చేతులకు గ్లోవ్స్ తొడుక్కొని, కళ్ళజోడు పెట్టుకొని ఎప్పటిలానే తనదైన డ్రెస్సు, చేతిలో మంత్రదండం లాంటి కర్రను పట్టుకొని వేదిక మీదకు వచ్చాడు మెజీషియన్ సుబ్బు. విద్యార్థుల్లో ఎంతో ఉత్సాహం కొట్టొచ్చినట్లు కన్పిస్తోంది. “ఉరుములు, మెరుపులతో గాలి వాన మనలో చాలామందికి అనుభవమే, రసాయనాలను ఉపయోగించి పరీక్షనాళికలో ఇలాంటి పరిస్థితిని సృష్టిస్తాను చూడండి. దూరం నుంచి కూడా మీకు కనిపిస్తుంది . అందుకని, టేబుల్ దగ్గరకు రాకండి” అన్నాడు మెజీషియన్. అనీష్ మెజీషియన్ ను బాగా గమనిస్తున్నాడు. మెజీషియన్ ఒక బాయిలింగ్ ట్యూబ్ అంటే మరుగునాళిక తీసుకున్నాడు. ఇది మామూలు పరీక్షనాళిక తీసుకున్నాడు. ఇది మామూలు పరీక్షనాళిక కంటే కొంచెం పెద్దది. ఘనపరిమాణం 60 మి.లీ. దాకా ఉంటుంది. అందులోకి ఒక సీసాలో ఉన్న రంగులేని ద్రవం పోశాడు. నాళికను ఒక గాజు బీకరులో నిలబెట్టాడు. ఒక పిప్పెట్ తో వేరే సీసాలో ఉన్న రంగులేని ద్రవాన్ని తీసుకొని నెమ్మదిగా నాళికలో ఉన్న ద్రవం మీద పోశాడు. రెండు ద్రవాలు వేర్వేరు పొరల్లాగా ఏర్పడ్డాయి. ఇప్పుడు మెజీషియన్ ఒక కాగితం పొట్లం విప్పి అందులోంచి కొన్ని రంగు స్పటికాలను నాళికలో వేశాడు. వేదికమీద లైట్లను ఆర్పివేశారు. కొన్ని క్షణాల్లోనే మరుగునాళికలో నిప్పుల కణాలు, శబ్ధాలు ఏర్పడ్డాయి. అంతేగాక, పరీక్షనాళికలో చిన్న చిన్న బుడగలు కనిపించాయి. అంతా చప్పట్లు కొట్టారు. వేదిక మీద లైట్లు మళ్లీ వెలిగించాడు. ఈ మెజిక్ ను మనం కూడా చేయవచ్చు. కానీ చాలా జాగ్రత్త అవసరం సుమా. ఇందుకు కావలసినవి: 95% ఇధైల్ ఆల్కహాల్ (రెర్టిఫైడ్ స్పిరిట్) 10 మి.లీ., గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లం 10 మి.లీ., పొటాషియం పర్మాంగనేట్ స్పటికలు 2 గ్రా., గాజు బీకరు, పిప్పెట్, మరుగునాళిక (బాయిలింగ్ బ్యూబ్) ముందుగా బాయిలింగ్ ట్యూబ్ లో సుమారు 10 మి.లీ. గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లం తీసుకోవాలి. దీన్ని ఒక ఖాళీ బీకరులో నిలబెట్టాలి. ఒక పిప్పెట్ లోకి సుమారు 10 మి.లీ. ఇధైల్ ఆల్కహాల్ లేదా ఎసిటోస్ ను తీసుకొని బాయిలింగ్ ట్యూబ్ లోని సల్ఫ్యూరిక్ ఆమ్లం మీద జాగ్రత్తగా పోయాలి. ఈ రెండు రంగులోని ద్రవాలు వేర్వేరు పొరలుగ ఏర్పడతాయి. సల్ఫ్యూరిక్ ఆమ్లం సాంద్రత ఎక్కువ కాబట్టి అది అడుగు పొరగా ఉంటుంది. ఈ రెండు పొరలు కలిసిపోకుండా జాగ్రత్తపడాలి. పొటాషియం పర్మాంగనేట్ స్పటికలను నెమ్మదిగా ఈ రెండు ద్రవాలున్న నాళికలోకి విడిచిపెట్టాలి. కొన్ని క్షణాల్లోనే రసాయన చర్య జరిగి ఉరుములు, మెరుపుల మాదిరిగా నిప్పురవ్వలు, శబ్దాలు ఏర్పడతాయి. నాళికల్లో వాన మాదిరిగ చిన్న చిన్న బుడగలు కూడా కనిపిస్తాయి. లైట్లు ఆర్పివేస్తే మెరుపులు మరింత స్పష్టంగా కనిపిస్తాయి. ఇలా ఎందుకు జరిగింది? పరీక్షనాళికలో జరిగిందేమిటి? ఇదేమి మాయ కాదు, మంత్రం కాదు. రసాయనచర్యే ఇందుకు కారణం. సల్ఫ్యూరిక్ ఆమ్లం, పొటాషియం పర్మాంగనేట్ ల చర్యలో మాంగనీస్ హెప్టాక్సైడ్ ఏర్పడుతుంది. ఇది ఆల్కహాల్ లేదా ఎసిటోస్ ను తాకినప్పుడు తీవ్రమైన చర్య కారణంగా ప్రేలుతుంది. ఈ చర్యలో బాగంగానే ఉరుములు, మెరుపులు ఏర్పడతాయి. ఈ మెజిక్ ను చేసేటప్పుడు చేతులకు గ్లోవ్స్ వేసుకోవాలి. కళ్ళజోడు పెట్టుకోవాలి. సల్ఫ్యూరిక్ ఆమ్లం ఒంటి మీద, బట్టల మీద పడకుండా జాగ్రత్తపడాలి. ప్రయోగం తర్వాత పరీక్ష నాళికను టంగ్స్ సహాయంతో పట్టుకొని వేరే పెద్ద బీకరులో ఉన్న నీటిలో పడేయాలి. చర్య జరుగుతున్నప్పుడు ఒక్కొక్కప్పుడు పరీక్షనాళిక బ్రద్దలయ్యే అవకాశం ఉంది. అందుకే ఆన్ని వేరే ఖాళీ బీకరులో ఉంచడం మంచిది. ఆధారం: ఇ.ఆర్. సుబ్రమణ్యం