పెనుతుఫాను కలిగించే అపారనష్టం మనకు అనుభవమే. వాతావరణశాఖ వారు రాబోయే తుఫాను గురించి ముందస్తు హెచ్చరికలు చేస్తుండటం వల్ల ఆస్తినష్టాన్ని పూర్తిగా నివారించలేకపోయినా, ప్రాణనష్టం జరుగకుండా చాలా వరకు కాపాడగలుగుతున్నాం. గాలివాన, వడగళ్ళవాన, పొంగమంచు వంటివి వాతావరణంలో మార్పులను కలుగజేస్తాయి. ఈ మార్పులు రసాయన చర్యలమీద తమ ప్రభావాన్ని చూపిస్తాయి. రసాయనశాస్త్రం మీద అవగాహన, మంచి పట్టు ఉంటే తుపానును ముందే పసిగట్టగల తుఫాను గాజును మనం తయారు చేసుకోవచ్చు. ఈ మేజిక్ చాలా సులభం. ఇందుకు అవసరమైన రసాయనాలు చాలా తేలికగా లభ్యమయ్యేవే. పొటాషియం నైట్రేట్ 3.5 గ్రా. అమ్మోనియం క్లోరైడ్ 2.5 గ్రా. స్వేదనజలం 33 మి.లీ. ఇథనోల్ 40 మి.లీ. కర్పూరం 10 గ్రా. ఒక గాజు బీకరులో స్వేదనజలం తీసుకుని వెచ్చజేయాలి. ఈ వెచ్చని నీటిలో పొటాషియం నైట్రేట్, అమ్మోనియం నైట్రేట్లను కరిగించాలి. వేరే బీకరులో ఇథైల్ అలహాలను తీసుకొని అందులో కర్పూరాన్ని కరిగించాలి. ఈ రెండు ద్రావణాల్ని కలిపి, ఆ మిశ్రమ ద్రావణాన్ని ఒక పరీక్ష నాళికలోకి తీసుకుని, నాళికలోని ద్రావణంలో మార్పులను గమనించి, వాతావరణంలో రాబోయే మార్పులను పసిగట్టవచ్చు. ద్రవం నిర్మలంగా ఉంటే - వాతావరణం పొడిగా ఉంటుంది. ఎండకాస్తుంది. ద్రవం మసకబారితే - వాతావరణం మబ్బులు కమ్మి వర్షం రావచ్చు. ద్రవం చిన్న చుక్కలు కన్పిస్తే - వాతావరణంలో తేమ పెరుగుతుంది లేదా పొగమంచు ఏర్పడుతుంది. ద్రవం మసకబారి చిన్న నక్షత్రాలు కన్పిస్తే - ఉరుములు, మెరుపులతో కూడిన తుఫాను లేదా ఉష్ణోగ్రతను బట్టి మంచు కురవవచ్చు. ద్రవం అక్కడక్కడా పెచ్చులు ఏర్పడితే - ఆకాశం వేవవృతమై వర్షం రావచ్చు లేదా మంచు కురియవచ్చు. ద్రవం అడుగున స్పటికాలు ఏర్పడితే - హిమపాతం, నీరు గడ్డకట్టేంతటి చలి ద్రవం పై భాగంలో దారాల్లా ఏర్పడితే - బలమైన గాలులు వీస్తాయి తుఫాను గాజు ఎలా పనిచేస్తుంది? ఇందులో ఇమిడి ఉన్న కెమిస్ట్రీ ఏమిటి? ఏదైనా ద్రవంలో ఆయా ఘనపదార్థాల ద్రావణీయతను ఉష్ణోగ్రత, పీడనం ప్రభావితం చేస్తాయి. వాతావరణ పరిస్థితులను బట్టి, ద్రవం నిర్మలంగా ఉండడమో, లేదా అవక్షేపాలు ఏర్పడడమో జరుగుతుంది. గాజుగోడకి ద్రవానికి మధ్య పరస్పర చర్యల వల్ల స్పటికాలు ఏర్పడుతుంటాయి. ఈ మార్పులకు విద్యుత్ ప్రభావాలు కూడా కారణం కావచ్చును. బెరామీటర్లో అయితే, ద్రవమట్టం వాతావరణ పీడనాన్ని బట్టి పైకి లేదా కిందికి కదులుతుంది. మీరు కూడా చేసి చూడండి.