అది ఒక ఎడారి ప్రాంతం. గుంపు నుండి దారితప్పిన ఒక ఒంటె ఒంటరిదైంది. దాని పేరు కిమ్మీ. అది అలా అలా నడుస్తూ ఒక ఒయాసిస్సును చేరింది. ఆ నీటి చెలమ ఒడ్డున ఖర్జూర చెట్లు, గుబురుగా ఎడారి మొక్కలు ఉండటంతో ఇక కిమ్మీ ఆ ప్రాంతంలోనే నివసించసాగింది. ఒకనాడు ఎడారిలో ప్రయాణిస్తున్న ఇద్దరు బాటసారులు ఈ నీటిచెలమ వద్ద సేదదీరారు. ఎండకు డస్సిపోయి వారి మొహాలు వడిలి ఉన్నాయి. వారిలో ఒకడు ఎంతో బడలిక తో మరీ నీరనంగా కనిపిస్తున్నాడు, “అడవి ప్రయాణం ఎంత ఆనందంగా సాగిందో! పచ్చని చెట్లు, చల్లని గాలి ఈ వేడిలో ఆ వాతావరణం తల్చుకుంటుంటేనే ప్రాణం లేచి వచ్చినట్లుంది.” అన్నాడు మొదటివాడు. “అవును, కొద్దిగా ప్రమాదమే అయినా తగిన జాగ్రత్తలు తీసుకున్నాంగా. అలాంటి పచ్చని ప్రకృతిలో పది రోజులు ప్రయాణించినా రాని అలసట ఈ కాలే ఇసుక ఎడారిలో ఒక్క పూటకే వచ్చేసిందనుకో.” అన్నాడు రెండోవాడు నిట్టూరుస్తూ. ఖర్జూర చెట్ల వెనుకగా పొదల మాటున ఉన్న కిమ్మీ వీరి మాటలు కుతూహలంగా విన్నది. ఆ పచ్చని, చల్లని అడవిని చూసి తీరాల్సిందేనని తీర్మానించుకుంది. అనుకున్నదే తడవుగా వారు వచ్చిన దిశగా వడివడిగా అడుగులు వేస్తూ అడవి వైపు సాగిపోయింది. కొన్ని రోజులకి అడవిని చేరిన కిమ్మీ ఆనందానికి అవధులు లేవు. ఆ పచ్చని ప్రకృతి అందం చూడటానికి దానికి రెండు కళ్లూ చాలలేదు. ఇంతలో ఈ కొత్త వింత జంతువును గమనించిన అడవి ప్రాణుల్లో కలకలం ప్రారంభమైంది. దాని భయంకరాకారం చూసి తమనందర్నీ గుటుక్కుమనిపించేస్తుందేమోననే ఆందోళనతో అవి గడగడలాడాయి. ఇంతలో ఆకలేసిన ఒంటె చెట్ల చిగుళ్ళు తినడం చూసి ఊపిరి పీల్చుకున్నాయి. కిమ్మీ శాకాహారేనని తెలిశాక వాటికి ధైర్యం వచ్చింది. కిమ్మీని సమీపించి వివరాలు అడిగి తెలుసుకున్నాయి. ఒక నక్క సింహం దగ్గరకెళ్లి కిమ్మీ రాకనూ, ఆ రాకకు గల కారణాలను తెలిపింది. “ఆ పెద్ద ఒంటెను చంపితే మనందరికీ బోలెడు ఆహారం పదండి.” అన్నది ఆనందంగా. సింహం వెంటనే అడవి జంతువులనన్నింటినీ సమావేశపరిచి నక్క ఉద్దేశ్యాన్ని తెలిపింది. ఇలా అంది. “ఆ ఒంటె మన అడవిని చూడాలని గంపెడాశతో ఎన్నో కలలు కంటూ వచ్చింది. వచ్చినందుకు ఎంతో సంబరపడుతోంది. అది మన అతిథి. నమ్మకం ఉన్న చోట గౌరవం ఉండాలి. దానికి ఎట్టి హానీ తల పెట్టకుండా ఉన్నన్నినాళు ఉండనిచ్చి వెళ్లదలుచుకున్నప్పుడు గౌరవంగా సాగనంపండి. అలా అని మాటివ్వండి”. సింహం మాటలకు జంతువులన్నీ ముగ్గులైపోయాయి. హర్షాతిరేకాలతో ఆనాటి నుండి సింహాన్ని మృగరాజుగా ప్రకటించుకున్నాయి. నాటి నుండి నేటి వరకు సింహమే మృగరాజుగా చెలామణీ అవుతోంది ఆధారం: గుడిపూడి రాధికారాణ