సైన్స్ మ్యాజిక్ కు రంగం సిద్ధమయ్యింది. విద్యార్థులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది అంతర్జాతీయ కాంతి సంవత్సరం కదా. నిన్నటి రోజులాగే ఈ రోజు కూడా కాంతికి సంబంధించిన మ్యాజిక్ నే మెజీషియన్ చేసి చూపిస్తాడేమో అనుకుంటున్నారు విద్యార్థులు. మెజీషియన్ సుబ్బు ఠీవిగా ప్రవేశించాడు. ఆయన్ను చూడగానే అంతా చప్పట్లు కొట్టారు. మెజీషియన్ అందర్నీ చిరునవ్వుతో పలకరించాడు. మ్యాజిక్ షో కు ఏర్పాట్లు మొదలుపెట్టాడు. టేబుల్ పైన నీటితో నింపిన ఒక సీసా ఉంది. మెజీషియన్ చేతిలో లేజర్ పాయింటర్ ఉంది. పాయింటర్ ను 'ఆన్' చేసి సీసా మూతను వదులు చేశాడు. లేజర్ పాయింటర్ కు ఎదురుగా సీసాకు ఉన్న రంధ్రం నుంచి నీరు సన్నని ధారగా కింద ఉన్న బకెట్ లో పడుతోంది. మెజీషియన్ హాల్లోని లైట్లన్నీ ఆర్పివేయడంతో సీసా నుంచి పడుతున్న నీటిధార ఆకుపచ్చని కాంతితో మెరిసిపోయింది. అంతా చప్పట్లు కొట్టారు. ఈ మ్యాజిక్ మనం కూడా చెయ్యగలం. ఇందుకు కావలసినవి ఖాళీగా ఉన్న ప్లాస్టిక్ సీసా (సుమారు 2 లీటర్ల పరిమాణం గల సోడా బాటిల్), టేపు, సీసాకు రంధ్రం చేసేందుకు హాండ్ డ్రిల్, డ్రిల్ బిట్స్, నీరు, ఆకుపచ్చ లేజర్, ప్లాస్టిక్ బకెట్, బల్లలు 2. ముందుగా సోడా బాటిల్ కింది భాగానికి దగ్గరగా హాండ్ డ్రిల్ సాయంతో ఒక రంధ్రం చేయాలి. ఈ రంధ్రం సుమారు 8 మి.మీ. ఉండవచ్చు. రంధ్రాన్ని టేపుతో మూసి తర్వాత సీసాను నీటితో నింపాలి. సీసామూతికి బిరడా బిగించాలి. సీసాను ఒక బల్ల మీద ఉంచి రంధ్రానికి దిగువన ఒక బకెట్ ఉంచాలి. లేజర్ పాయింటర్ ను వేరే ఒక బల్ల మీద ఉంచి లేజర్ కాంతి పుంజం రంధ్రం మధ్యలోంచి సీసాగుండా పోయేవిధంగా అమర్చాలి. ఇప్పుడే టేపును తొలగించి సీసాకు అమర్చిన బిరడాను వదులుచేయాలి. నీటిధార ఆకుపచ్చని కాంతితో మెరిసిపోతుంది. సీసారంధ్రం నుంచి కిందికి పడే నీటితో బాటు కాంతి కూడా వంగినట్లే కనిపించడం వల్ల నీటి ధార ప్రకాశిస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుంది? కాంతి సంపూర్ణాంతర పరావర్తనం (Total Internal Reflection) ఇందుకు కారణం. కాంతి ఒక యానకం నుంచి ఇంకొక యానకంలోకి ప్రయాణించేటప్పుడు కాంతిలో కొంతభాగం వక్రీభవనం (refraction) చెందగా మరికొంత భాగం పరావర్తనం (reflection) చెందుతుంది. వక్రీభవన కోణంకు సంబంధించి స్నెల్ నియమం (Snell’s law) గుర్తించుకోవాలి. కాంతి కిరణం సాంద్రతర యానకం (నీరు) నుంచి విరళయానకం (గాలి)లోకి ప్రయాణించినప్పుడు పతనకోణం (θ1) కంటె వక్రీభవన కోణం (θ2) ఎక్కువగా ఉంటుంది. θ1 విలువ ఒకానొక నందిగ్ధ విలువ (θc)కి సమానమైనప్పుడు వక్రీభవనకోణం 90o ఉంటుంది. అంటే కాంతి కిరణం రెండు యానకాలను వేరు చేసే తలాన్ని స్పృశిస్తూ పోతుంది. θ1 విలువ θc కంటే ఎక్కువైనప్పుడు కాంతికిరణం సాంద్రతర యానకంలోనికే పరావర్తనం చెందుతుంది. సంపూర్ణాంతర పరావర్తనం అంటే ఇదే. ఈ మేజిక్ లో లేజర్ కాంతి నీటిధారలో వరుసగా సంపూర్ణాంతర పరావర్తనం చెందడం వలన నీటిధార కాంతిని తన కూడా తీసుకుపోతుంది. అందుచేతనే నీటిధార ఆకుపచ్చని కాంతితో ప్రకాశిస్తుంది. ఈ మేజిక్ లో సీసాలోని నీటిస్థాయి తగ్గే కొలిదీ నీటి ధార వక్రత్వం లేదా వంకర (Curvature) తగ్గిపోతుంది. అందుచేత సీసాకు దగ్గరవుతుంది. క్రిందపడే నీటిని సేకరించేందుకు బకెట్ ను బకెటే ను సర్దుబాటు చేసుకోవాలి. జాగ్రత్త: లేజర్ చాలా శక్తివంతమైన కాంతి పుంజం. అందుచేతనే ఈ మేజిక్ ను టీచర్ పర్యవేక్షణలోనే చేయాలి. లేజర్ కాంతి కంటికి తగలకుండా జాగ్రత్త పడాలి. కొద్దిగా గురయినా కంటికి శాశ్వతంగా గాయమవుతుంది. ఆధారం: ఇ. ఆర్. సుబ్రహ్మణ్యం