ద్రావణాలు చాలా రకాలుగా ఏర్పడతాయి. వాటిని తయారుచేసి పరిశీలించి తెలుసుకుందామా. ఈ ప్రయోగానికి గాజుగ్లాసులు, పరీక్షనాళికలు, స్పూను, ఉప్పు, కాపర్ సల్ఫేట్, చక్కెర, నీరు, కొబ్బరినూనె, వంటనూనె, పాలు, కుండలు చేసే మట్టి అవసరం. ఒక గ్లాసులో సగం వరకు నీరు తీసుకొని దానిలో ఒక స్పూను ఉప్పువేసి బాగా కలిపి గమనించండి. ఆ నీళ్ళలో ఒకవైపు ఉప్పుగాను మరొకవైపు చప్పగాను ఉంటుందా? ఉండదు. అంటే ఉప్పు స్పటికాలు వీటిలో సమానంగా పంపిణీ జరిగాయన్నమాట. అన్ని పదార్థాలను సమానంగా పంపిణీ జరిగిన మిశ్రమాన్ని ద్రావణం అంటారు. ఇంకొక గ్లాసులో సగం వరకు నీరు తీసుకొని నాలుగు స్పూనుల ఉప్పువేసి కలపండి. రెండు గ్లాసులలో నీళ్ళు రుచికి ఒకే విధంగా ఉంటాయా? రెండవ గ్లాసులో నీళ్ళు ఉప్పుకౌసంగా ఉంటాయి కదా. అంటే సంఘాలుకాలు రెండు గ్లాసులలో ఒకే విధంగా లేవని తెలుస్తుంది. ద్రావణం ఏర్పడటంలో కరిగించుకునే పదార్థాన్ని ద్రావణి అని, కరిగే పదార్థాన్ని ద్రావితం అని అంటారు. ద్రావణంలో ద్రావణి అధికంగాను, ద్రావితం అల్పంగాను ఉంటయి. ఉప్పునీళ్ళ మిశ్రమంలో ఉప్పు ద్రావితం నీరు ద్రావణి కదా. ఈ ద్రావణంలో ఉప్పుకణాలు కంటికి కనిపిస్తాయా? కనబడవు. అది ఒక ఏకరీత మిశ్రమం. మరొక గ్లాసులో సగం వరకు నీరు తీసుకొని నాలుగు స్పటికలు కాపర్ సల్ఫేట్ వేసి కలపండి. ఏమి గమనించారు? నీలిరంగు ద్రావణం ఏర్పడుతుంది. దీనిలో కాపర్ సల్ఫేట్ ద్రావితం, నీరు ద్రావణి. పై ద్రావణానికి మరికొన్ని కాపర్ సల్ఫేట్ స్పటికాలు వేసి కలిపి, రంగు పరిశీలించండి. ఏమి గమనించారు? నీలిరంగు తీక్షణత పెరుగుతుంది కదూ. అంటే సంఘటనకాలు మారాయన్నమాట. ఈ ద్రావణంలో కాపర్ సల్ఫైట్ కణాలు కంటికి కనిపించాయా? కనబడవు. ఇది కూడా ఏకరీతి మిశ్రమం. పై రెండు ద్రావణాలు ఘనద్రావితం, ద్రవద్రావణితో ద్రావణాలు కదూ... చాలా రదార్థాలు పూర్తిగా నీటిలో కరుగుతాయి కాని కొన్ని పదార్థాలు కొంచమే కరుగుతాయి. ఒక ద్రావణిలో ద్రావితం కరిగే సామర్ధ్యాన్ని దాని ద్రావణీయత అంటారు. కొన్ని పదార్థాలు నీటిలో కరగవు. కాని వేరే ద్రావణి లో కరుగుతాయి. ఒక ద్రవం మరొక ద్రవంలో కరిగి ద్రావణం ఏర్పరుస్తాయి. నీటిలో అల్కహాలు కరిగి ద్రావణం ఏర్పడుతుంది. మీరు ఒక పరీక్షనాళికలో వంటనూనె కొంచెము తీసుకొని దానికి కొన్ని చుక్కల కొబ్బరినూనె వేసి కలపండి. ఏమి గమనించారు? కొబ్బరినూనె వంటనూనెలో పూర్తిగా కరిగి ద్రావణం ఏర్పడుతుంది. ఇది ద్రవంలో ద్రవం కరిగి ఏర్పడిన ద్రావణం. ఇది కూడ ఏకరీతి మిశ్రమం. వాయువు ద్రవంలో కరిగి ఏర్పడే ద్రావణం ఏమిటో ఊహించండి. మీరు సోడా ఎప్పుడైనా త్రాగారా? కార్బన్ డై ఆక్సైడ్ నీటిలో కరిగించితే ఏర్పడేదే సోడా, ఇది వాయువు ద్రవంలో కరిగి ఏర్పడే ద్రావణం. మీరు ఇత్తడితో చేసిన బిందెలు, చెంబులు, కంచుతో చేసిన గంటలు, ఉక్కుతో చేసిన బాయిలర్లు, ట్యాంకులు చూసి ఉంటారు కదూ! ఇత్తడి పసుపురంగులో కాపర్, జింక్ లోహాలను కరిగించి కలిపి ఘనీభవిస్తే ఏర్పడిన ద్రావణం. కంచు కాపర్, టిన్ లోహాలను కరిగించి కలిపి ఘనీభవిస్తే ఏర్పడిన ద్రావణం. అదేవిధంగా ఉక్కు కూడా ఇనుము, మాంగనీస్, బొగ్గును కరిగించి కలిపి ఘనీభవిస్తే ఏర్పడిన ద్రావణం. రెండు లేక ఎక్కువ లోహాలతో ఏర్పడిన ద్రావణాలను మిశ్రలోహాలంటారు. ఇవి అన్ని కూడ ఏకరీతి మిశ్రమాలే. నేస్తాలూ! మనము వేరే రకమైన మిశ్రమాలను తయారుచేద్దామా! రెండు గ్లాసులలో సగం వరకు నీరు తీసుకొని ఒక గ్లాసులో ఒక స్పూను పంచదార, మరొక గ్లాసులో ఒక స్పూను కుండలు చేసే మట్టిని వేసి బాగా కలిపి పరిశీలించండి. పంచదార నీటిలో కరిగి ద్రావణం ఏర్పడుతుంది. మట్టినీటిలో కరగదు వేరే రకమైన మిశ్రమం వస్తుంది. దీనిని అవలంబనం అంటారు. ఇది కూడా ఏకరీతి మిశ్రమం లాగా ఉండి, కంటికి కనబడే మట్టి కణాలు నీటిలో తేలుతూ కనిపిస్తాయి. ఒక గంట తరువాత మట్టికణాలన్ని గ్లాసు అడుగుకు పేరుకొని నీరు పైన ఉండటం గమనిస్తారు. అంటే అవలంబనంలోని సంఘటకాలు మిశ్రమంగా కలసి ఉండవన్నమాట. నేస్తాలు మరొక గ్లాసులో సగం వరకు నీరు తీసుకొని, నాలుగు లేక ఐదు చుక్కల పాలను వేసి కలపండి. తెల్లని ద్రావణం ఏర్పడుతుంది. పాలలోని వెన్న (కొవ్వు) పదార్థం నీటిలో కలిసి ఏకరీతి మిశ్రమం వస్తుంది. దీనిలోని కొవ్వు కణాలు చాలా చిన్నవిగా ఉండి కంటికి కనిపించవు కాని అవలంబనంలాగే వుంటాయి. కణాలు చాలా చిన్నవిగా ఉండటం వలన అవి ఎప్పటికి అడుగుకు పేరుకోవు. అలాంటి ద్రావణాలను కాంజికాభ (Colloidal) ద్రావణాలు అంటారు. కొవ్వు పదార్థకణాలు మిశ్రమంలో ఏకరీతిని ఎల్లప్పుడు కలిసి ఉంటాయి. ఇలాంటి ద్రావణం ఉపరితలం నుండి లేజర్ కాంతి కిరణాలను పంపితే కాంతికిరణాలు వంగి ప్రసరించే మర్గాన్ని మీరు చాడవచ్చు. లేజర్ కాంతి కిరణాల పతనకోణాన్ని మారుస్తూ సంపూర్ణాంతర పరావర్తన ప్రక్రియను గమణాన్ని మారుస్తూ సంపూర్ణాంతర పరావర్తన ప్రక్రియను గమనించవచ్చు. పరిశుద్ధ నీటిలో కాంతిమార్గం కనిపించదు. మరొక మిశ్రమాన్ని తయారుచేద్దాం. ఒక పరీక్షనాళికలో సగం వరకు నీరు తీసుకొని నాలుగు చుక్కల కొబ్బరి నూనె వేసి బాగా కలపండి. ఈ ద్రవాల మిశ్రమాన్ని ఎమల్షన్ అంటారు. ఒక దానిలో మరొకటి కరగని రెండు ద్రవాల మిశ్రమంతో ఎమల్షన్ ఏర్పడుతుంది. కొంచెంసేపు మిశ్రమాన్ని కదలించకుండా ఉంచితే రెండు ద్రవాలు పొరలుగా వేరవుతాయి కదూ. ఈ విధంగా ఎన్నో విజ్ఞానశాస్త్ర విషయాలు మీరే చేసి తెలుసుకోవచ్చు కదూ! ఆధారం: ప్రొ. ఎం. ఆదినారాయణ