రవి మార్పు శిరికిపాలెం పాఠశాలలో చదివే రవి, రాజేశ్ లు మంచి స్నేహితులు. చదువులోనే కాక ఆట పాటల్లో కూడా పోటాపోటీగా వుండేవారు. ఒకసారి రవిది పైచేయైతే మరొకసారి రాజేశ్ ది పైచేయిగా వుండేది. తొమ్మిదో తరగతి లోకి వచ్చేక రానురానూ రవి చదువు తగ్గసాగింది. ఒక్కో యూనిట్ పరీక్ష లో క్రమ క్రమంగా మార్కులు తగ్గిపోతూ ఆఖరికి హాఫ్ ఇయర్లీ నాటికి పాస్ మార్కులు కూడా రావడం మానేశాయి. రాజేశ్ మాత్రం తన స్థానం ఎప్పుడూ కోల్పోకుండా టాపర్ గానే వున్నాడు. రవి చాలా కుంగిపోయాడు. తనెందుకు చదవలేక పోతున్నాడో అర్ధం కాలేదు. చదివినా జ్ఞాపకం ఎందుకు ఉండడం లేదోననీ చాలా దుఃఖ పడుతూ వుండేవాడు. వాళ్ళ క్లాస్ టీచర్ మోహన్ మాస్టారు వాడి గురించి వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడితే ఈ మధ్య మొబైల్ ఎక్కువ చూస్తున్నట్టు తెలిసింది. రవి వెనుక బాటుతనానికి అదే కారణమని గ్రహించి, రవినెలాగైనా దారిలో పెట్టాలనుకున్నారు మాస్టారు. ఒకరోజు రవి చూస్తూ వుండగా ఒక తుప్పు పట్టిన చాకుతో ఆపిల్ పండు కోయసాగారు. ఆది ఎంతకీ తెగకపోవడం రవి గమనించి ఒక్క పరుగున మాస్టారి వద్దకెళ్ళి, "సార్! ఆ చాకు తుప్పు పట్టి మొద్దుబారి పోయింది సార్! దానితో తెగదండీ. ఉండండి సార్! అంటూ సైన్సు టీచర్ లలిత మేడమ్ నడిగి ఒకచాకుతెచ్చి సార్ కిచ్చేడు. ఇది చూడండి సార్! ఎంతదారుగావుందో! దీనితో కొయ్యండి ఒక్కసారికే తెగిపోతుంది అన్నాడు. మాస్టారు. రవి కేసి చూస్తూ.. నేనూ, ఆవిడా ఒకసారే కొన్నామురా! అన్నారు. ఆమాటకి రవి నవ్వి ఒకసారే కొన్నా మేడమ్ రోజూ వాడుతారు, మళ్ళా తుడిచి నూనె రాసి దాచుతారు. మీరెప్పుడూ వాడరు. అది తుప్పు పట్టి మొద్దుబారి పోయింది సార్! అన్నాడు. మాస్టారు ఆహా! అంటూ ఆశ్చర్యంగా రవిని చూసి చిన్న కవిత చెప్పారిలా ఇనపచాకుతో రోజూ ఏదైనా తరుగుతూంటే దారుబాగ మెరుస్తుంది. వేలు పెడితె తెగుతుంది.అదేచాకునార్నెల్లు అటకమీద పారేస్తే తుప్పుపట్టి మొద్దుబారి తునాతునకలౌతుందిమెదడు కూడా చాకే సుమి రోజూ పని చెప్పకుంటె చెత్తనంతపోగుచేసి చేతకానిదౌతుంది.నిరంతరం జ్ఞాన మనే కందెననే అందిస్తే అజ్ఞానపు తుప్పు తొలగి అద్భుతాలు చేస్తుంది. కవిత విన్న రవి స్వంతంగా తెలివైన వాడవడం చేత మాస్టారి అంతరార్ధాన్ని గ్రహించాడు. వెంటనే మాస్టారి రెండు చేతులూ పట్టుకుని కంటతడి పెడతూ ఇలా అన్నాడు. సార్! నా తప్పు తెలిసింది. ఇంతకాలం చాకు లాంటి నా మెదడుకు మొబైల్ లోని చెత్తనంతా ఎక్కించి మొద్దుబారించేను. రాజేశ్ తన మెదడుకు జ్ఞానాన్ని అందిస్తూ, మేడమ్ గారి చాకులా దారుగా వుంచుకున్నాడు. బుద్ధి వచ్చింది సార్! మళ్ళీ నా మెదడుకి పదును పెడతాను. ఆ..పదును పెడతాను. అంటూ అక్కడినుండి వెళ్ళి పోయాడు. తన ఉపాయం ఫలించి నందుకు సంతోషించిన మోహన్ మాస్టారు తృప్తిగా ఇంటికి చేరారు. అదిమొదలు రవి మొబైల్ లో చెత్త చూడడం మానేసి, చదువుకోసమే వినియోగిస్తూ ఏన్యువల్ పరీక్షలనాటికి మరలా రాజేశ్ కి పోటీగా నిలిచాడు. ఆధారం: మన బడి మాస పత్రిక