నీటి పై ఓ బెండుముక్క వేస్తే ఏమవుతుంది? తేలుతుంది కదా. చెక్కముక్క వేస్తే...? పచ్చిచెక్క అయితే మునుగుతుంది. బాగా ఎండిపోయిన ముక్క అయితే తేలుతుంది కదా. నీవు రోజూ స్నానం చేస్తావా. మంచి ఆరోగ్యం కోసం, శుభ్రంగా ఉండడం కోసం ప్రతి రోజూ స్నానం చేయడం చాలా మంచిది. స్నానం చేసేటప్పుడు బకెట్ లో నుంచి మగ్గుతో నీరు తీసేటప్పుడు నీవు ఒకటి గమనించి వుంటావు. నీటితో నిండిన మగ్గు బకెట్ లోని నీళ్ళలో మునిగి వున్నపుడు తేలికగా అనిపిస్తుంది, నీటి బయటకు తీసినపుడు కాస్త బరువు పెరిగినట్లు అనిపిస్తుంది కదా. అది ఎందుచేత? ప్రతి ద్రవము తనలో మునిగిన వస్తువులపై ఊర్ధ్వ పీడనం (upward pressure) కలుగజేస్తుంది. ఇది ద్రవాల లక్షణం. నీరు కూడా ఓ ద్రవమే కదా. వస్తువులు నీటిలో మునిగి వున్నపుడు, తేలి ఉన్నపుడు వాటిపై నీరు ఊర్ధ్వ పీడనం కలుగజేస్తుంది. ఇది తెలుసుకొనడానికి ఓ చిన్న ప్రయోగం చేద్దామా? రండి చేసి చూద్దాం.. కావలసిన వస్తువులు: స్ట్రా, U క్లిప్ (లేక జమ్ క్లిప్), దారము, నీరుగ్లాసు, స్కేలు. విధానము: స్ట్రా తీసుకొని దారంతో మధ్యలో లూప్ లాగ ఓ ముడివేయండి. U క్లిప్ (లేక జంక్లిప్)కి దారం కట్టి దానికి, స్ట్రాకి కుడివైపున లూప్ ముడివేసి కట్టండి. మధ్య దారంతో స్ట్రాను త్రాసు లాగా పట్టుకోండి. బరువును సరిచేస్తూ లూప్ దారాలను జరుపుతూ స్ట్రాను క్షతిజ సమాంతరంగా ఉండేటట్లు జంక్లిప్ స్థానాన్ని, స్ట్రా, దారం స్థానాన్ని సరిచేయండి. స్ట్రా కు ఎడమవైపున స్కేలు అమర్చండి. స్కేలుపై స్ట్రా చివర చూపే రీడింగ్ ను గుర్తించండి. తరువాత జంక్లిప్ మునిగేలా నీరు గల గ్లాసును అమర్చి గమనించాలి. స్ట్రా త్రాసు మెల్లగా ఎడమవైపుకు వంగుతుంది. కుడివైపు కాస్త పైకి లేస్తుంది. ఇది ఎందువల్ల జరిగిందో ఇదివరకు చెప్పుకున్నాం కదా. స్కేలుపై స్ట్రా ఎంతదూరం క్రిందకు వంగిందో రీడింగ్ గుర్తించండి. ఇపుడు నీటి గ్లాసుకు బదులు మీరు అందుబాటులో వున్న వేరే ద్రవాల గ్లాసులు తీసుకొని పై ప్రయోగం చేయండి. ఉదాహరణకు కిరోసిన్, వేరుశనగ నూనె, పాలు. అన్ని ద్రవాలలో స్ట్రా వంగడం ఒకేవిధంగా వుందా? వేరువేరుగా ఉందా? అని గమనించండి. వాటిని పోల్చండి. వేరు వేరు ద్రవాల ఊర్ధ్వ పీడనం వేరువేరుగా వుంటుందని మనకు తెలుస్తుంది. ఊర్ధ్వ పీడనం ద్రవాల సాంద్రతపై ఆధారపడి వుంటుంది. ఆధారం: యుగంధర్ బాబు