రేపు రంజాన్ పండుగ కదూ! ప్రసాద్ మాస్టారు గారి ఇంటికి వెళ్తాం. గ్రీటింగ్స్ చెబుదాం. మన అందరం వెళదాము. అంటే, నేను అమీర్, బాషా, అబ్దుల్ అందరం కలిసి వెళదాము? మన ప్రసాద్ మాస్టారు గారికి గులాబి పూలంటే మహా ఇష్టం కదా! అందుకని రంగు రంగుల గులాబి పువ్వులను సేకరించి చీకటి పడకముందే తిరిగి వచ్చేద్దాం అనుకుంటూ హుషారుగా బయలుదేరాం. అయితే ఇంతలోనే దారిలో శంకరం మాస్టారు ఎదురొచ్చారు. ఎక్కడికి బయలు దేరారు? అంటూ పలకరించారు. మా ప్రసాద్ మాస్టారు గారింటికి, గ్రీటింగ్స్ చెప్పడానికి మాస్టారు అన్నారు సంబరంగా. ఔనౌను రేపు రంజాన్ పండుగ కదూ. ఆ విషయం మరచిపోయాను. నేను కూడా వస్తాను వెళ్దాం పదండి అంటూ శంకరం మాస్టారు మాతో కలిసారు. శంకరం మాస్టారంటే అందరికి ఇష్టమే మరి. పిల్లలతో ఇట్టే కలిసిపోతారు. ఎన్నెన్నో మంచి విషయాలు చెబుతారు. దారిలో అమీర్ కి చిన్న సందేహం వచ్చింది. రంజాన్ పండుగ మనం కూడా చేసుకోవచ్చా మాస్టారు అన్నాడు. శంకరం మాస్టారు ఒక్కక్షణం ఆలోచించారు. అన్ని పండుగలూ అందరము చేసుకోవచ్చు. హిందువులైనా, క్రైస్తవులైనా, ముస్లిములైనా మనందరం సోదరులం, ఒకరి పండుగను మరొకరు గౌరవించుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటారు. ఏ మతమైన ఒక్కటే అని వివరించారు. “మతం అంటే ?”ఆసక్తిగా అడిగాడు బాషా. మతం అంటే మంచిని పెంచేది మనిషిలో మంచితనాన్నినింపేది అన్నారు మాస్టారు. మొన్న దీపావళికి మా ఇంట్లో ఎన్ని మతాబులు ఎన్ని కాకరపూలు కాల్చామో ఎన్ని టపాకాయలు పేల్చామో, దీపావళి అంటే నాకు భలే ఇష్టం అన్నాడు అబ్దుల్ మెరిసే కళ్ళతో. మీ ఊళ్లో పీర్ల పండుగ రోజు మేమంతా భేదభావం లేకుండా ఇళ్ల ముందు నిలబడి పీర్లను ఊరేగిస్తుంటే చూస్తాం. మా బంధువు ఒకాయన పులివేషం మరోకరు కోతివేషం కూడా వేస్తారు, అన్నాడు శ్రీను వాళ్ల ఊళ్లో జరిగే మొహర్రం పండుగను గుర్తు చేసుకుంటూ. ఇలా మాట్లాడుకుంటూ ప్రసాద్ మాస్టారు గారి ఇంటికి చేరుకున్నాం. ఇంటి ముందు ముత్యాల్లాంటి ముగ్గులు ఈద్ ముబారక్ అని రాసి రంగులతో మెరసిపోతూ అందరినీ ఆహ్వానించింది. అందమైన అక్షరాలు అబ్బా! మాస్టారు ఎంత బాగా రాశారో! మళ్లీ మళ్లీ చదివాడు అమీర్ ఆనందంతో చప్పట్లు కొట్టబోయాడు బాషా. వారు ఎదురొస్తున్న మాస్టారుగా అమ్మాయి శిల్ప చేతుల్లోని పూల సజ్జ జారి క్రింద పడింది. పువ్వులన్ని చెల్లా చెదరుగా ముగ్గుల మీద పడ్డాయి. అన్ని గులాబి పువ్వులే! ఎన్ని రంగులో!. ఎన్ని రకాలో శంకరం మాస్టారు అన్నారు. చూడండి పిల్లలు ఎన్ని రంగులున్నా, ఇవన్నీ పువ్వులే మనలో ఎన్ని మతాలున్నా మనమంతా మానవులం, మనమంతా ఒక్కటే. ఈ గులాబి పువ్వుల రంగులు వేరు కావచ్చు వాటిలోని గురీ ఒక్కటే! అట్లాగే మతాలు కూడా! వికసించిన మనసులతో పిల్లలు ప్రసాద్ మాస్టారుకు శుభాకాంక్షలు చెప్పాం. పిల్లలను ప్రేమగా దగ్గరకు తీసుకున్నారు. ప్రసాద్ మాస్టారు. అందరికీ మిఠాయిలు పంచారు. అబ్బాయిలూ! మరికొద్ది రోజుల్లో సంక్రాంతి పండుగ వచ్చేస్తోంది. మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ముందుగానే చెబుతున్నాను. అన్నాడు. నవ్వుతూ ముగ్గుల మధ్య రాలిన గులాబీ పూలు రాబోయే సంక్రాంతి పండుగను గుర్తు చేస్తున్నాయి. రచన: గౌతం శ్రీదేవి.