కావలసిన వస్తువులు : ఒకేసైజు గల రెండు ప్లాస్టిక్ గరాటులు. రెండు దళసరి అట్టముక్కలు. ఫెవికాల్. ఏవస్తువైనా ఎత్తునుండి పల్లానికి దొర్లుతుంది. కాని మనం తయారు చేయబోయే గరాటుల జంట భూమ్యాకార్షణ సిద్ధాంతాన్ని లెక్కచేయకుండా ఎత్తుకు ఎగ బాకుతుంది. మిమ్మల్ని, మీ స్నేహితుల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఒకే సైజు గల రెండు ప్లాస్టిక్ గరాటులను వాటి వెడల్పైన భాగాలను దగ్గరగా చేర్చి ఫెవికాల్ తో అతికించాలి. బొమ్మలో చూపిన ఎ.బి.సి.డి. ఆకారంలో రెండు దళసరి అట్ట ముక్కలను కత్తిరించుకోవాలి. రెండు చివరలను దగ్గరగా చేర్చి అతికిస్తే పటంలో చూపినట్లు ఒకవాలుతలం వస్తుంది. ఇప్పుడొక పెన్సి ల్ ను గాని, రూళ్లకర్రను గాని ఆ వాలుతలంపై ఉంచితే ఎత్తునుండి పల్లానికి దొర్లుతుంది. ఇప్పుడు మీరు తయారు చేసుకున్న గరాటుల జంటను వాలుతలంపై వదిలిపెడితే గరాటుల జంట ఎత్తుకు ఎగబాకుతుంది. ఎందుకిలా జరుగుతుంది ? ప్రతి వస్తువు స్థిరత్వం కోసం తమ గరిమనాభిస్థానాన్ని భూమికి దగ్గరగా ఉంచుకోవాలని ప్రయత్నిస్తుంది. మన పరికరంలో భూమ్యాకర్షణ శక్తిని అధిగమించి గరాటుల జంట ఏటవాలుగా పైకి ఎక్కుతున్నట్లు కనిపిస్తుంది. కాని అది పూర్తిగా నిజం కాదు. < ఆకారంలో అట్టముక్కలను పెట్టడం వల్ల పైకి వెళ్ళిన కొద్దీ మార్గం వెడల్పై గరాటుల లోపలికి దిగబడుతాయి. వాటి గరిమనాభి భూమికి దగ్గరగా వస్తుంది. గరాటులేమో భూమికి దగ్గరవుతుంటాయి. మనకేమో ఎత్తుకు ఎక్కుతున్నట్లు కనిపిస్తుంది. గరాటులు వ్యాసార్థం కంటే ఎ.బి.సి.డి. ఎత్తుల మధ్యబేధం తక్కువగా ఉండాలి. గరాటుల వ్యాసం 3 అంగుళాలుంటే ఈ భేధం ఒకటిన్నర అంగుళాలు దాటకూడదు. గరాటుల మూతల మధ్యదూరం కన్నా విడిగా ఉన్న అట్టముక్క చివరల మధ్యదూరం తక్కువగా ఉండాలి.