“మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగినకొద్దీ ఒదగమని అర్థమందులో వుంది.” అన్నాడో సినీకవి. “A blade of grass”అనే పాఠంలో 'రస్కిన్ బాండ్' గడ్డి మొక్క గొప్పదనం గురించి ఎంత ఎదిగినా ఒదిగి వుండాలని చెప్తాడు. “ఢిల్లీకి పాదుషా అయినా తల్లికి బిడ్డేకదా” అనేది మా నాయనమ్మ. అంటే అడిగిమణిగి సేవకుడిలా వుండాలని కాదు. ఎంత గొప్పగా ఎదిగినా మూలాలు మరిచిపోకూడదని, గర్వం తలకెక్కకూడదని అర్థం. అది సరే ఒదిగి ఎదిగే మొక్క ఏమిటో చూద్దామా. కాంతి కోసం వెదుకుతూ కాంతితో పాటు ఎదుగుతూ ఒదుగుతూ పెరిగే మొక్క సంగతి. అదే దాగుడుమూత దండాకోర్... కాంతిని వెదికే మొక్క జోర్. అంతర్జాతీయ కాంతి సంవత్సరం సందర్భంగా కాంతికి మొక్కకు వున్న సంబంధం తెలియజేసే ఓ ప్రయోగం చేద్దామా. రండి చేసి చూద్దాం. కావలసిన వస్తువులు: చెప్పుల (షూ) అట్టపెట్ట పెద్దది. రెండు అట్టముక్కలు గం టేపు, చిన్న పూల కుండీలో మొలకెత్తుతున్న బంగాళదుంప, కాంతి (ఎండ). చేయు విధానం: చెప్పులు కొన్నప్పుడు ఇచ్చే పెద్ద అట్టె పెట్టె ఒకటి తీసుకోండి. దానిని పటంలో చూపిన విధంగా అడ్డంగా నిలబెట్టండి. మూతపక్కన పెట్టి a, b అట్టముక్కలను పెట్టెలో నిలువుగా అమర్చాలి. అమర్చేటప్పుడు ‘a” అట్టముక్క పెట్టె పై భాగాన్ని తాకుతూ క్రింద 1 సెం.మీ. జాగా వదిలి గం టేపుతో అతికించాలి. అంటే పెట్టెమూత మూస్తే ‘a’ అట్ట కింద నుంచి మాత్రమే ఎడమవైపున వున్న అరలోకి కాంతి ప్రవేశించాలి. ఆ విధంగా ఖచ్చితంగా ‘a’ అట్టముక్కను కత్తిరించాలి. అదే విధంగా 'b' అట్టముక్కను ఖచ్చితంగా కత్తిరించి పెట్టె క్రింది భాగం తాకుతూ పైన 1 సెం.మీ. జాగా వదిలి అతికించాలి. ఇప్పుడు పటంలో చూపిన విధంగా ఎడమవైపు అర, మధ్య అర, కుడివైపు అర మొత్తం మూడు అరలు ఏర్పడతాయన్న మాట. తరువాత ఓ చిన్న కుండిలో మొలకెత్తుతున్న బంగాళదుంప (ఉర్లగడ్డ) మొక్కను తీసుకొని తగినంత నీరు పోసి ఎడమవైపున వున్న అరలో అమర్చి పెట్టె మూత మూసి గం టేపుతో కాంతి చొరబడకుండా అతికించండి. పెట్టెకు కుడివైపున పటంలో చూపిన విధంగా ఓ రంధ్రం చేయండి (2 సెం.మీ. వ్యాసంతో). ఈ అమరికను ఎండపడే చోట నుంచి ఓ రెండు మూడు రోజులు కదలకుండా వుంచాలి. 3 రోజుల తరువాత గమనించినట్లయితే పటంలో మాదిరి మొక్క పెరిగి ‘a' అట్టముక్క క్రిందుగా మధ్య అరచేరి 'b' అట్టముక్క మీదుగా కుడివైపున గల రంధ్రం గుండా వెలుపలికి వచ్చి వుంటుంది. ఇలా ఎందుకు జరిగింది. దాని కథాకమామిషు ఏమిటో చూద్దామా. మొక్కలలో కాంతికి (సూర్యరశ్మికి) స్పందించే గుణం గల కణాలు వుంటాయి. దీని వల్ల కాంతి పడినప్పుడు కాంతివైపుగా మొక్క వంగుతుంది. పై ప్రయోగంలో చెప్పుల పెట్టెలో ఎక్కడా కాంతి చొరబడకుండా గం టేపు వేశాము కదా, కుడివైపున వున్న రంధ్రం గుండా కాంతి ప్రవేశించి 'b' అట్టముక్క పై భాగం గుండా ప్రయాణించి ‘a' ముక్క క్రిందికి చేరి పెరిగే మొక్కపై పడుతుంది. దీనికి స్పందించి మొక్క పెరిగి పటంలో చూపిన విధంగా రంధ్రం గుండా వెలుపలికి వస్తుంది. కానీ మీరు గమనించినట్లయితే మొక్క కాస్త తెలుపురంగులో వుంటుంది. దీనికి కారణం బాక్స్ లో తక్కువ కాంతి ప్రవేశించడం వల్ల మొక్కలకు కావలసినంత 'క్లోరోఫిల్' అందదు కనుక మొక్క తెలగా వుంటుంది. ఇదే విషయం రాళ్ళ క్రింద పెరిగి బయటకు వచ్చే మొక్కలలో మీరు గమనించే వుంటారు. రాయి క్రింద పెరిగిన భాగం తెల్లగా వుండి, వెలుపలికి వచ్చిన మొక్క భాగం ఆకుపచ్చగా వుంటుంది. చూశారా! మొక్కల పెరుగుదలకు కావలసిన అతి ముఖ్య పదార్థం సూర్యకాంతి. దాని కోసం మొక్క దాగుడుమూతల దండాకోర్.. అది కాంతిని వెదుకుతూ వంకర్లు తిరిగి బయటకు వచ్చింది మొక్క అదన్న మాట విషయం. అదే కాంతికి మొక్కలకు వున్న సంబంధం. ఉంటా మరి. ఆధారం: పలమనేరు యుగంధర్