‘మంత్రాలకు చింతకాయలు రాలుతాయా' అని మా నాయనమ్మ అనేది. ఆమె చదువుకోలేదు. కానీ ఆమెకు తెలుసు.. చెట్టు నుండి చింతకాయలు క్రిందకు రాలాలంటే 'మంత్రం' పనిచేయదని. రాయి మాత్రమే పనిచేస్తుందని, అదే కదా శాస్త్రీయ దృక్పథం. మరి ‘మాటే మంత్రం... కదిలే పేపరు గొట్టం ఏమిటి?'. ఓ పొడవాటి పేపరు గొట్టం లోపల ఓ దారం వుంటుంది. ఆ దారాన్ని పైన, క్రింద మీ చేతులతో పట్టుకొని నిలబడి ఉంటారు. ‘క్రిందకు దిగు' అంటే పేపరు గొట్టం దారం వెంబడి క్రిందకు దిగుతుంది. ‘పైకి ఎక్కు' అంటే పేపరు గొట్టం దారం వెంబడి పైకి ఎగబ్రాకుతుంది. మరి మీ మాట గొట్టం వింటోంది కదా... అందుకే 'మాటే మంత్రం' అన్నాను. కానీ ఇది మంత్రం మాత్రం కాదు ఓ చిన్న సైన్స్ ట్రిక్ అంతే. మరి ఇది ఎలా చేయాలి? తెలీదా? అయితే రండి! చేసి చూద్దాం! కావలసిన పరికరాలు: 30 సెం.మీ. పొడవు, 3 సెం.మీ. వ్యాసము గల ఓ దళసరి పేపరు గొట్టం (ఏదైనా శుభకార్యాలలో రంగు రంగుల కాగితపు ముక్కలు వెదజల్లే పేపరు గొట్టం వాడుతారు గదా దాన్ని తీసుకోవచ్చు. లేకుంటే డ్రాయింట్ చార్టు తీసుకొని 4, 5 చుట్టలు చుట్టి అతికించి మీరే గొట్టం తయారు చేసుకోవచ్చు. 70 సెం.మీ. పొడవు గల ఓ దారం, 50 సెం.మీ. పొడవు గల మరొక దారం, చిన్న కర్టెన్ - రింగు (ఈ రింగు వ్యాసము పేపరు గొట్టం వ్యాసం కంటే తక్కువ ఉండాలి). చేయు విధానం: చిన్న దారం (50 సెం.మీ. పొడవు కలది). ఒక కొనకు కర్టెన్ రింగును ముడివేసి దానిని పేపరు గొట్టం గుండా జారవిడుస్తూ గొట్టం రెండవ అంచు వద్దకు వచ్చేలా చేయండి. ఇప్పుడు పేపరు గొట్టాన్ని బల్లపై అడ్డంగా పడుకోబెట్టండి. పేపరు గొట్టం లోపలి భాగం 'A' వద్ద (పటము 1) చిన్న రంధ్రం చేసి పెద్ద దారం (70 సెం.మీ.) ఒక కొనను ఈ రంధ్రంలో దూర్చి గొట్టానికి ముడి వేయండి. ఈ దారం కనబడకుండా వెలుపల ఓ చిన్న కాగితపు ముక్కను అతికించండి. ఈ పెద్ద దారపు రెండవ కొనను కర్టెన్ రింగు గుండా దూర్చి పూర్తిగా లాగివేయండి (పటం 1), తరువాత చిన్న దారం రెండవ కొన, గొట్టం 'B' వైపున ఉంది కదా, దానిని కాస్త పైకి లాగుతూ కర్టెన్ రింగు గొట్టం లోపలికి (A వద్ద) పూర్తిగా పోయేలా చేయండి. ఇప్పుడు రెండు చేతులతో గొట్టాన్ని పట్టుకుంటే పటము 2 లో లాగ కనిపిస్తుంది. అంటే గొట్టం గుండా ఓ దారం వున్నట్లు కనిపిస్తుంది. లోపల ఉన్న రెండు దారాలు, రింగు కన్పించదు. అంతే మన కదిలే పేపరు గొట్టం తయారు. ప్రదర్శన విధానం: చిన్న దారపు రెండవ కొనను మీ కుడి చేతిలోను, పెద్ద దారం రెండవ కొనను ఎడమ చేతిలోనికి తీసుకొని పేపరు గొట్టాన్ని రెండు చేతులతో పట్టుకొని పటము 2లో లాగ నిలబెట్టి పట్టుకోండి. ఈ స్థితిలో 'క్రిందికి దిగు' అని అరచి గొట్టాన్ని వదలి దారాల్ని మాత్రం పట్టుకోండి అంతే గొట్టం క్రిందకు దిగడం ప్రారంభమవుతుంది. ఇది మామూలే ఏ దారం వెంటైనా గొట్టం క్రిందకు దిగుతుంది కదా. ఇప్పుడు అసలు మంత్రం ‘పైకి ఎక్కు' అని అరచి, దారపు కొనలను లాగి బిగుతుగా పట్టుకోండి. అంతే ఆశ్చర్యంగా గొట్టం పైకి ఎగబాకడం మొదలవుతుంది. మర 'క్రిందకు దిగు' అని అరచి దారాలను వదులు చేయండి. గొట్టం క్రిందకు దిగుతుంది. ఈ విధంగా మరలా మరలా చేయవచ్చు. (జాగ్రత్త సుమా కర్టెన్ రింగు గొట్టం వెలుపలికి రాకుండా చిన్న దారాన్ని కంట్రోల్ చేయాలి. ఇది ఎలా జరిగింది: ఈ నమూనా కప్పిదారం (Pulley) సూత్రంపై పనిచేసింది. పటం 3 చూడండి. గొట్టంలో పెద్ద దారం రింగు గుండా క్రిందికి వస్తుంది. చిన్నదారం రింగును పట్టి వుంచుతుంది. ఈ రింగు కప్పీలాగ పనిచేస్తుంది. దారాన్ని వదులుగా వదిలితే గొట్టం బరువు వల్ల 'P’ దారం ద్వారా క్రిందకు జారుతుంది. గొట్టం క్రిందకు దిగుతుంది. దారాన్ని బిగిస్తే 'Q' దారం క్రిందకు, గొట్టం పైకి కదులుతుంది. ఇది కాస్త సాధన చేస్తే ప్రదర్శన బాగా రక్తి కడుతుంది. అదన్నమాట. ఆధారం: వలమనేరు యుగంధర్ బాబు.