మనకందిరికి స్పూర్తిని కలిగించే ఒక నాయకుని జీవితంలోని ఒక సంఘటన చెబుతాను. ఇది 1980 ల నాటి మాట. ఆచార్య ఎన్.జి.రంగా పార్లమెంటులో కాంగ్రెస్ పార్టి ఉపనాయకులుగా ఉన్న రోజులవి. అంతకుముందు ఆయన స్వతంత్ర పార్టికి అభిల భారత అధ్యక్షులుగా చాలా కాలం పనిచేశారు. ఆర్ధిక శాస్త్రంలో డాక్టరేట్ పొందిన వ్యుక్తి అయన. ఒకసారి. ఒక సభకు ఆచార్యరం గాను, ప్రసిద్ధ సినీనటుడు అక్కినేని నాగేశ్వరరావును ముఖ్య అతిధులుగా పిలవడం జరిగింది. వేదిక మీద వారిద్దరూ ప్రక్కప్రక్కనే కూర్చోవడం జరిగింది. రంగా గారు నాగేశ్వరరావు గారిని నీపేరేంటి బాబూ అన్నారు. నాగేశ్వరరావు గారు నాపేరు అక్కినేని నాగేశ్వరరావండీ అన్నారు. ఏం చేస్తుంటావు బాబూ అని. మరో ప్రశ్న వేశారు రంగారావు. నాగేశ్వరరావు గారికి ఆశ్చర్యం వేసింది. కారణం సుప్రసిద్ధి నటుడుగా గొప్ప పేరు సంపాదించిన తన పేరు చెప్పినా ఈ ముసలాయనకి తన వృత్తి ఏమిటో తెలియదంటాడేమిటా? అని వెంటనే నెను సినిమాలో నటిస్తుంటానండి అన్నాడు. అప్పుడు రంగా గారు ఓహు! అలాగా బాబూ! నేను సినిమాలు చూడనులే అన్నారు. నాగేశ్వరరావు గారు మరింత ఆశ్చర్యపోయారు. సినిమాలు చూడని వ్యక్తి ఉంటారా అని. రంగా గారు తన జీవితంలో ఒక్క సినిమా కూడా చూడకుండా నిరంతరం రాజకీయాల, రైతు సమస్యల అధ్యయనంలో ఉన్నారు కాబట్టే అన్ని దశాబ్దాల పాటు దేశనాయకుడుగా రాణించగలిగారు. ఆయనకు ఏరకమైన ఇతర వ్యాపకం ఉండేది కాదు. ఆయన జీవితం మనకందించే సందేశమేమిటి? “జీవితంలో రాణించాలంటే కష్టపడి చదవాలి” అన్నాడు వెంకట్రావు. “కాదు మాస్టారూ! మనస్సును ఉల్లాసపరచే ఏ ఇతర న్యాపకాలు లేకుండా తెగ కష్టపడి చదివితే మెంటల్ వస్తుంది. జహంగీర్ అతనిని అడ్డుకున్నాడు. మాస్టారు ఇద్దరి సంభాషణను మౌనంగా వింటున్నాడు. “మరి రంగాగారికి మెంటల్ రాలేదెందుకని?” వెంకట్రావు ప్రశ్న. జహంగీర్ సమాధానం చెప్పలేకపోయాడు. మాస్టారు జోక్యం చేనుకున్నారు. “జహంగీరు సమాధానాన్ని నేను చెప్తాను. రంగా గారు కష్టపడి చదవలేదు. ఇష్టపడి చదివారు. ఏ అంశాన్నయినా ఇష్టపడి చదివితే, కొత్త అంశాలు తెలిశాయనే ఉల్లాసం మనస్సుకు వస్తుంది. ఆ ఉల్లాసంతో ఎంత సేపు చదివినా మనస్సు అలసిపోదు. అదే రంగాగారి విజయరహస్యం, కాబట్టి ఇప్పుడు చెప్పండి. జీవితంలో విజయం సాధించాలంటే ఏం చేయాలని రంగా గారి జీవితం ప్రబోధిస్తోంది?” అని అడిగారు. “ఏ రంగంలోనైనా రాణించాలంటే వ్యక్తులు కష్టపడి చదవకూడదు. ఇష్టపడి చదవాలి. ఇదీ రంగా గారి జీవితం మనకందించే సందేశం” అన్నాడు వెంకట్రావు. విద్యార్థులందరూ అంగీకార సూచకంగా కరతాళ ధ్వనులు చేశారు. అది చూసి మాస్టారు మందహాసం చేశారు. ఆధారం: కె.ఎల్. కాంతారావు.