“పిల్లలూ, నేను కొన్ని పండుగల పేర్లు అడుగుతాను, అవి ఎవరు జరుపుకుంటారో చెబుతారా?“ “చెబుతాం మాస్టారు.“ అన్నారు పిల్లలందరూ. “దసరా, సంక్రాంతి, శ్రీరామనవమి పండుగలు ఎవరు జరుపుకుంటారు? జహంగీర్ నీవు చెప్పు.“ అడిగాడు మాస్టారు. “హిందూ మతం వారు మాస్టారు.“ జహంగీర్ సమాధానమిచ్చాడు. “రంజాన్?“ మాస్టారు ప్రశ్నించాడు. “ముస్లిం మతం వారు మాస్టారు.“ శ్రీను సమాధానమిచ్చాడు. “క్రిస్మస్?“ “క్రిష్టియన్ మతం వారు జరుపుకుంటారు.“ సాయిలక్ష్మీ సమాధానం. “మంచిది బాగా చెప్పారు. ఇప్పుడు మన దేశంలోని అన్ని మతాలవారు జరుపుకోవల్సిన రెండు పండుగలున్నాయి. వాటిని చెప్పగలరా? సిద్ధూ, నీవు చెప్పు.” “అవి స్వాతంత్ర్య దినోత్సవ పండుగ, రిపబ్లిక్ దినోత్సవ పండుగలు. స్వాతంత్ర్య దినోత్సవ పండుగను జనవరి 26న జరుపుకోవాలి. వీటిని జెండా పండుగలంటారు మాస్టారు. వీటిని దేశంలోని ప్రజలందరూ జరుపుకోవాలి మాస్టారు.“ సిద్ధూ వివరించాడు. “గుడ్, ముందు స్వాతంత్ర్య దినోత్సవ పండుగను గూర్చి తెలుసుకుందాం. ఆ పండుగను ఆగష్టు 15న ఎందుకు జరుపుకోవాలి? డేనియల్, నీవు చెప్పు.“ “మనకు స్వాతంత్ర్యం 1947 ఆగష్టు 15న వచ్చింది. అప్పటి వరకు మనం బ్రిటీషు వాళ్ళ బానిసలం. బ్రిటీష్ వారి నుంచి మనకు స్వతంత్ర్యం లభించినందుకు గుర్తుగా మనం ప్రతి సంవత్సరం ఆగష్టు 15న జెండా పండుగను జరుపుకోవాలి.“ డేనియల్ చెప్పాడు. “మనకు స్వతంత్ర్యం వచ్చిన రోజున అంటే 1947 ఆగష్టు 15న మన దేశస్థులు ఎంత గొప్పగా స్వతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకున్నారో తెలుసా? మీరెవ్వరూ చూడలేదు. నేను చూడలేదు. నా పెద్దలు చెప్పగా విన్నాను. ఆ రోజున దేశంలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, అస్సాం నుండి గుజరాత్ వరకు ఉన్నటువంటి భారతదేశంలోని అన్ని పట్టణాలలో, గ్రామాలలో కుల, మత, ప్రాంత భేదాలు లేకుండా అందరూ ఆ రోజును గొప్ప పండుగ దినంగా జరుపుకుంటారు. ఆనాడు ప్రతి ఇంటికీ సున్నాలు కొట్టించుకున్నారు. ఇండ్ల ముందు పెద్ద పెద్ద ముగ్గులు పెట్టుకున్నారు. ప్రతి ఇంట్లోను పిండివంటలు చేసుకొని తిన్నారు. వీధులన్నింటికీ మూడురంగుల జెండాల తోరణాలు కట్టారు. వీధుల కూడళ్లలో జాతీయ జెండాలు ఎగురవేశారు. దేశభక్తి గీతాలతో ఆనాడు దేశమంతా మార్మోగింది. ఇదీ ఆనాటి పరిస్థితి. మరి ఈనాడు ఆగష్టు 15 పండుగను ఎలా జరుపుకుంటున్నాం? ఎవరైనా చెప్పగలరా? “ అడిగాడు మాస్టారు. “ఈనాడు ప్రజలందరూ జెండా పండుగను జరుపుకోవడం లేదు మాస్టారు. కేవలం ఆఫీసుల్లోనూ, స్కూళ్ళల్లోనూ జరిగే ఒక తప్పనిసరి కార్యక్రమంగా ప్రజలు భావిస్తున్నారు.” చిన్నగా సమాధానమిచ్చాడు రాజశేఖర్. “అవును. ఈనాడు ప్రజలందరూ జెండా పండుగను జరుపుకోవడం లేదు. వీధి కూడళ్ళలో జెండా ఎగరవేసి, 52 సెకన్లపాటు జాతీయగీతం పాడుతుంటే, జెండా చుట్టూ నిలబడి ఆ గీతం పాడేవారిని, సామాన్య ప్రజలు, తాము వీధిలో వెళ్తున్నప్పుడు అడ్డుగా నిలబడిన వారిగా పరిగణించి విసుక్కుంటున్నారు. ఇటీవల జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ పండుగనాడు జరిగిన సంఘటనను మా మిత్రుడు రాజారావు వివరించాడు. ఆయన హైద్రాబాదులో ఒక వీది కూడలిలో జరిగిన జెండావందనం కార్యక్రమంలో పాల్గొన్నాడు. జెండా ఎగరవేసిన తరువాత ఆయన, ఆయన మిత్రులు జెండా చుట్టూ నిలబడి, జెండాకు వందనం చేస్తూ, జనగణమన రాగాలాపన మెదలుపెట్టారు. కొంచెంసేపు ట్రాఫిక్ కి అంతరాయం ఏర్పడింది. అంతే, వచ్చేపోయే ఆటోవాళ్ళు, స్కూటర్లు, మోటర్ సైకిళ్ళవాళ్ళూ ‘బోయ్...’ మంటూ జాతీయగీతం అయిపోయేవరకు హారన్ కొడుతూనే ఉన్నారని ఆయన చెప్పారు. ఇదీ నేటి పరిస్థితి. చూశారా? సామాన్య ప్రజల్లో దేశభక్తి ఎంతగా తగ్గిపోతుందో.” బాధగా అన్నారు మాస్టారు. “స్వాతంత్ర్యం రాకముందు ప్రజల్లో దేశభక్తి భావన బాగా ఉండేదా మాస్టారు?” అడిగాడు రాజ్ కుమార్. “అవును, ఆనాడు భారతీయుల్లో దేశభక్తి భావన తీవ్రంగా జ్వలిస్తూ ఉండేది.” “ఆనాటి విశేషాలు చెప్పరా మాస్టారు.” అడిగింది శాంతి. “వచ్చే క్లాసులో చెబుతానమ్మా.” ఆనాటి క్లాసు ముగిస్తూ అన్నారు విశ్వం మాస్టారు. ఆధారం: కె.ఎల్. కాంతారావు