అప్పుడు నా వయస్సు 4 సంవత్సరాలు అనుకొంటాను. అమ్మ వంటింట్లో కూరగాయలు తరుగుతుంది. అమ్మ అప్పుడప్పుడు కళ్ళు తూడుచుకోవడం చూసాను. అమ్మ కళ్ళ నుండి నీళ్ళు వస్తున్నాయి. అమ్మ ఎందుకు ఏడుస్తుంది. ఇంట్లో అమ్మా, నాన్న, నేను ముగ్గురమే ఉండేవాళ్లం. నాన్న అమ్మని ఏదో అన్నట్లున్నాడు. అందుకే అమ్మ ఏడుస్తుంది అనుకున్నాను. అమ్మని ఎందుకు ఏడుస్తున్నావని అడిగాను. నేనిప్పుడు ఏడ్చానురా? అంది అమ్మ. ఇప్పుడు కళ్ళల్లో నీళ్ళు తుడుచుకుంటుంటే నేను చూసాను అన్నాను. అదా... అమ్మ చెప్పడం మొదలుపెట్టింది. "నీ కళ్ళలోకి పొగ పోయిందనుకో అప్పుడు ఏం జరుగుతుంది?" అనడిగింది అమ్మ. కళ్ళల్లో నీళ్ళు వస్తాయి? అన్నాను నేను. “కదా! అంటే కళ్ళు మండితే కళ్ళల్లో నీళ్ళు వస్తాయన్నమాట. అలాగే నేను ఇప్పుడు ఉల్లిపాయలు కోసాను అందుకే కళ్ళలో నీళ్ళు వచ్చాయి.“ అంది అమ్మ. “ఉల్లిపాయలు కోస్తే కళ్ళల్లో నీళ్ళెందుకు వస్తాయి? “ అని అడిగాను. “మన కంట్లో కన్నీటి గ్రంధి ఉంటుంది. మనం రెప్ప వాల్చినప్పుడు ఆ గ్రంది నుండి నీరు బయటకు వస్తుంది. ఈ నీరు కంటిలోని కార్నియా (పారదర్శక పొర)ని ఎండిపోకుండా కాపాడుతుంది. కంటిలో దుమ్ము ధూళి వచ్చినప్పుడు ఈ గ్రంధి నుండి నీరు విడుదల అవుతుంది. ఈ నీటిలో ఈ దుమ్ము కడుగబడుతుంది. అలాగే ఉల్లిపాయల్లోని రసంలో గంధకం (sulpher) ఉంటుంది. మనం ఉల్లిపాయ కోసినప్పుడు ఆ రసం ఆవిరి మన కళ్ళలోకి పోయి మన కళ్ళు మండుతాయి. అందుకని కళ్ళలో నీరు వస్తుంది.“ అని చెప్పింది అమ్మ. “మరి దీనికి పరిష్కారం లేదా? “ అని అడిగాను. “ఉల్లిపాయలను ఫ్రిజ్లో ఉంచి పక్కరోజు కోస్తే కళ్ళు మండవు. కాని ఉల్లిపాయ మెత్తబడుతుంది. కాబట్టి ఉల్లిపాయలను ఇలానే కోస్తుంటాం. అయినా కాసేపు కళ్ళలో నీరు రావడం వల్ల నష్టం ఏముందిరా పైగా కళ్ళు శుభ్రం అవుతాయి. “ అని అంది అమ్మ. ఉల్లిపాయలో ఇంత పవరుందా అని అనుకున్నాను అప్పుడు. ఆధారం: ఆనంద్