సర్వేంద్రియాణాం నయనం ప్రధానం. అన్నారు. పెద్దలు. అంటే ఇంద్రియాలన్నింటిలోకి కళ్ళు చాలా ముఖ్యమైనవని అర్థం. కళ్ళు లేకుండా, లేదా కనుచూపు లేకుండా మన రోజు వారీ జీవితాన్ని అసలు ఊహించను కూడా ఊహించుకోలేము. అయితే కంటికి సంబంధించి కొన్ని చిన్నచిన్న జాగ్రత్తల గురించి తెలియక చాలామంది బాగా నష్టపోతున్నారు. అతి చిన్న వయసులోనే కళ్ళద్దాలు పెట్టుకోవలసిన పరిస్థితులు తెచ్చుకుంటున్నారు. ఇంకా రకరకాల కంటి వ్యాధుల బారినపడుతున్నారు. కళ్ళు ఎంత విలువైనవో ఎవరికీ ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు. అందుకే నాలుగు కాలాల పాటు తమ కళ్ళు చల్లగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. మీరు కూడా అలాగే కోరుకుంటున్నారు. కదూ.... అయితే ఈ క్రింది నియమాలను తప్పక పాటించండి. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం మాత్రమే గాక కనీసం ఓ 2-3 గంటలకు ఒక్కసారైనా చల్లని నీళ్ళతో మీ కళ్ళను శుభ్రంగా కడుక్కోండి. ఆ తరువాత వాటిని తుడుచుకొనేందుకై శుభ్రమైన రుమాలునిగాని, తువ్వాలుని గాని వాడండి. కళ్ళను తుడుచుకొనేందుకై ఇతరులు వాడిన తువ్వాళ్ళను గాని, రుమాళ్ళనుగాని, వాడకండి. ఉదయం 6.30 దాటాక, అలాగే సాయంత్రం 6 లోపు సూర్యుడివైపు సూటిగా చూడకండి. విపరీతమైన ఎండలోను, ఎక్కువసేపు ఉండకండి. ఒక స్థాయిని మించి ఎండ, కాంతి, దుమ్ము, పొగ- ఇవన్నీ కూడా కంటికి హాని చేస్తాయి. చెక్కిన పెన్సిలు, తెరిచి ఉంచిన పెన్ను, సూది, దబ్బలం , సన్నని కట్టెపుల్లలు వంటి మొనదేలి వుండే వస్తువులతో వ్యవహరించేటప్పుడు, అలాగే ఆ వస్తువులను ఉపయోగిస్తున్న వారి వద్ద ఉన్నప్పుడు కొంచెం జాగ్రతగా మసలండి. కంట్లో దుమ్ము, నలుసులు, వెంట్రుక ముక్కలు వంటివి పడినప్పుడు కళ్ళను మీ ఇష్టమొచ్చినట్లు నలమకండి. అలాంటి సమయాల్లో వెంటనే చల్లని నీళ్ళతో మీ కళ్ళను నెమ్మదిగా కడుక్కోండి. చన్నీళ్ళలో మీకళ్ళను, వుంచి కనురెప్పలను టపటపలాడించండి. కళ్ళలో ఏదైనా పడినప్పుడే గాక, దురద వేసినప్పుడు కూడా వాటిని నులమకండి. దురద, మంట వంటివి మరీ ఎక్కువ సేపు ఉంటే మీ డాక్టర్ని సంప్రదించండి. కంటి చూపు బాగుండాలంటే మనం తినే తిండిలో ఎ విటమిన్ తగిన మోతాదులో ఉండాలి. పాలు వెన్న, క్యారెట్లు , ఆకుకూరలు, కోడిగుడ్డు సొన వంటి వాటిలో ఈ విటమిను పుష్కలంగా ఉంటుంది. ఇక మీ చదువు విషయానికి వస్తే, కాంతి సరిగ్గా లేని గదిలో లేదా మసక మసక వెలుతురులో చదవకండి. అదే విధంగా మీరు చదివే పుస్తకంలో కాంతి మీ వెనుకవైపు నుంచి పడేలా చూసుకొండి. మీ కళ్ళకు - మీరు చదివే పుస్తకానికి మద్య కనీసం ఒక అడుగున్నర దూరం ఉండేలా చూసుకోండి. పుస్తకానికి మీ ముఖం మరీ దగ్గరగా గాని, మరీ దూరంగా గాని ఉండకూడదు. ఇక టీవి విషయానికి వస్తే.... చీకటి గదిలో టీవీని ఎప్పుడూ చూడకండి. అదేవిధంగా మీకు – టీవికి మధ్య కనీసం 8-10 అడుగుల దూరం ఉండేలా చూసుకోండి. చదివేటప్పుడు గాని, టీవీ, చూసేటప్పుడుగాని కనురెప్పలు ఆడించడం మర్చిపోకండి. మద్య మధ్యలో మిమ్మల్ని మీరు గమనిస్తూ ఉండండి. ముక్కకు రెండు వైపులా కనుగుడ్ల కింది భాగంలోనూ, అలాగే కనుబొమ్మల పై ప్రాంతంలోనూ మీ చేతివేళ్ళతో సున్నితంగా మర్దన చేసుకొండి. రెండు మూడు గంటలకొకసారి ఓ నాలుగైదు నిమిషాలు ఇలా చేయడం వలన మీ కళ్ళకు చక్కటి విశ్రాంతి దొరుకుంది. కంటిచూపు బలహీనంగా ఉన్న పిల్లలు ఒకసారి కళ్ళద్దాలు వాడడం, మరోసారి వాటిని తీసి పక్కన పడే యడం లాంటి పనులు చేయకండి. కంటి విషయంలో మీ డాక్టరు చెప్పిన నియమాలను విధిగా పాటించడం చాలా మంచిది. మీ శరీరానికి తగినంత వ్యాయామం, మీరు తీసుకునే ఆహారంలో అన్ని రకాల పోషకాలు ఉన్నట్లయితే మీకళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటాయి. కంటి చూపులో ఏదన్నా తేడా వచ్చిందని మీకు అన్పించినప్పుడు ఆ విషయాన్ని మీ పెద్దలకు చెప్పి, సాధ్యమైనంత త్వరగా కంటి డాక్టర్ని కలిసేందుకు ప్రయత్నించండి. కళ్ళకు చవకబారు కాటుకలు, సుర్మాలు పెట్టకండి. అదే విధంగా హోలీ పండుగనాడు పిచ్చి పిచ్చి రసాయనాలను (రంగులను) ముఖానికి పూసుకోకండి. అలాగే దీపావళి రోజున, ఢామ్మని పేలే టపాకులకు, సర్రున, దూసుకుపోయే తారాజువ్వల వంటి వాటికి మీ కళ్ళను సాధ్యమైనంత దూరంగా ఉంచండి. పరీక్షలప్పుడుగాని వేరే, సమయాల్లో గాని మీ కళ్ళకు గంటలు గంటలు వరుసగా శ్రమ పెట్టకుండా మధ్య మధ్యలో తగిన విశ్రాంతిని ఇస్తూ ఉండండి.