ఇద్దరు స్నేహితులుండేవారు ఒకరి పేరు రాము. ఇంకొకరి పేరు సోము. ఇద్దరూ పోకిరిగాళ్ళు. ఎప్పుడూ ఎవర్నో ఒకర్ని ఆటపట్టించేవాళ్లు. ఎవ్వరూ దొరకనపుడు ఒకర్నొకరు ఆటపట్టించుకొనేవాళ్ళు. ఊరంతా వీళ్ళ దెబ్బకి హడలెత్తిపోతుండేది. ఒకసారి వీళ్ళకేమీ తోచలేదు. అంటే ఏడ్పించడానికి ఎవ్వరూ చిక్కలేదు. పాపం ఇద్దరికీ ఏమీ తోచలేదు. రాము ఎలాగైనా సోమును గేలిచెయ్యాలనుకొన్నాడు. ఒక గుంట తవ్వి అందులో తాను కూచుని సోమును భయపెట్టాలని అనుకొన్నాడు. ఒక గుంట తవ్వసాగాడు. సోముకూడా ఊరుకోడుగా! వీడూ రామును ఏదో చేద్దామని ఆలోచిస్తూ బయలుదేరాడు. వాడికి రాము గుంత తవ్వడం కనబడింది. ఓమ్మో! వీడేదో చేస్తున్నట్టుంది. ఇందులో ఏదో కిటుకు వుంటుంది. అనుకొని రాముకు కనబడకుండా గమనించసాగాడు. రాము చాలా లోతు తవ్వాడు. గుంటలోపలికి వెళ్ళి ఇంకా తవ్వుతున్నాడు. బాగా అలసట వచ్చింది. అప్పుడు సోము ఓ పెద్ద ఆకును తెచ్చాడు. దానికి రంధ్రాలు రకరకాల ఆకారాలతో చేసి గుంటపైన బోర్లించి పెట్టాడు. గుంట చీకటి మయమైపోయింది. రాము పైకి చూచాడు. ఆకు రంధ్రాల్లోంచి కొంత కాంతి తన మీద పడుతోంది. చీకటి పడిందేమో అన్పించింది. పైగా అలసిపొయ్యాడు. దీంతో ఆగుంటలోనే కునుకు తీసాడు. ఇది గమనించి సోము ఆకును తీసేశాడు. అంతే గుంటలో ఎండపడింది. చురుక్కు మనడంతో రాము నిద్రలేచాడు. పైకి చూసాడు. వాడికంతా అర్థమైంది. ఇది సోముగాడి పనే అని పసిగట్టేశాడు. వాడి భరతం పట్టాలనుకొన్నాడు. రెండోరోజు సోము గుంట తవ్వడం మొదలుపెట్టాడు. అందులో దాక్కొని రామును ఏడ్పించాలని ఆలోచనను గుంట చాలా చాలా లోతుకు తవ్వుతున్నాడు. రాము వెతుక్కుంటూ వచ్చాడు. వాడికంతా అర్థమైంది. సోము గుంట తవ్వడం తనని ఏడిపించడానికేనని పసిగట్టేశాడు. సోము బాగా అలసిపోయ్యాడు. అయినా తవ్వుతున్నాడు. వున్నట్టుండి ఎక్కడి నుండి వచ్చిందో ఒక పాము వీడిమీద బుసకొట్ట సాగింది. రాముకి భయంపట్టుకొంది. పైకి రావడానికి ప్రయత్నించాడు. అలసిపొయ్యాడు గదా. ఎక్కలేకపోతున్నాడు. పాము వెంటబడుతోంది. లాభం లేదనుకొని గుంట గోడల మట్టితవ్వి కొంచెం కొంచెం గుంట పూడవసాగాడు. పాము మీద మట్టి పోశాడు. విచిత్రంగా వుంది. ఆ పాము మట్టిని తోసుకోని పైకి వస్తోంది. రాము వంటి నిండా మట్టి. ముఖం నిండా మట్టి. గోడ అంచుల్ని త్వరత్వరగా తవ్వి గుంట నింపుతున్నాడు. కళ్ళలో కూడా మట్టి పడుతోంది. పామేమో వెంటబడుతోంది. ఆఖరుకు నానా కష్టాలు పడి రాము పైకొచ్చాడు. చూస్తే ఒక సన్నటి తాడుతోపాటు ఓ పాము కూడా పైకొచ్చింది. చచ్చాంరా దేవుడా అనుకొని ఎగిరిపడ్డాడు. రాము. కొంచెం సేపటికి రాముకి అర్థమైంది ఇదంతా సోముగాడి పని అని. పరిగెత్తి వెళ్ళి వాణ్ణి పట్టుకొన్నాడు. ఇద్దరూ దొంగలేగా! ఇద్దరూ ఒకర్నిపట్టుకొని ఒకరు నవ్వుకున్నారు. ఆటపట్టించడానికి ఎవరైనా దొరుకుతారా అని ఊరి మీదికి బయలుదేరారు. సేకరణ: “న్యూగినియా” జానపద కథ.