జీవితం అంటే పందెం, గెలిచే పందెం. గెలిచి తీరవలసిన పందెం అన్నారు పెద్దలు. అడవిలో ఉదయాన్నే సింహం నిద్రలేచి పందెం వేసుకుంటుందట, “అడవిలోని బలహీనమైన జింక కంటే నేను వేగంగా పరిగెత్తాలని“, అలాగే అదే అడవిలో బలహీనమైన జింక పందెం వేసుకుందట, “అడవిలోని బలమైన సింహం కంటే నేను వేగంగా పరిగెత్తాలని. “ అలా అయితేనే సింహంకు ఆహారం దొరుకుతుంది లేదా జింక పిల్ల చాపు నుండి తప్పించుకోగలుగుతంది కదా. మరి అలాంటి ఈ పందేల ప్రపంచంలో మనం కూడా ఓ చిన్న పందెం స్నేహితులతో కాద్దామా. ఏమిటి ఆ పందెం? తొందర వద్దు బాబూ... చెబుతాను. ఒక పళ్ళెం తీసుకోండి. అందులో చిన్న గ్లాసు నీరు పోతుంది. నీటిలో ఒక రూపాయి నాణేన్ని వేయండి. ఇప్పుడు “నీటిలో వేలు పెట్టకుండా నీటిని పారపోయకుండా చేతిలో నాణేన్ని తీయండి.” అని పందెం కాయండి. ఎవ్వరూ తీయలేరు. గెలుపు మీదే. కానీ మీరు తీయాలి కదా, ఎలాగంటారా? రండి చేసి చూద్దాం. ఒక గాజు గ్లాసు తీసుకొని అందులో కాగితాన్ని ఉండలాగా కూర్చి, అగ్గిపుల్లతో వెలిగించి నాణెం గల పళ్ళెంలో తలక్రిందులుగా బోర్లించండి. కాగితం కాలిపోతుంది. ఆశ్చర్యంగా పళ్ళెంలోని నీరు గ్లాసులోనికి ఎగబ్రాకుతుంది. నాణెంపై నీరు తొలగిపోతుంది. అంతే నీటిలో వేలు పెట్టవలసిన అవసరం లేకుండా నాణేన్ని తీసివేయండి. అంతే. అసలు ఏం జరిగింది. కాగితపు వుండ కాలుతున్నప్పుడు గ్లాసులోని గాలి నుండి ఆక్సీజన్ ను పూర్తిగా వినియోగించుకొని మండుతుంది. (మండటానికి ఆక్సీజన్ అవసరం కదా) గాలిలో 1/5 వంతు ఆక్సీజన్ వుంటుందని తెలుసుకదా. గ్లాసులో ఆక్సీజన్ ఖాళీ చేసిన స్థలంలోనికి వెలుపలి గాలిపోవడానికి ప్రయత్నించి పళ్ళెంలోని నీటిపై వత్తిడి కలుగజేస్తుంది. అందువల్ల నీరు గ్లాసులోనికి ఎగబాకుతుంది. ఇదే చిట్కాతో పల్లెలో దిష్టి తీస్తారు. పళ్ళెంలో నీరు పోసి పేడముద్ద పెట్టి, కొబ్బరి చిప్పను అంటించి మనిషికి దిష్టితీసి, ఆ మండుతున్న చిప్పను పేడముద్ద పై పెట్టి పెద్ద పాత్రను బోర్లిస్తారు. అంతే పెద్ద శబ్దం చేస్తూ నీరంతా పాత్రలోనికి వెళుతుంది. దిష్టి పోయిందని బుకాయిస్తారు. మరి ఈ దిష్టి తీయడం అంటే ఒట్టివే అని మీకు అర్థమయింది కదా. ఆధారం: యం.ఎస్. యుగంధర్