మొదట బోయు నీరు బీజములకెక్కి మొదటి కురక వేగ మొలకలెత్తు మొలక పృధివి చెరిగి వెలయు వృక్షంబు విశ్వదాభిరామ వినురవేమ! ఎండలు ముదురుతున్నాయి. నీటికి కటకట, మనుషులకే ఇలావుంటే ఇక పక్షులు, మానుమాకుల సంగతేంటి? అందుకే పక్షుల కోసం ఆరుబయట చిన్న డబ్బాలలో నీరు వుంచండి. చెట్లకు నీరు పోయండి. వేమనగారు పై పద్యంలో ఎంచక్కా మొక్కల గురించి వివరించాడు. విత్తనం భూమిలో పాతి నీరు పోస్తే ఆ విత్తనం (బీజం) మొలకెత్తుతుంది. మరలా నీరు పోస్తూవుంటే మొక్క పెరిగి వృక్షము (మాను) అవుతుందని వేమనగారు పర్యావరణ ప్రియంగా ఆ నాడే సెలవిచ్చారు కదా. ఇక గమ్మత్తు గోళీ గురించి చూద్దామా. మీరెపుడైనా గోళీఆట, బొంగరాలాట ఆడారా? అరే, బాబూ అసలు మాకు ఆటస్థలమే లేదు... ఆటలూ లేవు. అసలు మాకు చాలా స్కూళ్ళలో PET మాస్టరు లేడు. ఇక ఆటలా? భ్రమ. పిచ్చి భ్రమ అంటూ... ఇక అందులోనూ దేశవాళీ గోళీ ఆటలు, బొంగరాలు గింగరాలు జాంతానై. అంటారా? మేమైతే చిన్నప్పుడు అవన్నీ ఆడుకున్నాం. అపుడు టీవి, సెల్, సొల్లు ఫోన్లు వాట్సప్, ఫేస్ బుక్ ఇలాంటివి లేవు. సరే ..సరే.. మరి ఈ గోళీకాయతో ఓ పందెం కాస్తామా. “టేబుల్ పై గోళీ (గాజుగోళీ) ని వుంచి దానిని చేతితో ముట్టకుండా పైకి తీయగలరా?” అని పందెం కాయండి. మీ స్నేహితులు ప్రయత్నించి ఓడిపోతారు. అంతే మీరు గోళీని తాకకుండా గోళీని గాలిలోనికి పైకి లేపి పందెం సులభంగా గెలిచేస్తారు. ఎలా గంటారా? రండి, చేసి చూద్దాం! కావలసిన పరికరాలు: గాజుగోళీ, గాజుసీసా. చేయు విధానము: గాజు గోళీని టేబుల్ పై వుంచండి. ఎవరూ తాకకుండా పైకి ఎత్తలేరు కనుక వీరలెవల్లో ఫోజు గొట్టి మీరు లేపడానికి తయారుకండి. ఏమీలేదు. గాజు సీసాను పటములో చూపిన విధంగా గోళీపై సీసాను బొర్లించండి. "అబ్రకదబ్ర.... అబ్రకదబ్ర... గిలిగిలి ఛూ... గిలిగిలి ఛూ...” అని మంత్రం వేసినట్లు రెండు చేతులూ అలాగా సీసాపై గాలిలో వూపండి. మీరు కూడా చేత్తో గాజు సీసాను పట్టుకొని టేబుల్ పై ఒకేచోట గుండ్రంగా తిప్పండి ఇలా తిప్పేటప్పుడే సీసా టేబుల్ ను తాకుతూ వుండాలి. అలా తిప్పుతూ గోళీని తాకుతూ తిప్పండి. మెల్లగా గోళీ సీసా లోపల సీసా అంచును తాకుతూ సీసాతో పాటు తిరగడం మొదలవుతుంది. సీసా అంచు కొంచెం లోపలికి వంగి వుంటుంది కనుక గోళీ మెల్లగా సీసాలోనికి ఎగబ్రాకుతుంది. మీరు సీసాను. అలా తిప్పుతూ మెల్లగా పైకి ఎత్తండి. అంటే సీసాతో పాటు సీసాలో తిరుగుతున్న గోళీ కూడా పైకి లేస్తుంది, లోపల తిరుగుతూ వుంటుంది, మీరు సీసా తిప్పుతున్నంత సేవు గోళీ లోపల తిరుగుతూ వుంటుంది. ఇపుడు సీసా నిటారుగా తిప్పండి. అంతే సీసాలో గోళీ... గాలిలో తేలీ... పందెం గెలిచారు. చూశారా, గోళీని ముట్టకుండా పైకి తీసారు కదా! ఇదెలా సాధ్యం? అసలేం జరిగింది? గాజుపాత్ర తిరుగుతూ వున్నప్పుడు గోళీని తాకినపుడు ఘర్షణ బలం వల్ల సీసాతోపాటు గోళీ తిరగడం మొదలవుతుంది. ఈ గోళి తిరుగుతూ వున్నప్పుడు అపకేంద్రబలం (Centrifugal force) వల్ల గాజు పాత్రకు అంటుకుని వుంది, గాజుపాత్ర వంపువల్ల లోపలికి వెళ్ళి తిరుగుతూవుంటుంది. వెలుపలికి పడకుండా వుంటుంది. అందువల్ల గాజుసీసా పైకి ఎత్తినపుడు క్రిందపడకుండా వుంటుంది. గాజు సీసా ఆగిపోతే అపకేంద్రబలం తొలగిపోతుంది. గోళీ పడిపోతుంది. అందుకే సీసాను నిటారుగా చేసి గోళీని సీసాలోకి పట్టుకున్నాం. అదన్న మాట... ఆధారం: యం. యుగంధర్ బాబు