పరిచయం; చేపలు నీటిలో ఈదుతూ ఉంటే చూడాలనే కోరిక అందరికీ ఉంటుంది. కానీ అదే చేప నీటిపై తేలుతూ పరుగెడుతుంటే ఎలా ఉంటుంది? ఇక్కడ ఈదబోయే చేప నిజంగానే నీటిపైన తేలుతూ పరుగెడుతుంది. కానీ అది నిజమైన చేప కాదు. అయినా నిజమైన చేపలాగే పరుగులు పెడుతుంది. కావలసిన వస్తువులు: టంగ్ క్లీనర్, కర్పూరం, ప్లేటు, నీరు చేయువిధానం: ఒక ప్లేటులో నీటిని పోయండి. టంగ్ క్లీనర్ ని పటంలో చూపినట్లు ఒక చేప ఆకారంలో కట్ చేసి తోక భాగంలో కర్పూరపు ముద్దను ఉంచండి. ఇప్పుడు దానిని నీటిలో వేయండి. చేపలాగే గిరగిర తిరుగుతుంది. ఆశ్చర్యంగా ఉంది కదూ. మరి ఇలా గిరగిర తిరగడానికి కారణం ఒకసారి ఆలోచించండి. వివరణ: నీటికి ఉన్న తలతన్యత వలన ప్లాస్టిక్ చేప అలా పరుగులు తీస్తు ఉంటుంది. కర్పూరం దాని వెనుక భాగంలో ఉండడం వలన వెనుక భాగంలో తలతన్యత అనే ఒక పొర పగిలిపోతూ ఉంటుంది. తలతన్యత అనే ఆ పొర ప్లాస్టిక్ చేప జరజరా జారుతూ ముందుకు పరుగులు పెడుతుంది. తలతన్యత పొరకు అంటుకు పోయిన ప్లాస్టిక్ పేపర్ తలతన్యత గల ప్రదేశానికి పరుగెడుతుంది. కాసేపయ్యాక ఆగి పోతుంది. ఒక పేపర్ సహాయంతో నీటిపైన గల కర్పూరం నెమ్మదిగా తుడిచి వేస్తే తిరిగి ఈ చేప చకచకా పరుగులు తీస్తుంది. చేయడానికి చాలా సులువైనది. ఏదీ మీరు కూడా ప్రయత్నించండి. ఆధారం: శ్యాంసుందర్ రెడ్డి