నున్నగా ఉన్న ఓ కాగితాన్ని తీసుకుని బల్లపై నిలబెట్టి ఉంచిన ఓ రెండు గ్లాసులపై దానిని పెట్టండి. ఇప్పుడీ కాగితపు వంతెనపై మరో గ్లాసుని కూర్చోబెట్టేందుకు ప్రయత్నించండి. ఏం జరుగుతుందో తెలుసా? పటంలో చూపిన విధంగా కాగితపు వంతెన వెంటనే కుప్పకూలిపోయి గ్లాసు కింద పడిపోతుంది. ఇప్పుడు అదే కాగితాన్ని రెండవ పటంలో చూపినట్లుగా (ఇంటి రేకుల్లాగా) మడతబెట్టి మళ్ళీ, గ్లాసులపై పడుకోబెట్టండి. ఇప్పుడీ వంతెనపై ఓ గ్లాసుని నిలబెట్టండి. ఏం జరుగుతుందో తెలుసా? అది ఏ మాత్రం చెక్కుచెదరకుండా చక్కగా దానిపై నిలబడుతుంది. బల్లపరుపుగా వుండే ఉపరితలాన్ని కన్నా అనేక వంపులలో కూడిన ఉపరితలాలు ధృడంగా వుండడమే ఇందుకు మూలకారణం. గాల్లో బల్లపరుపుగా ఉన్న కాగితం మీద గ్లాసుని ఉంచినప్పుడు, గ్లాసు తాలూకు బరువంతా కాగితంపై ఒకేచోట కేంద్రీకృతమవడం వల్ల, ఆ బరువంతా కాగితంపై ఒకేచోట కేంద్రీకృతమనడం వల్ల, ఆ బరువుని మోయలేక ఆ వంతెన కూలిపోయింది. దీనికి భిన్నంగా, కాగితాన్ని మడతలుగా చేసి పెట్టినప్పుడు, గ్లాసు తాలూకూ బరువుని కాగితానికి సంబంధించిన అనేక ప్రదేశాలు పంచుకున్నందు వల్ల గ్లాసు భారానికి ఆ వంతెన కూలిపోకుండా నిలబడగలిగింది. ఇదీ అసలు విషయం ! ఇంటిపై కప్పులుగా వాడే సిమెంటు రేకులు, లోహపు రేకులు సరిగ్గా ఈ కారణంగానే, నున్నగా ఉండగా అనేక వంపులలో వుంటాయన్న సంగతి మీరు ఈ పాటికే గ్రహించి వుంటారు. అవునా. వచ్చేసారి మరికొన్ని ప్రయోగాలతో కలుసుకుందాం. సరేనా.