషన్ విజయవంతమైంది. నవ్య మళ్లీ ఆరోగ్యంగా మారింది. కొన్ని రోజుల తర్వాత, చిన్న అపార్థం వల్ల ముగ్గురి మధ్య గొడవ జరిగింది. చిన్న మాట పెద్దదై, వారు ఒకరితో ఒకరు మాట్లాడకుండా విడిపోయారు. ఎవరికి వారే యమునా తీరే లాగా ఎడమొహం పెడమొహం పెట్టుకొని పాఠశాలకు వెళ్ళేవారు.ఒక రోజు, పాఠశాల నుండి ఊరికి వస్తూ వారు ప్రతిరోజు లాగే అదే అడవి దారి గుండా రాసాగారు. ముగ్గరూ కలిసి కాకుండా దూరం దూరంగా నడుస్తూ వస్తున్నారు ముందు దివ్య, కొంచెం వెనుక నవ్య, మరింత వెనుక భవ్య. అప్పుడే ఒక్కసారిగా చెట్ల వెనుక నుంచి క్రూరమైన జంతువు హైనా బయటకు వచ్చింది! అది నేరుగా దివ్య వైపుకి దూకింది. దివ్య భయంతో "అయ్యో! కాపాడండీ!" అంటూ కేకలు వేసింది ఆ శబ్దం విన్న నవ్య, భవ్య ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. వారు పరుగెత్తుకుంటూ దగ్గరలో ఎండిపోయిన చెట్టు కర్రను లాగి భయపడకుండా హైనా వైపు బలంగా విసిరారు. వీళ్ళ అరుపులకు భయపడి హైనా పారిపోయింది. దివ్య ప్రాణం కాపాడబడింది. అది చూసి ముగ్గురూ ఒకరినొకరు కౌగిలించుకున్నారు.ఆనందభాష్పాలతో సంతోషంగా “మీరు లేకపోతే నేను ప్రాణాలతో బయట పడేదాన్ని కాదు అందుకే అంటారు స్నేహ.. బలం చాలా గొప్పది "ఐకమత్యం చాలా విలువైనది!" అంది భవ్య "మనం వాదించుకున్నాం కానీ మన హృదయాలు మాత్రం విడిపోలేదు" అంది నవ్య. "మనం కలసి ఉంటే ఏ శక్తినైనా జయించగలం" అని అనుకున్నారు. అప్పటి నుండి వాళ్లు ఎప్పుడూ గొడవపడలేదు. ఆ రోజు వాళ్లకు తెలిసింది "ఐకమత్యమే మహాబలం", "కలిసి ఉంటే ఎలాంటి ప్రమాదాన్నైనా ఎదుర్కోవచ్చు."( స్నేహం మన బలం. విభేదాలు మన బలహీనత. కలిసి ఉంటే విజయం మనకు దాసోహం అవుతుంది)ఆధారం: మన బడి మాస పత్రిక