మీ సైన్స్ ఉపాధ్యాయుల సహాయంతో ఈ ప్రయోగం చేస్తే మీకు ఎన్నో విషయాలు అర్థం అవుతాయి. ఈ ప్రయోగానికి చిటికెడు కాపర్ సల్ఫేట్ (దీనినే మైలుతుత్తం అంటారు) జింక్ లోహం, ఇనుప మేకు, కాపరు లోహం, రెండు పరీక్ష నాళికలు, పరీక్షనాళిక స్టాండు కావాలి. ఒక పరీక్షనాళికలోకి కాపర్ సల్ఫేట్ స్ఫటికాలను తీసికొని నీటిలో కరిగించండి. ఈ ద్రావణాన్ని రెండు భాగాలుగా చేసి రెండు పరీక్షనాళికలలోకి తీసుకోవాలి. మొదటి పరీక్షనాశికలోని కాపర్ సల్ఫేట్ ద్రావణానికి కొంచెము జింక్ లోహాన్ని కలిపి గిలకరించి పరీక్షనాళిక స్టాండ్లో వుంచండి. రెండవ పరీక్షనాళికలోని ద్రావణంలో ఇనుప మేకును వుంచండి. జాగ్రత్తగా పరిశీలించండి. జింక్ లోహం వేసిన పరీక్షనాళికలోని నీలిరంగు మాయమవుతుంది. ఇది ఎలా జరిగింది? కాపర్ సల్పేట్ లోని కాపర్ ఆయన్లు జింక్ లోహంతో చర్య జరిగి కాపర్ లోహంగా మారటం వలన నీలిరంగు మాయమయింది. ఈ చర్యను క్రింది విధంగా రాస్తారు. CuSO4 + Zn → ZnSO4 + Cu కాపర్ సల్ఫేట్లోని కాపర్ ఆయాన్లను జింక్ స్థానభ్రంశం చేసింది. అందుకనే ఈ చర్యను స్థానభ్రంశ చర్య అంటారు తెలుసా! అంతే కాదు నేస్తాలూ! పై చర్యలో కాపర్ సల్ఫేట్లో కాపర్ మీద రెండు ధన ఆవేశాలు ఉంటాయి. క్రియాజనకం నుండి క్రియాజన్యంలోకి మారేసరికి ఆ రెండు ధనావేశాలను కోల్పోతుంది. ఆవేశంలేని క్రియాజనకం జింక్ లోహం క్రియాజన్యంగా మారేసరికి రెండు ధనావేశాలను పొందుతుంది. ఈ చర్యను కిందివిధంగా రాస్తారు. Zn → Zn2+ + 2e- జింక్ లోహం రెండు ఎలక్ట్రాన్ లను పొగొట్టకున్నది, అందుకే ఈ చర్యను ఆక్సీకరణ చర్య అంటారు. జింక్ లోహాన్ని క్షయకరణి అంటారు. పైన వెలువడిన రెండు ఎలక్ట్రాన్లను ధనవేశంగల కాపర్ ఆయాన్ గ్రహించి కాపర్ లోహంగా మారుతుంది. ఎలక్ట్రానలు పొందినది గనుక చర్యను క్షయకరణచర్య అంటారు. ఈ చర్యను కింది విధంగా రాస్తారు. Cu2+ + 2e- → Cu Cu2+ ఆయాన్ ను ఆక్సీకరణ అంటారు. ఆక్సీకరణం క్షయకరణం రెండూ జరుగుచున్నాయి గనుక దీనిని రిడాక్స్ చర్య అంటారు. రెండవ పరీక్షనాళికలో వున్న ఇనుపమేకును పరిశీలించినట్లయితే దానిమీద కాపర్ లోహం పొర ఏర్పడటం గమనిస్తారు. నీలిరంగు మాయమై లేత ఆకుపచ్చ రంగు ద్రావణం ఏర్పడుతుంది. ఈ చర్యను కింద చూపినట్లు రాస్తారు. CuSO4 + Fe → FeSO4 + Cu ఈ చర్యలో గూడ Cu2+ ఆయాన్లను Fe2+ ఆయాన్లు స్థానభ్రంశం చేస్తాయి. గనుక యీ చర్యను గూడ స్థానభ్రంశ చర్య అంటారు. పై చర్యలో గూడ Fe రెండు ఎలక్ట్రాన్లు పొగొట్టుకుంటుంది. మరి Cu2+ ఆ రెండు ఎలక్రాన్లను తీసుకొంటుంది. గనుక దీనిని కూడా రెడాక్స్ చర్య అంటారు. జింక్ సల్ఫేట్ ద్రావణాన్ని, ఫెర్రస్ సల్ఫేట్ ద్రావణాన్ని రెండు వేరువేరు పరీక్షనాళికలలో తయారుచేసి రెండింటిలో కాపర్ లోహాన్ని ఉంచితే ఏమవుతుందో ఊహించండి? ఆధారం: ప్రొ. ఎం. ఆదినారాయణ