చెకుముకి నేస్తాలూ! మీరు చూసే మందారపూవులలో ఒకే రంగు ఉంటుందా? లేక రంగుల మిశ్రమం ఉంటుందా? చేసి తెలుసుకొందామా! ఈ ప్రయోగానికి ఒక వడపోత కాగితం, పెన్సిల్, పారదర్శకమైన ప్లాస్టిక్ లేక గాజు గ్లాసు, ఫెవిస్టిక్ గమ్, వాచ్ లసు లేక చిన్న ప్లేటు, నీరు, ఎరుపు, నలుపు, నీలం జెల్ పెన్నులు, మీకు లభించిన మందారపూలు. వడపోత కాగితాన్ని దీర్ఘచతురస్రాకారంగా కత్తిరించి, పెన్సిల్ కు వెడల్పు అంచున చుట్టి ఫెమిస్టిక్ గమ్‌తో వడపోత కాగితాన్ని అతికించాలి. వడపోత కాగితం రెండవ అంచుకు ఒక సెంటీమీటరు పైన ఎరుపు జెల్ పెన్నుతో గీత గీయాలి. అదే గీత మీద నలుపు జెల్ పెన్నుతో గీత గీయాలి. తరువాత నీలం జెల్ పెన్నుతో అదే గీత మీద గీయాలి. ఈ గీతలు ఏ క్రమములోనైనా గీయవచ్చు. అంటే ఎరుపు, నలుపు, నీలం వరు సేగాక, నీలం, నలుపు, ఎరుపు వరుసలో గూడా గీయవచ్చు. అది మీ యిష్టం. దీని ప్రధాన ఉద్దేశ్యం మూడు రంగులు ఒకే గీత మీద కలిసి ఉండటం. పారదర్శక గ్లాసులో కొంచెం నీరు తీసుకొని పెన్సిల్ ఆధారంగా వడపోత కాగితాన్ని గ్లాసులో ఉన్న నీటికి తగిలేటట్లు ఏర్పాటు చేయాలి. మీదగీసిన గీతలు నీటిలో మునగకుండా జాగ్రత్త పడాలి. లేకపోతే ప్రయోగం సఫలం కాదు. వడపోత కాగితం వెంట నీరు పైకి ఎగబాకటం మీరు గమనిస్తారు. జాగ్రత్తగా పరిశీలిస్తే వడపోత కాగితం పైకి నీటితో పాటు మీరు గీసిన గీతలలోని మూడు రంగులు వేర్వేరుగా పైకి ప్రయాణం చేయటం గమనిస్తారు. అంటే మీరు కలిపిన మూడు రంగులు ఈ పద్ధతి ద్వారా వేరుచేసారన్నమాట. ఇలా వేరు చేసే పద్ధతిలో నీరు అధిశోషణ ప్రక్రియ (adsorption process) ద్వారా వడపోత కాగితం పైకి పోతుంది. అలా పోతూ మీరు కలిపిన మూడు రంగులను వాటి అణుభారాల, అణువుల మీద వున్న ఆవేశాల ఆధారంగా వేరు వేరు వేగాలతో ప్రయాణించటం వలన ఆ రంగులు వేరు అవుతాయి. ఇందులో వడపోత కాగితం, దాని రంధ్రాలలో నిండిన నీరును స్థిరప్రావస్థ (stationary phase) అని, కదులుతూ వడపోత కాగితం పైకి పోయే నీటిని చలప్రావస్థ (mobile phase) అని అంటారు. అంటే చలప్రావస్థ స్థిరప్రావస్థ పై రంగులను చేసిందన్నమాట. చెకుముకి నేస్తాలు! పై ప్రయోగం చేసిన తర్వాత మీరు సంపాదించిన మందార పుష్పం నుంచి రసాన్ని వాచ్ గ్లాస్ సులోకి పిండండి. పై ప్రయోగంలో మాదిరిగానే వడపోత కాగితాన్ని దీర్ఘచతురస్రాకారంలో కత్తిరించి పెన్సిల్ కు అతికించండి.. అగ్గిపుల్ల లాంటి పుల్ల తీసికొని జెల్ పెన్నులతో గీతగీసినట్లుగా, మందార పుష్పం రసంలో అగ్గిపుల్ల ముంచి వడపోత కాగితం రెండవ అంచుకు ఒక సెంటిమీటరు పైకి గీత గీయాలి. ఒక గ్లాసులో నీరు తీసుకొని ఈ వడపోత కాగితాన్ని పెన్సిల్ ఆధారంగా కాగితం అంచుమాత్రమే నీటికి తగిలేటట్లు ఏర్పాటు చేయాలి. నీటి అధిశోషణ ప్రక్రియ ద్వారా పుష్పంలోని రంగులు వేరు అవుతాయి. పుష్పంలో ఒకే రంగు ఉంటే ఒకే రంగుపైకి పోతుంది. రంగుల మిశ్రమం ఉంటే అన్ని రంగులు, వాటి అణుభారాల ఆధారంగా వేర్వేరుగా ప్రయాణిస్తాయి. ఈ ప్రయోగాన్ని వేర్వేరు రంగుల పుష్పాలు, ఆకులతో చేసి మీ పరిశీలనలను సైన్సు ప్రాజెక్టుగా సమర్పించవచ్చు. నేస్తాలూ! మిశ్రమ పదార్ధాలను ఈ విధంగా వేరుచేయటాన్ని 'క్రొమటోగ్రాఫిక్ పద్దతి' అంటారు. మందులు తయారుచేసే పరిశ్రమలలో దీనిని విరివిగా వాడతారు. ఆధారం: ప్రొ. యం. ఆదినారాయణ