2-10-1608 మొట్టమొదటి ఆప్టికల్ టెలిస్కోప్ ను ’హాన్స్ లిప్పర్షె’ నెదర్లాండ్ లో ప్రయోగాత్మకంగా ఉపయోగించిన రోజు. 3-10-1947 1918 వ సం. లో భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతిని అందుకున్న జర్మని శాస్త్రవేత్త మాక్స్ ప్లాంక్ మరణించిన రోజు. ఈయన కాంతి ధర్మాలను వివరించిన క్వాంటం సిద్ధాంతంను ప్రతిపాదించారు. 4-10-1957 మానవనిర్మితమైన ’స్పుట్నిక్ ’ ఉపగ్రహాన్ని రష్యా దేశం ప్రయోగించిన రోజు. 5-10-1864 ఫ్రెంచ్ శాస్త్రవేత్త ’లూయి జీన్ యూమిరే’ జన్మదినం ఈ రోజే. ఈయన తన సోదరుడు ’ఆగస్ట్ జీన్ లూమిరే’ తో కలిసి సినిమాటోగ్రాఫీ, కలర్ ఫోటోగ్రాఫీని కనుగొన్నారు. 6-10-1807 ఈ రోజునే ’సర్ హంప్రీ డేవి’ పొటాషియం మూలకాన్ని ఆవిష్కరించారు. పొటాష్ కు విద్యూత్ విశ్లేషణ చేయడం వల్ల పొటాషియం మూలకాన్ని వేరు చేశారు. 7-10-1887 డోనిష్ శాస్త్రవేత్త ’నీల్స్ బోర్’ జన్మదినం. పరమాణు నిర్మాణం గురించి వివరించారు. పరమాణువులో కేంద్రకం నిర్ణీత కక్ష్యలలో, నిర్దిష్ట స్థాయిలలో ఎలక్ట్రాన్లు పరిభ్రమిస్తాయని వివరించారు. 8-10-1922 భారతీయ జీవ భౌతిక శాస్త్రవేత్త ’గోపాలసముద్రం నారాయణ రామచంద్రన్’ జన్మించిన రోజు. వీరు ’కొల్లాజన్ ’ ప్రోటీన్ నిర్మాణాన్ని వివరించారు. ఈ ప్రోటీన్ చర్మం, ఎముకలలో ఉంటుంది. 9-10-1893 ఈ రోజు భారత ఖగోళ, భౌతిక శాస్త్రవేత్త ’మేఘనాధసాబా’ జన్మించారు. వీరు ఉష్ణఅయనీకరణ సిద్ధాంతాన్ని వివరించారు. 10-10-1731 బ్రిటిష్ శాస్త్రవేత్త ’హెన్రీ కేవిండిష్’ జన్మదినం. హైడ్రోజన్, ఆర్గన్ వాయువులను వీరే కనుగొన్నారు. విద్యుత్ ధర్మాల గూర్చి పరిశోధనలు చేశారు. 11-10-1889 బ్రిటిష్ భౌతిక శాస్త్రవేత్త ’జేమ్స్ ప్రిస్కాట్ జౌల్’ మరణించిన రోజు. వివిధ రూపాల శక్తిలో పరస్పరం అంతర మార్పిడి జరుగుతుందని వివరించారు. వాయు అణుచలన సిద్ధాంతంను ప్రతిపాదించినది కూడా వీరే. 15-10-1564 మానవ శరీరాన్ని మొదటగా కోసి అంతర నిర్మాణాన్ని పరిశీలించి, విశ్లేషించిన ’ఆండ్రియాస్ వెసాలియన్’ మరణించిన రోజు. 17-10-1831 బ్రిటన్ శాస్త్రవేత్త ’మైఖేల్ ఫారడే’ విద్యుదయస్కాంత ప్రేరణను కనుగొన్నారు. నిరోధక తీగలు చుట్టబడిన రెండు ఇనుప తీగలతో ప్రయోగాలు చేస్తూ దీనిని కనుగొన్నారు. 18-10-1931 థామస్ అల్వా ఎడిసన్ అమెరికా, న్యూజర్సీలో మరణించారు. ఎలక్ట్రిక్ బల్బు, కార్బన్, టెలిఫోన్, మోషన్ పిక్చర్ వంటి ఎన్నో ఆవిష్కరణలు వీరి ప్రయోగ ఫలితాలే. 19-10-1910 భారతదేశంలో జన్మించి, అమెరికాలో స్థిరపడిన ’సుబ్రహ్మణ్య చంద్రశేఖర్’ జన్మదినం. నక్షత్రాల వయస్సు, వాటి నాశనం గూర్చి పరిశోధనలు చేశాడు. 21-10-1833 స్వీడన్ లో జన్మించిన రసాయన శాస్త్రవేత్త, ఇంజనీర్ ’అల్ఫ్రైడ్ నోబెల్’ జన్మదినం. వీరి డైనమైట్ ఆవిష్కరణ వల్ల వచ్చిన ధనాన్ని నోబెల్ బహుమతుల కోసం వాడుతున్నారు. అంతర్జాతీయ స్థాయిలో భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, వైద్యం, సాహిత్యం, శాంతి, ఆర్థికశాస్త్ర రంగాలలో ఈ బహుమతులిస్తున్నారు. 24-10-1632 డచ్ శాస్త్రవేత్త ’ఆంటన్ వాన్ లీవెన్ బాక్’ జన్మదినం. శక్తివంతమైన బూతద్దాల సహాయంతో సూక్ష్మజీవులను పరిశీలించి ప్రపంచానికి పరిచయం చేశారు. 28-10-1914 ’జోనస్ ఎడ్వర్డ్ సాక్’ అమెరికాలోని న్యూయార్క్ లో జన్మించారు. వీరు మృతి చెందిన పోలియో వైరస్ ను ఉపయోగించి పోలియో వాక్సీన్ ను కనుగొన్నారు. 29-10-1656 బ్రిటీష్ ఖగోళ శాస్త్రవేత్త ’ఎడ్మండ్ హేలీ’ జన్మదినం. తోకచుక్క మరలా నిర్ణీత కాలంలో రావడాన్ని లెక్కించి చెప్పారు. దానికే హేలీ తోకచుక్క అని పేరు. 30-10-1909 భారతీయ న్యూక్లియర్ శాస్త్రవేత్త ’డా. హోమీ జహంగీర్ బాబా’ జన్మదినం. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (BARC) వీరి పేరు మీదనే ఉంది. ఆధారం: బి. మొక్షానందం