ప్రధానోపాధ్యాయుల గదిలో గుండు సూదులు పిన్ హోల్డర్ పెట్టెకు అతుక్కొని ఉండటం చూసి వుంటారు కదూ! ఫ్రిజ్ తలుపు తీసి దగ్గరకు వేయగానే అది మూసుకుపోతుండటం చూసి ఉంటారు కదూ! వీటికి కారణం అయస్కాంత క్షేత్ర ప్రభావం. అయస్కాంత క్షేత్రం మన కంటికి కనబడదు. . అయస్కాంత క్షేత్రం ఎలా ఉంటుందో చూడటానికి మనము ఒక ప్రయోగం చేసి చూద్దాం. ఈ ప్రయోగం చేయటానికి ఒక దండాయస్కాంతం, కొంచెం ఇనుప రజను, పారదర్శకంగా ఉన్న గాజు సీసా, కొబ్బరి నూనెలు అవసరం, మొదట ప్రయోగంలో దండాయస్కాంతాన్ని బల్ల మీదుంచి దానిపై తెల్ల కాగితాన్ని పెట్టాలి. ఆ కాగితంపై ఇనుప రజనును చల్లి కాగితాన్ని సున్నితంగా అటు ఇటు కదిలించాలి. ఇనుప రజను కాగితంపై విస్తరించిన ఆకారాన్ని గమనించండి. ప్రక్క పటములో మాదిరిగా కాగితంపై ఇనుప రజను విస్తరించిన ఆకారంలోని గీతలు ఒక వైపు నుంచి మరొక వైపు వ్యాపించి ఖండించుకోకుండా వున్నాయి కదూ! పటములో మాదిరిగా దండాయస్కాంతంలోని ఏ భాగమైతే ఎక్కువగా ఇనుపరజను ఆకర్షించుకొన్నదో వాటిని అయ్యస్కాంత ధృవాలు అంటారు. దండాయస్కాంత రెండు చివరలు రెండు ధృవాలన్న మాట. ఇనుప రజను దండాయస్కాంతం ఒక ధృవం నుంచి మరొక ధృవం వైపుకు గీతలులాగ స్థిరపడి వ్యాపించి ఉండటాన్ని, ధృవాల బయటకు కూడా గీతలలాగా వ్యాప్తిచెందినట్లు మీరు గమనిస్తారు. దీనినే అయస్కాంత క్షేత్రం అంటారు. ఈ క్షేత్రంలోనికి అయస్కాంత పదార్థాన్ని తెస్తే ఆకర్షించబడుతుంది. అయస్కాంత క్షేత్రాన్ని మీరు ఊహా రేఖలతో వర్తించవచ్చును. ఆ రేఖలను అయస్కాంత బలరేఖలు అంటారు. మీరు ఈ అయస్కాంత బలరేఖలను త్రిమితీయంగా చూడాలంటే మరొక ప్రయోగం చేయండి. గాజు సీసాలో కొబ్బరినూనె తీసుకొని దానిలో కొంచెం ఇనుపరజను వేసి బాగా కలపండి. దండాయస్కాంతానికి ఒక కొన సన్నని దారం కట్టి ఆ సీసాలో మరొక కొన వేలాడదీసి కొంచెం సేపు పరిశీలించండి. మీరు త్రిమితీయంగా అయస్కాంత క్షేత్రాన్ని ప్రక్క పటంలో చూపిన విధంగా ఏర్పడడాన్ని చూస్తారు. భూమి కూడా ఒక పెద్ద అయస్కాంతమని మనకు తెలుసు. అంటే అయస్కాంత క్షేత్రం భూమి చుట్టూ వ్యాపించివున్నది కదూ! మనమందరం అయస్కాంత క్షేత్రంలో ఉన్నట్లేగా సైన్సును ప్రయోగాలతో నేర్చుకొంటే మీరు ఎన్నో విషయాలకు నిత్య జీవితానికి అన్వయించుకోవచ్చు. ఆధారం: ప్రొ. యం. ఆదినారాయణ