గాలి గాలి కలియ గగనంబు గగనంబు మన్ను మన్ను గలియ మంట మంట నీరు నీట గలియ నిర్మలంబై యుండు విశ్వదాభిరామ వినుర వేమ చూశారా! వేమన ఎంత చక్కగా సెలవిచ్చారో. ఒక చోట ఉండే గాలి వేరే ప్రదేశంలోని గాలితో కలసిపోతుంది. ఆకాశంలో మేవల గుంపు మరో గుంపుతో సులభంగా కలిసి పోతుంది. (గగనంబు గగనంబు....), పలమనేరులో మట్టి తీసుకపోయి ఆదిలాబాద్ నేలలో కానీ జెరూసలేం నేలలో కానీ కలిపినా చక్కగా కలసిపోతుంది. వేరు వేరు మంటలు, అగిపుల్ల మంట, కట్టెపుల్ల మంట, కాగితం కాలే మంట అన్నీ భేదాలు లేకుండా కలసిపోతాయి. అలాగే నీరు సముద్రంలో హాయిగా కలసి పోతుంది ఎలాంటి భేదభావం లేకుండా. ఎక్కడా ఏవీ పోట్లాడుకోవు. నీవు వేరు, నేను వేరని విమర్శించుకోవు. కానీ మనం మాత్రం ఎందుకు పోట్లాడుకుంటాం. వేరే వేరే రాష్ట్రాల వారని, వేరే జిల్లాల వారని, వేరే ఊరివారని, వేరే భాష వారని విడిపోతుంటే మతాలు, కులాలుగా మనుషులు విడిపోవద్దని ఆ నాడే వేమన చెప్పాడు. మీరు కూడా ఎంచక్కా మీ పాఠశాలలో అందరూ కలసి మెలసి వున్నారు కదా! అలాగే వుండాలి. అందరికీ మీరు ఆదర్శంగా నిలవాలి. సరేనా! ఇక ఈ నీటి మర్మం ఏమిటో చూద్దాం. కావలసిన పరికరాలు: పెద్ద పాత్ర రెండు సీసాలు (ఒకే సైజువి) రుమాలు గుడ్డ సుద్దముక్క బట్టల సోడా సోపుపౌడర్ నీరు ప్రయోగం: మనకు శుభ్రమైన నీరు కావాలి. వీలైతే వర్షం రోజున వర్షం పడుతూ వున్నప్పుడు ఒక బకెట్లు ఆరు బయట (లేక మిద్దెపైన) వుంచి వర్షపు నీటిని సేకరించి ఈ ప్రయోగం చేస్తే ఫలితం చాలా బాగా వస్తుంది. సేకరించిన నీటిని తీసుకోండి. ఒక చాక్షీస్ (సుద్దముక్క ను గుండ్రాయితో మెత్తగా పొడిచేయండి. పాత్రలోని నీటిలో ఈ పొడివేసి బాగా కలపండి. ఈ కలిపిన నీటిని చేతిరుమాలుతో వడగట్టి రెండు సీసాలలో సమానంగా నింపండి. (చేతిరుమాలు ఫిల్టరు లేదా వడపోత కాగితం లాగ పని చేసిందన్న మాట) మొదటి సీసాలోని నీటికి అరస్పూను వాషింగ్ సోడా (బట్టలుతికే సోడా) ను కలపండి. తరువాత రెండు సీసాలకూ బట్టల సోప్పౌడర్ రెండు, రెండు స్పూన్లు కలపండి. రెండు సీసాలను బాగా గిలకరించండి. అపుడు నురుగ వస్తుంది కదా! ఏ సీసాలో నురుగ ఎక్కువగా వుందో గమనించండి. ఆ... కరెక్ట్ మొదటిది అంటే వాషింగ్ పౌడర్ కలిపిని సీసాలో నురుగ ఎక్కువగా, రెండవ సీసాలో నురగ తక్కువగా వుంది. అవునా, కారణం ఏమిటి? అసలేం : సాధారణ నీటికి మీరు సుద్దముక్క పొడి కలపడం ద్వారా దానిని 'కఠిన జలం' (Hard water) గా మార్చారు. సున్నపురాయి కాల్షియం, మెగ్నీషియం మొదలైన పదార్థాలు కలవడం వల్ల నీరు కఠినంగా మారుతుంది. ఈ కఠిన జలంలో సోపుపొడి సరిగా నురగను ఇవ్వదు. అందువల్ల రెండవ సీసాలో నురగ తక్కువగా వుంది. మొదటి సీసాలోని కఠిన జలానికి మనం “వాషింగ్ సోడా” కలిపాము కదా. అందువల్ల కఠిన జలం మృదుజలం (Soft water) గా మారిపోయింది. కాబట్టి మొదటి సీసాలో నురగ ఎక్కువగా వచ్చింది. ఆకాశం నుండి వర్షించే నీరు స్వచ్ఛంగా వుంటుంది. భూమి పై ప్రవహించి భూమిలోనికి ఇంకినపుడు సున్నము, కాల్షియం, మెగ్నిషియం లాంటి పదారాలు నీటిలో కలసిపోతాయి. అందువల్ల నీటికి కఠినత్వం వస్తుంది. మీరు స్నానాల గదిలోని బకెట్లో, పొలుసులు పొలుసులుగా మరకలు చూసేవుంటారు. అవన్నీ కఠినజల ప్రభావమే… యుద్ధ సమయంలో సైనికులు క్రొత్త ప్రాంతంలో వంటచేస్తూ చిక్కుడు కాయలు ఉడక బెడుతూవుంటే అవి సరిగా ఉడక లేదట. “ఏంటి, ఈ ప్రాంతంలో నీరు సరిగా ఉడకడం లేదు. వంట Hard అవుతోంది. ఈ నిరు హార్డ్ వాటర్” అన్నారట. అప్పటి నుండి ఈ 'కఠినజలం' (హార్డ్ వాటర్) అన్న పదం వాడకంలోకి వచ్చిందట. మీరు ఇంటిలోని నీటిని కూడా పై విధంగా పరీక్షించి 'కఠిన జలమో' మృదుజలమో తెలుసుకోవచ్చు. ప్రయత్నించండి. మీ ఉపాధ్యాయుల సహాయం తీసుకోండి. సరేనా? ఆధారం: యం. యుగంధర్ బాబు, సెల్: 9394782540