కాలం విలువ-కథ ఒక ఊరిలో ఒక గవర్నమెంట్ పాఠశాల ఉండేది. పాఠశాలకు ఊరిలో ఉన్న పిల్లలందరూ వెళుతూ ఉండేవారు. అందులో రవి అనే ఒక అబ్బాయి ఐదో తరగతి చదువుతున్నాడు. ఆ అబ్బాయికి బద్ధకం చాలా ఎక్కువ. చదువుపై అసలు ఆసక్తి చూపడు. మిగతా పనికిమాలిన విషయాలన్నింటిపై ఆసక్తి బాగా చూపుతూ పనులు చేస్తుంటాడు. కాలక్రమేనా ఆ అబ్బాయి పదవ తరగతికి వచ్చేసాడు. అయినా బుద్ధిలో ఎటువంటి మార్పు లేదు. ఒకరోజు ప్రధానోపాధ్యాయుల వారు తరగతి గదికి వచ్చి, పిల్లలతో కొద్ది రోజుల్లో మన పాఠశాల వార్షికోత్సవం రాబోతుంది. కాబట్టి మీరు పాటలు, దాస్సులు నేర్చుకోండి అని చెప్పి వెళ్ళిపోయారు. పిల్లలందరూ అన్ని నేర్చుకున్నారు. ఆరోజు రానే వచ్చింది. ఆ రోజున పాఠశాలకు ఊరిలో నున్న గ్రామ పెద్దలు, ప్రజలు ఆ వార్షికోత్సవాన్ని చూడటానికి వచ్చారు. ఈ పాఠశాల వార్షికోత్సవానికి డిఇఓ గారిని కూడా ప్రధానోపాధ్యాయులవారు ఆహ్వానించడం జరిగింది. అతను ఆహ్వానం మేరకు డిఇఓ గారు కూడా వచ్చారు. పిల్లలందరూ పాటలు చక్కగా పాడారు. చివరికి డిఈఓ గారు మాట్లాడవలసిన సమయం వచ్చింది. మాట్లాడుతూ.. మాట్లాడుతూ. చివరలో పిల్లలని దృష్టిలో పెట్టుకొని ఒక మాట అన్నారు. "శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీకు బానిస అవుతుందని అన్నారు." తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చదవమంటున్నారు. కదా.. చదువుతానులే అనే భావనతో చదవకండి. ఆ భావన నీ మనసులో నుంచి రావాలి. నేను బాగుపడాలి. నా తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలి. నేను పది మందికి ఆదర్శంగా మారాలి.. నా మంచిభవిష్యత్తు కోసం నేను చదువుకోవాలి అనే భావన మనసులో నుంచి రావాలి. అంతేకాకుండా చదివేటప్పుడు కాలం విలువ తెలుసుకొని, కష్టపడి కాకుండా ఇష్టపడి చదవండి. అప్పుడు చూడండి! చదివింది ఎందుకు రాదని మీకే తెలిసిపోతుంది." అని తెలియజేసి, డిఈఓ గారు వెళ్లిపోవడం జరిగింది. తాను మాట్లాడిన ప్రతి మాట రవి గుండెల్లో నాటుకి పోయింది. పశ్చాత్తాపము పడుతూ ఆరోజు నుండి రేయింబవళ్ళు కష్టపడిన రవికి మంచి మార్కులతో పదవ తరగతి పాస్ అవ్వడం అనేది జరిగింది. రవిని చూసి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఎంతో మురిసిపోయారు.అలానే ఇంటర్ పూర్తి చేసి, మంచి ఎంసెట్ ర్యాంక్ తో బీటెక్ కూడా పూర్తి చేశాడు. అందులో కూడా మంచి మార్కులతో పాస్ఆ అయ్యాడు రవి. అదే విధంగా మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం కూడా వచ్చింది. మంచి జీతం తో పనిచేస్తూ ఎందరికో ఆదర్శమయ్యాడు రవి. బెంగళూరులో పనిచేస్తున్న రవి కొన్ని రోజులు సెలవు మీద తన గ్రామం రావడం జరిగింది. తను వచ్చిన సమయంలోనే ఆ ఊరి పాఠశాలలో వార్షికోత్సవ సంబరాలు జరుగుతున్నాయి. తను చదివినప్పుడు వచ్చిన డి ఈ ఓ గారిని, అతని రిటైర్మెంట్ అనంతరం అదే పాఠశాలకి అతిథిగా పిలిచి, సన్నాన కార్యక్రమం పెట్టుకున్నారు. డి ఈ ఓ గారి ఫొటోని కటౌట్ మీద చూసి వార్షికోత్సవానికి రవి రావడం జరిగింది. డీఈఓ గారి సన్మాన కార్యక్రమం జరుగుతున్న సమయంలో ప్రధానోపాధ్యాయుల వారి అనుమతి మేరకు తాను కూడా డీఈవో గారిని సన్మానిస్తూ.. తన గతాన్ని స్టేజి మీద సభా ముఖంగా అందరికీ తెలియజేశాడు. నా పేరు రవి అయినా నాలో జ్ఞానం అనేది అసలు ఉండేది కాదు. మన డి ఈ ఓ గారు అరోజు పిల్లలందరినీ ఉద్దేశించి ఒక మాట అన్నారు. 'చదువడమనేది ఎవరికోసమో చదవకండి. మీ మంచి భవిష్యత్తు కోసం, కష్టపడి కాకుండా ఇష్టపడి చదవండి. అప్పుడే మీ భవిష్యత్తు బంగారమైనవుతుంది. ఆమాట నా మదిలో శిలక్షరాలై నిలిచాయి. ఆ మాటే ఈరోజు నన్ను ఒక ఉన్నత స్థితిలోని నిలబెట్టింది. అంతేకాదు అతని మాటలకి జ్ఞానోదయమై స్నేహితులు ఎందరో గ్రూప్ వన్, గ్రూప్ టు ఆఫీసర్లుగా ఎంపిక అయ్యారు. మీకు వేవేలా వందనాలు సార్. ఇదే సందర్భంలో నేను కూడా ఇదే పాఠశాలలో చదువుకున్నాను కనుక ఈ పాఠశాల రుణం తీర్చుకోవడానికి నా తరపున గ్రంథాలయ నిర్మాణానికి ఒక 50,000 వేలు రూపాయలను మన డీఈవో గారి చేతుల మీదుగా అందజేస్తున్నాను. ఈ సందర్భంగా పిల్లలందరికీ నేను ఒకటే విషయం చెబుతున్నాను. కాలం చాలా విలువైనది ప్రతి పనిని రేపు చేస్తాను అని వాయిదా వేయకండి. గురువులైన తల్లిదండ్రులైన మన మేలు కోసం మాత్రమే చెప్తారు. కాలాన్ని వృధాగా గడపకండి." అంటూ పెద్దలందరికీ పాదాభివందనాలు చేసి ఒక ఆదర్శ వ్యక్తిగా నిలిచాడు రవి. ఆధారం: మన బడి మాస పత్రిక