ప్రపంచంలోని అతి శక్తివంతమైన పంపుల్లో ఒకటి మీ దగ్గరే, మీలోనే వుంది. అదే మీ గండెకాయ లేదా హృదయం. పిడికిలి ఆకారంలో వుండే మన గుండె ఒక్కరోజులో ఎంత పనిచేస్తుందో గమనిస్తే ఎవరికైనా ఆశ్యర్యం కలుగకమానదు. ఆరోగ్యంగా వుండే ఒక మనిషి శరీరంలో సుమారుగా ఒక 5 లీటర్ల రక్తం వుంటుంది. ఈ రక్తాన్ని మన గుండె ఒక రోజులో అనేకసార్లు తన గుండా రక్తనాళాల్లోకి పంపుతుంది. ఈ ప్రక్రియ పదేపదే ఎన్నిసార్లు జరుగుతుందంటే...... ఒక్కరోజులో సుమారు 25000 లీటర్ల రక్తాన్ని గుండె పంపిస్తుంది. ఇందుకై అది ఎంతో పనిని చేయాల్సి వస్తుంది. ఈ సందర్భంగా రక్తనాళాలకు సంబంధించిన మరొక చిత్రమైన విషయాన్ని కూడా మనం గుర్తించాలి. రక్తనాళాల్లో సిరలు, ధమనులు అని రెండు రకాలవి ఉంటాయన్న సంగతి మీకు తెలిసిందేగా. వీటిని మన శరీరం నుంచి బయటకు తీసి ఒక వరుసలో పేర్చామనుకోండి. అప్పుడవి ఎంత పొడవుంటాయో తెలుసా?.... 20000 కిలోమీటర్లు ... అంటే దాదాపు భూగోళపు ఉత్తరధృవం నుంచి దక్షిణధృవం దాకానన్నమాట ... సరే ఇప్పుడు మళ్లీ గుండె విషయానికి వద్దాం. ఒక మనిషి జీవితకాలంలో అతని గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుందో మీరు లెక్కించగలరా.... ప్రయత్నించి చూడండి. అన్నట్లు మనషి గుండె నిమిషానికి సుమారు 70 సార్లు కొట్టుకుంటుందన్న సంగతి మీకు తెలిసిందేగా. దీనిని ఆధారంగా చేసుకొని ఒక గంటకు, ఒక వారానికి, ఒక నెలకు, మన గుండెఎన్నిసార్లు కొట్టుకుంటుందో లెక్కలేసి చూడండి. ఈ లెక్కన అది ఒక సంవత్సరానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుందో కూడా లెక్కించి చూడండి. ఒగ మనిషి 100 ఏళ్ళ బతుకుతాడనుకుంటే, ఆ వందేళ్ళలో అతని గుండె రమారమిగా 3,66,00,000 సార్లు, కొట్టుకుంటుంది. అంటే అన్నిసార్లు రక్తనాళాల్లోకి రక్తాన్ని పంప్ చేస్తుందన్నమాట. ఎటువంటి హడావుడీ చేయకుండా, ఎవరి కంటా పడకుండా, ఎంతో సమర్ధవంతంగా ఇంత పెద్ద పనిని చేసే యంత్రం బహుశా ఈ ప్రపంచంలో ఇంకేదీ ఉండి ఉంచకపోవచ్చు. ఆ లెక్కనమన గుండె చాలా గొప్పదే కదా.. ఏమంటారు ?