ఒకానోక ముసలి గాడిద పాపం పొరపాటున కాలు జారి బావిలో పడిపోయింది. దాంతో పైకి వచ్చే దారిలేక ఘోరంగా ఆర్తనారాలు చేయడం మొదలుపెట్టింది. కనీసం తన పెడబొబ్బలు వినైనా ఎవరైనా తనను కాపాడతారని దాని ఆశ. కాని దాని యజమాని ఆలోచనలు మాత్రం మరొకలా ఉన్నాయి. ‘ఈ గాడిగ ఎలాగూ ముసలిదైపోయింది. ఇక దీన్ని బయటకు తీసి ఏం లాభం? మేత దండగ. పైగా బావి కూడా ఎందుకూ పనికి రాకుండా పాడుబడిపోయింది. కాబట్టి ఈ గాడిదను అందులో అలాగే వదిలేస్తే సరిపోతుంది.’ అనుకున్నాడు. అంతేకాదు ఆ గాడిద బతికుండగానే ఆ బావిని మట్టితో పూడ్చేయాలని కూడా నిర్ణయించుకున్నాడు. ఇంకేంముంది గాడిద యజమాని, ఒక బుద్ధి లేని గాడిదలా మట్టిని తవ్వి బావిలో పొయ్యడం మొదలుపెట్టాడు. కొంచెం సేపటికి బాగా అలసటగా అనిపించి, ఆ పనిలో సాయం చేసేందుకై తనకు తెలిసినా వాళ్ళుచే నలుగురిని పిలుచుకొచ్చాడు. వాళ్ళు కూడా బుద్ధి లేని గాడిదల్లాగా ఎడాపెడా మట్టిని తోడి బావిలో పొయ్యిసాగారు. మొదట్లో కొద్దిసేపటి దాక గాడిద పాపం హృదయ విదారకంగా అరిచింది. ఆ తరువాత ఉన్నట్టుండి. అది అరవడం మానేసింది. బావిలోకి ఆఘమేఘాల మీద మట్టిని తోడి పోస్తున్న పెద్దమనుషులు దీనిని అసలు గమనించనే లేదు. ఏదో పూనకం వచ్చిన వాళ్ళలా తట్టలతో మట్టిని నింపి దాన్ని అదే పనిగా బావిలోకి కుమ్మరిస్తూ పోయారు. పని పూర్తి కావస్తోంది. ఇంకో 30-40 గంపలు మట్టిని పోస్తే చాలు. బావి పూర్తిగా నిండిపోతుంది. అయితే... ఇంతలో ఉన్నట్టుండి బావిలోంచి గాడిద చెంగున బయటకు దూకింది. అప్పటిదాకా చెమటలు కక్కుతూ బావిలోకి మట్టిని పోస్తున్న పెద్దమనుషులంతా నోళ్ళు వెళ్ళబెట్టి నిలబడిపోయారు. అసలింతకూ ఏం జరిగిందంటే.... తన మీద మట్టి పడటం మొదలవగానే గాడిదకు అసలు విషయం అర్దమైపోయింది. అందుకే అది గుండెలవిసేలా ఏడ్చింది. అయితే ఉన్నట్టుండి దానికో మెరుపులాంటి ఆలోచన వచ్చింది. తన మీద పడే మట్టిని ఎప్పటికప్పుడు కింద దులిపేసి దాని మీద నిలబడితే ... ఇంకేం వెంటనే దాన్ని అమలు చేయడం మొదలుపెట్టింది. మనుషులు వేసే మట్టిని ఎప్పటికప్పుడు దులిపేస్తూ, ఎలాగైతేనేం అది మళ్ళీ బావిలోంచి బయటపడింది. ఎంత తెలివిగా ప్రవర్తించిందో కదా.... ఏమంటారు ?