చలికాలంలో తెల్లవారుఝామునే మంచులో తడుస్తూ సూర్యుని లేలేత కిరణాలతో చలి కాచుకుంటూ ఉహూహూ అని వణుకుతూ నడిచే అనుభవం మీకు కలిగిందా? అది మరవలేని మధురానుభవం కదా! మరి అలాంటి చలికాలంలో ఒక మంచు ముక్కతో తమాషా చేద్దామా. నీటిలో తేలియాడే ఐస్ ముక్కను చేతితో తాకకుండా కేవలం ఒక అగ్గిపుల్ల సహాయంతో బయటకు తీయగలవా? అని మీ స్నేహితునితో పందెం కాయండి. అతను తీయలేడు. అప్పుడు మీరు సులభంగా తీసివేయవచ్చు. ఎలాగంటారా? రండి చేసి చూద్దాం. పటంలో చూపిన విధంగా నీటిలో తేలియాడే ఐస్ ముక్క మీద అగ్గిపుల్లను ఉంచి కొంచెం పొడి ఉప్పును చల్లి, కాసేపటికి తరువాత చూసినట్లయితే పుల్ల ఐస్ ముక్కకు అంటుకొని వుంటుంది. అపుడు సులభంగా అగ్గిపుల్లను బయటకు తీస్తే పుల్లకు అంటుకుని వున్న ఐస్ ముక్క నీటి నుండి వెలుపలికి వస్తుంది. అంటే మీరు పందెంలో గెలిచారు. ఇది ఎలా జరిగింది? మామూలు మంచి నీరు గడ్డ కట్టినంత సులభంగా ఉప్పు నీరు గడ్డ కట్టదు. మనము చల్లిన ఉప్పు పొడి ఐస్ ముక్క మీద తేలుతూ కొంత ఐస్ ను కరిగిస్తుంది. ఈ చర్యకు కావలసిన ఉష్ణాన్ని అగ్గిపుల్ల క్రిందవున్న కరిగిన నీటి నుండి (అక్కడ ఉప్పు లేదు, ఉప్పునీరు లేదు) తీసుకుంటుంది. అప్పుడు అగ్గిపుల్ల కొంచెం కిందకు (ఐస్ ముక్కలోనికి) దిగుతుంది. ఉప్పంతా కరిగిన తరువాత, ఈ ఉప్పునీరు కాసేపటికి ఘనీభవిస్తూ, ఐస్ గా మారుతూ అగ్గిపుల్ల మీదుగా గడ్డకడుతుంది. దీంతో అగ్గిపుల్ల ఐస్ ముక్కకు అంటుకుపోతుందన్నమాట. మనం పందెం గెలుస్తామన్నమాట. అదీ సంగతి! ఆధారం: యుగందర్