మనం తినే సోడియం క్లోరైడ్ (ఉప్పు), కార్బన్ టెట్రా క్లోరైడ్ సమ్మేళనాలలో క్లోరిన్ ఎలా ఉంటుందో పరీక్షచేసి చూద్దామా! ఈ ప్రయోగం చేయటానికి సోడియం క్లోరైడ్, కార్బన్ టెట్రాక్లోరైడ్, సిల్వర్ నైట్రేట్, పరీక్షనాళికలు, డ్రాపర్, స్వేదజలం కావాలి. ఒక పరీక్షనాళికలో అతిచిన్న సిల్వర్ నైట్రేట్ స్పటికాన్ని స్వేదజలంలో కరిగించి ద్రావణాన్ని తయారు చేసుకోవాలి. మరో పరీక్షనాళికలో చిన్న సోడియం క్లోరైడ్ స్పటికాన్ని స్వేదజలంలో కరిగించి ద్రావణం తయారు చేయండి. మరో పరీక్షనాళికలో ఒకటి రెండు చుక్కల కార్బన్ టెట్రాక్లోరైడ్ ద్రవాన్ని తీసుకోండి. సోడియం క్లోరైడ్ ద్రావణం ఉన్న పరీక్షనాళికలో డ్రాపర్ సహాయంతో ఒకటి రెండు చుక్కల సిల్వర్ నైట్రేట్ ద్రావణాన్ని కలిపి బాగా గిలకరించి పరిశీలించండి. కార్బన్ టెట్రా క్లోరైడ్ ద్రవం ఉన్న పరీక్షనాళికలో కూడ ఒకటి రెండు చుక్కల సిల్వర్ నైట్రేట్ ద్రావణం కలిపి గిలకరించి పరిశీలించండి. మీ పరిశీలనలో సోడియం క్లోరైడ్ ద్రావణం ఉన్న పరీక్షనాళికలో తెల్లని అవక్షేపం ఏర్పడటం గమనిస్తారు, కార్బన్టెట్రా క్లోరైడ్ ద్రవం ఉన్న పరీక్షనాళికలో సిల్వర్ నైట్రేట్ ద్రావణం తెల్లని అవక్షేపం ఏర్పరచదు. ఈ రెండు సమ్మేళనాలలో ఉన్న క్లోరిన్ ఒకే విధంగా లేదని మీకు అర్ధం అయింది కదా! సిల్వర్ నైట్రేట్ లో సిల్వర్ అయాన్, నైట్రేట్ ఆయాన్ స్వతంత్రంగా ఉండే అయానిక్ పదార్థం. సోడియం క్లోరైడ్ గూడ సోడియం అయాన్, క్లోరైడ్ అయాన్లు స్వతంత్రంగా ఉండే అయానిక్ పదార్థం. కనుక సిల్వర్ నైట్రేట్ ద్రావణం సోడియం క్లోరైడ్ ద్రావణానికి కలపగానే నీటిలో కరగని సిల్వర్ క్లోరైడ్ తెల్లని అవక్షేపంగా ఏర్పడింది. కార్బన్ టెట్రాక్లోరైడ్ ద్రవంలో స్వతంత్రంగా ఉండే క్లోరైడ్ అయాన్లు లేవు కాబట్టి సిల్వర్ క్లోరైడ్ తెల్లని అవక్షేపం రాలేదు. నేస్తాలు మరొకటి గమనించండి. సోడియం క్లోరైడ్ స్వేదజలంలో కలిసి ద్రావణం ఏర్పడింది. ఒక పరీక్షనాళికలో రెండు మూడు చుక్కల కార్బన్ టెట్రాక్లోరైడ్స్ స్వేదజలంలో కరిగించే ప్రయత్నం చేసి పరిశీలించండి, అది నీటిలో కరగదు. దృవద్రావణాలైన నీరువంటి వాటిల్లో స్వతంత్ర అయాన్లుగా వున్న సోడియం క్లోరైడ్ లాంటి అయానిక్ పదార్దాలు లేక ద్రవపదార్థాలు (ఆల్కహాల్ లాంటివి) కరుగుతాయి. కార్బన్ టెట్రాక్లోరైడ్ వంటి స్వతంత్ర ఆయాన్ లు లేని లేక అదృవన మయోజనీయ సంయోగ పదార్థాలు నీటిలో కరగవు. మరో పరీక్షనాళికలో పది చుక్కల కార్బన్ టెట్రా క్లోరైడ్ లో కొంచెం నాప్తలీన్ పొడిని కలిపి గిలకరించి పరిశీలించండి. నాప్తలీన్ కరిగి ద్రావణం ఏర్పడుతుంది. నాప్తలీన్ అదృవ సమయోజనీయ పదార్థం కనుక అద్భవ సమయోజనీయ పదార్ధమైన కార్బన్ టెట్రా క్లొరైడ్ లో కరిగింది. బంధాల స్వభావాన్ని బట్టి ఎలాంటి బంధాలున్న సంయోగ పదార్థాలు అలాంటి బంధాలున్న ద్రావణుల్లోనే కరుగుతాయని తెలుస్తుంది కదూ! నేస్తాలూ! "Like dissolve like" అనేది అర్ధం అయింది కదూ! ఆధారం: ఎం. ఆదినారాయణ