రోజుకో కోడిగుడ్డు... ఆరోగ్యానికి వెరివెరి గుడ్డు. ప్రతిరోజు ఒక కోడిగుడ్డు (ఫారం కోడిగుడ్డు) శాఖాహారమని చెబుతున్నారు కదా. మరి కోడిగుడ్డుతో ఒక తమాషా చేద్దామా... రండి! చేసి చూద్దాం. మీ ఇంట్లో బంధువులు అందరూ కలిసినప్పుడు ఒక పందెం కాయండి. మీ దగ్గర రెండు కోడిగుడ్లు ఉన్నాయి. ఒకటి ఉడకపెట్టండి. ఒకటి పచ్చిది. మరి పందెం ఏమిటంటే వాటిని పగలగొట్టకుండా ఏది పచ్చిదో, ఏది ఉడికినదో చెప్పాలి. దీనికి మీరు కొంత హోంవర్క్ చేయాలి. ఒక కోడిగ్రుడ్డును తీసుకొని ఉడకబెట్టి బాగా చల్లార్చండి. అంటే ఉడికిన గుడ్డు, పచ్చిగుడ్డు రెంటినీ ముట్టి చూసినట్లయితే రెండూ ఒకే ఉష్ణోగ్రతలో వుండాలన్నమాట (లేకుంటే కాస్త వేడిగా వుంటే మీ బంధువులు ఉడికిన గుడ్డును కనిపెట్టేస్తారు కదా!). ఇపుడు పైన చెప్పిన పందెం కాయండి. ఎలాగూ వాళ్ళు చెప్పలేరు. మీరు పందెం గెలుస్తారు. మరి మీరు చెప్పాలి కదా. ఎలా చేస్తారు? ఇలా... రెండు గుడ్లను బొంగరంలా తిప్పి వదలండి. ఒక గుడ్డు గుండ్రంగా తిరుగుతుంది. మరొకటి వంకరతింకరగా తిరుగుతుంది. రెండిటినీ అంటీ అంటనట్లు తాకినట్లయితే ఒక గుడ్డు వెంటనే ఆగుతుంది. రెండవ గుడ్డు ఇంకా తిరుగుతూనే ఉంటుంది. ఎందుచేత. పచ్చికోడిగుడ్డులో తెల్లపోన, పచ్చసోన ద్రవస్థితిలో కదులుతూ వుంటుంది. కనుక గరిమానాభి మారుతూ వుంటుంది. అందుకే అది వంకర తింకరగా తిరుగుతూ వుంటుంది. దీనిని తాకిన తరువాత కూడా తిరుగుతుంది. ఎందుకంటే పైన పెంకు ఆగింది. కానీ లోపల వున్న సొన (ద్రవం) యొక్క చలన జడత్వము వలన తిరుగుతుంది. అది పచ్చిగుడ్డు. అదే ఉడకబెట్టిన గుడ్డు లోపల తెల్లసోన, పచ్చసోన ఘనీభవించి పెంకుకు అంటుకొని వుంటుంది. కనుక గుండ్రంగా తిరుగుతుంది. తాకిన వెంటనే ఆగిపోతుంది. ఇది ఉడికిన గుడ్డు. ఇక్కడ చలనజడత్వము వర్తించదు. ఈ జడత్వం వలననే మనం బస్సులో ప్రయాణించినప్పుడు డ్రైవరు హటాత్తుగా బ్రేకు వేస్తే మనము ముందుకు పడుతాము. తెలిసిందా! ఉంటా మరి... బై... ఆధారం: యం.ఎస్. యుగంధర్