కాగితాన్ని మంటల దగ్గరికి తెస్తే చాలు అది భగ్గున అంటుకుంటుంది. అలాంటి కాగితం గిన్నెలో నీళ్ళు కాగబెట్టడమా ! ఇదసలు సాధ్యమయ్యే పనేనా అనుకుంటున్నారు కదూ ?.... అవుతుందో కాదో మీరే ప్రయత్నించి చూడండి. ఇక్కడి పటంలో చూపిన పద్ధతిని అనుసరించి ముందుగా ఒక కాగితం పాత్రని తయారు చేసుకొండి. తరువాత ఈ గిన్నెలో నీటిని నింపి, నీటితో సహా దానిని వెలిగే కొవ్వొత్తి జ్వాలపై ఉంచండి. ఈ పని చేసేటప్పుడు మీరు ముఖ్యంగా రెండు విషయాల్లో జాగ్రత్త తీసుకోవలసి వుంటుంది. కొవ్వొత్తి జ్వాల కాగితపు అంచులను తాకకూడదు. కాగితపు గిన్నెలో నీళ్ళు లేని భాగాన్ని కూడా జ్వాల తాకకూడదు. ఈ జాగ్రత్తలు పాటిస్తూ, కొంచెం ఓపిగ్గా కొవ్వొత్తి జ్వాలపై పాత్రను నిలబెట్టి ఉంచితే చాలు. కొద్ది సేపటికే అందులోని నీళ్ళు మరగడం మొదలవుతుంది. ఇది ఎలా సాధ్యమవుతుందంటే........ కొవ్వొత్తి జ్వాల నుంచి కాగితం గ్రహించే వేడిని అది ఎప్పటికప్పుడు నీటికి అందిస్తూ వస్తుంది. దీని మూలంగా కాగితం వంద డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతను పొందలేదు. ఈ సందర్భంగా మరొక ముఖ్యమైన విషయాన్ని మనం గుర్తించవలసి వుంటుంది. నీరు మరిగే ఉష్ణోగ్రత - అంటే నీరు ఆవిరిగా మారే ఉష్ణోగ్రత 100 డిగ్రీల సెంటిగ్రేడ్, అయితే, కాగితానికి మంటలంటుకోవడానికి అవసరమైన ఉష్ణోగ్రత అంతకన్నా చాలా ఎక్కువగా వుంటుంది. కాగితపు గిన్నెలో నీటిని పోసి వేడిచేసినప్పుడు ఆ కాగితపు వేడిమి ఏ దశలోనూ (అందులోని మొత్తం నీరు అయిపోయేదాకా) 100 డిగ్రీల సెంటిగ్రేడ్ ను దాటలేదు. సరిగ్గా ఈ కారణంగానే కాగితం కాలిపోకున్నా నీళ్ళు మాత్రం మరుగుతాయి. తమాషాగా అన్పిస్తుంది కదూ. ఇది నిజం.