ఓ రెండు గాలి బుగ్గలను (బెలూన్లను) తీసుకుని, వాటిలో గాలిని నింపి, దారంతో ముడివేయండి. ఇప్పుడీ రెండు బెలూన్లను విడివిడిగా ఉన్ని బట్టకు రుద్ది వాటిలో విద్యుదావేశాన్ని తెప్పించండి. ఆ తరువాత ఈ రెండు బెలూన్లకి దారాలను కట్టి, వాటి కొసలను మీ చేతివేళ్ళతో పట్టుకుని బెలూన్లను గాలిలో వేలాడదీయండి. ఏం జరుగుతుందో తెలుసా..? ఇంతకు ముందరి ప్రయోగాల్లో లాగా అవి ఒక దాన్నొకటి ఆకర్షించుకోవు. దానికి బదులుగా ఎడముఖం పెడముఖం అన్నట్లుగా ఒక దాన్నుంచి మరొకటి దూరంగా పోయేందుకు ప్రయత్నిస్తాయి. ఇలా ఎందుకు జరుగుతుందటే... బెలూన్లను ఉన్ని బట్టకు రుద్దినప్పుడు ఉన్నిబట్టలోంచి కొంత పరిమాణంలో ఎలక్ట్రాన్ లు బెలూన్లలోకి ప్రవేశిస్తాయి. ఆ విధంగా బెలూన్లు రుణ విద్యుదావేశాన్ని పొందిచే, ఉన్నిబట్ట ధన (పాజిటివ్) విద్యుదావేశాన్ని పొందుతుంది. ఒకే రకమైన విద్యుదావేశాలు పరస్పరం వికర్షించుకుంటాయని, పరస్పరం విరుద్ధంమైన విద్యుదావేశాలే ఒకదాన్నొకటి ఆకర్షించుకుంటాయని మీకు తెలుసు కదా. మీరు ఉన్నిబట్టకు రుద్ధి,గాల్లో వేలాడదీసిన బెలూన్ లు రెండూ ఒకే విద్యుదావేశాన్ని అంటే రుణ విద్యుదావేశాన్ని కలిగి వున్నందువల్ల అవి ఒక దాన్నుంచి మరొకటి దూరంగా పోయేందుకు ప్రయత్నిస్తాయి. ఒకవేళ ఇవే బెలూన్ లను ఇంతకు ముందరి ఉన్నబట్ట దగ్గరకు తీసుకుపోతే ఆ ఉన్నిబట్టను అంటుకొని, వుండేందుకు తాపత్రయ పడతాయి. అందుకు కారణం ఏమిటో మీకిప్పుడు బాగా అర్థమైపోయిందిగా. చెకుముకి చిన్నారులూ ఇలా తేలికగానూ, సరదాగాగానూ వుండే పై మూడు ప్రయోగాలను మీరు స్వయంగా చేయండి. అలాగే మీ తరగతిలోని వారికి, మీ మిత్రులకు, మీకన్నా చిన్న తరగతుల వారికి ఈ ప్రయోగాలను చేసి చూపించి వీటి వెనుక ఉన్న సైన్సు సూత్రాన్ని వారికి వివరించి చెప్పండి. ఇలాంటి పనులు చేయడం ద్వారా మీరు విజ్ఞాన శాస్త్రాన్ని చక్కగా అర్థం చేసుకుని సైన్సుని మన సమాజంలో మరింతగా విస్తరించవచ్చు.