బ్లాక్ చైన్ టెక్నాలజీతో ముడిపడి ఉన్న క్రిప్టో కరెన్సీ ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది దృష్టిని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా బిట్ కాయిన్ (BTC), లైట్ కాయిన్ (UTC), ఈథర్ (ETH) వంటి క్రిప్టో కరెన్సీ రకాలను గురించి ప్రాథమికంగా అవగాహన చేసుకొందాం. సరైన అవగాహన లేకుండా, ఎవరెవరి మాటలో నమ్మి తొందరగా డబ్బు సంపాదించాలన్న అత్యాశకుపోయినా తీవ్రంగా నష్టపోవడం కూడా జరగవచ్చు. అందుచేతనే ఈ రకం కరెన్సీలో ఎటువంటి నష్టాలకు అవకాశం ఉందో ముందుగానే తెలుసుకుని, అందుకు సిద్ధపడుతూ జాగ్రత్తగా ముందడుగువేయాలి. చాలా దేశాల్లో బిట్ కాయిన్స్ చట్టసమ్మతం. కానీ మరికొన్ని దేశాల్లో వీటిపై నిషేధం ఉంది. ఉదాహరణకు బంగ్లాదేశ్ బిట్ కాయిన్స్ ని నిషేధించింది. ఈ కరెన్సీలో ఎవరైనా లావాదేవీలు చేస్తే వారు శిక్షార్హులే. చైనా సెంట్రల్ బ్యాంక్ అలాగే ఇండియాలో రిజర్వ్ బ్యాంక్ బిట్ కాయిన్ లావాదేవీల విషయంలో మదుపరులను హెచ్చరించాయి. గత నవంబర్లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లో కూడా భారతదేశం క్రిప్టో కరెన్సీని చట్టబద్ధమైనదని గుర్తించడం లేదని ప్రకటించారు. రష్యా, జర్మనీ, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్లు కూడా క్రిప్టో కరెన్సీ విషయంలో తగిన హెచ్చరికలు జారీ చేశాయి. అయినా క్రిప్టో కరెన్సీ గురించి ప్రపంచ వ్యాప్తంగా చాలా చర్చ జరుగుతోంది. "క్రిప్టో కరెన్సీ లేదా వర్చువల్ కరెన్సీ అంటే ఏమిటి?” క్లుప్తంగా తెలుసుకుందాం. క్రిప్టో కరెన్సీ అనేది రూపాయిలు, డాలర్లు, పౌండ్లు వంటి సాధారణ కరెన్సీ కన్నా భిన్నంగా ఉంటుంది. సాధారణ కరెన్సీ నోటు లేదా నాణేన్ని మనం భౌతికంగా చూస్తాం. చేతితో తాకుతాం. క్రిప్టో కరెన్సీ కంప్యూటర్ లోనే జనించే డిజిటల్ కరెన్సీ, దానికి భౌతిక రూపం లేదు. కాబట్టి తాకలేము. దీనిపై ఎటువంటి ప్రభుత్వనియంత్రణ ఉండదు. ఏదైనా ఒక బ్యాంక్ లో మనకు ఎకౌంట్ ఉన్నప్పుడు మసం ఆ ఎకౌంట్ కు డబ్బు జమచేస్తాం లేదా అవసరమైనప్పుడు తీసుకుంటాం లేదా వేరే ఎకౌంట్ కు బదలాయింపు చేస్తాం. ఈ డబ్బును కరెన్సీ నోట్ల ద్వారానో లేదా నాణేల రూపంలోనో తీసుకుంటాం లేదా జమచేస్తాం. దీనికి సంబంధించి మన పాస్ బుక్ లో నమోదవుతాయి. కానీ బిట్ కాయిన్స్ వంటి క్రిప్టోకరెన్సీ విషయంలో పీర్స్ అనబడే వ్యక్తుల నెట్వర్క్ ఉంటుంది. ప్రతి పీర్ కు సంబంధించి ఎకౌంట్ తాలుకు లావాదేవీలు, బాలెన్స్ల పూర్తి వివరాలు నమోదై ఉంటాయి. ఒక వ్యక్తి మరోవ్యక్తికి x బిట్ కాయిన్స్ ఇచ్చినట్లు నమోదవుతుంది. ఈ బదలాయింపు మొదటి వ్యక్తి వ్యక్తిగత కీతో సంతకంచేసి ఉంటుంది. ఈ సంతకం అయ్యాక ఈ లావాదేవీ నెట్వర్క్లో ప్రసారం అయి ఒక పీర్ నుంచి మరో పీరికి పంపబడుతుంది. అంటే ఇదొక P2P (Peer to Peer) టెక్నాలజీ అన్నమాట. వేరే ఏమీ ప్రత్యేకతలేదు. ఈ లావాదేవీ మొత్తం నెట్వర్క్ అంతటా తెలిసిపోతుంది. కానీ కొంత సమయం తర్వాతనే అది నిర్ధారణ అవుతుంది. క్రిప్టోకరెన్సీ అంతటకీ ఈ నిర్ధారణ (Confirmation) చాలా కీలకమైంది అలా నిర్ధారణ కానంత వరకు అది అసంపూర్ణంగా లేదా పెండింగ్ లో ఉన్నట్లే. ఈ స్థితిలో ఉన్నంత వరకు దాన్ని ఎవరైనా దొంగలించవచ్చు. కానీ నిర్ధారణ అయిన తర్వాత ఇక ఆ లావాదేవీలో ఎవరూ వేలు పెట్టలేరు. అప్పుడది బ్లాక్ చైన్లో భాగమైపోతుంది. ఇలా ఒక సంచి (Wallet) నుంచి మరొక సంచిలోకి జరిగే బదలాయింపును ఖరారు చేసేందుకు మధ్యలో కొందరు వ్యక్తులుంటారు. వీరిని మైనర్స్ (miners) అనీ వారు. చేసే ప్రక్రియని మైనింగ్ (mining) అనీ అంటారు. మరి మైనింగ్ అంటే ఏమిటి? ఒక వాలెట్ ను వాలెట్ కి బిట్ కాయిన్ లలో జరిగే బదలాయింపులన్నీ ఒక బాక్స్ లో ఆరు బదలాయింపులుంటాయి. ఒక బ్లాక్ చైన్ లో బదలాయింపులన్నీ ఒక ఆవర్జా పుస్తకం (ledger)కింద ఏర్పడుతాయి. ఇవన్నీ బిట్ కాయిన్ లావాదేవీ చేసే వ్యక్తికి అంటే బిట్ కాయినర్ కి అందుబాటులో ఉంటాయి వాళ్ళు చూసే అవకాశం ఉండదు. క్రిప్టో కరెన్సీ వ్యవస్థలో మైనర్స్ చేసే పని చాలా ముఖ్యమైనది. మైనింగ్ చేసేందుకు సాధారణ కంప్యూటర్స్ సరిపోవు. కంప్యూటర్స్ ప్రత్యేకమైన సర్క్యూట్లు కావాలి. ఎక్కవ కరెంట్ ఖర్చవుతుంది. మైనింగ్ ద్వారానే బిట్ కాయిన్ పుట్టుకొచ్చి చెలామణీలోకి వస్తాయి. ఈ పని చేసినందుకు మైనర్స్ కి బిట్ కాయిన్స్ రూపంలో ప్రతిఫలం దొరుకుతుంది. ప్రస్తుతం క్రిప్టో కరెన్సీలో ఇథేరియం. రిపుల్, లైట్ కాయిన్ వంటి ప్రత్యామ్నాయాలు ఎన్ని వున్నా బిట్ కాయిన్ కి మాత్రమే అతి పెద్ద బ్లాక్ చైన్ నెట్వర్క్ ఉంది. ఈ ప్రత్యామ్నాయాలన్నింటినీ మూకుమ్మడిగా ఆల్ట్ కాయిన్స్ అంటారు. బిట్ కాయిన్ కి సంబంధించి 2008 అక్టోబర్ లో సతోషి నకమోటో పేరుతో ఒక పేపర్ ప్రచురితం అయింది. ఎలక్ట్రానిక్ బదలాయింపు వ్యవస్థను దీనిలో ప్రవేశపెట్టారు. మధ్యలో బ్యాంకుల ప్రమేయం లేని ఈ పద్ధతి చాలా మందిని ఆకర్షించింది. బిట్ కాయిన్ ను ఉపయోగించిన మొదటి లావాదేవీ 2010 లో జరిగింది. ప్రస్తుతం ఒక కోటిపైగా బిట్ కాయిన్స్ చెలామణీలో ఉన్నాయి. ఎవరైనా వెబ్ సైట్లో బిట్ కాయిన్లను కొనుక్కోవచ్చు లేదా అమ్ముకోవచ్చు. బిట్ కాయిన్స్ అనేవి ప్రింట్ కావు. వీటిని ఉత్పత్తి చేసుకోవాలి. బిట్ కాయిన్స్ గ్లోబల్ స్వభావం ఉంది. వీటి మీద ఏ ప్రభుత్వ నియంత్రణ లేదు. ప్రపంచంలోనే దేశాల సరిహద్దులనధిగమించి నగదు బదలీ వేగంగా, చవకగా జరుగుతుంది. ముఖ్యవిషయం ఏమంటే బిట్ కాయిని విలువ నిమిషనిమిషానికి మారిపోతుంటుంది. ఒక సారి పెరగనూవచ్చు మరుక్షణమే క్షీణించవచ్చు. బిట్ కాయిన్ బలమే దాని బలహీనత కూడా. దాన్ని కొనాలా వద్దా అనేది ఎవరికి వారే నిర్ణయించుకోవాలి. వేగంగా పెరిగితే అంతే వేగంగా పడిపోతుంది. ఒక బుడగమల్లే పెరిగి పెరిగి ఒక్క సారిగా పేలిపోవచ్చు. అదే దీనిలో ఉండే ప్రమాదం. కాబట్టి ఇందులో పెట్టుబడి పెట్టేటప్పుడు ముందు వెనుకలు బాగా ఆలోచించుకోవాలి. లాభనష్టాలను బేరీజు వేసుకుని మానసికంగా పరిమితమైన నష్టానికి సిద్ధపడి మరీ అడుగు ముందుకువేయాలి. ఒకేసారి అత్యాశకుపోయి ఎక్కువ పెట్టుబడి పెడితే, హఠాత్తుగా బిట్ కాయిన్ విలువ సున్న అయిపోతే భారీనష్టమే కలుగవచ్చు. అందుకే జాగ్రత్త అవసరం అంటున్నారు. మన పెట్టుబడి కొంత స్థాయికి పెరిగిన తర్వాత, అసలు డబ్బు తీసేసుకుంటే, ఆ తర్వాత విలువ పడిపోయినా చింతించాల్సిన పని ఉండదు. సాధారణ కరెన్సీకి మనదేశంలో రిజర్వ్ బ్యాంక్ గ్యారెంటీ ఉంటుంది. క్రిప్టో కరెన్సీకి అలాంటి గ్యారంటీ ఏమీ ఉండదు. అందుకే కీడెంచి మేలెంచాలి. అయినా ఎవరిష్టం వారిది! ఆధారం: ఇ.ఆర్. సుబ్రహ్మణ్యం