హైస్కూల్ లో జనవిజ్ఞానవేదిక 'సైన్స్ క్యాంప్ కార్యక్రమం ఏర్పాటుచేసింది. ఆ రోజు ముందుగా ‘ఒరగామి’ కార్యక్రమం జరిగింది. ఆ తర్వాత కార్యక్రమం ‘సైన్స్ మేజిక్’. జె.వి.వి. ఆహ్వానం మేరకు మెజీషియన్ సుబ్బు వచ్చారు. మేజిక్ షో అనగానే పిల్లలందరిలో ఉత్సాహం ఉరకలు వేసింది. ఈ రోజు ఏమి మేజిక్ చేస్తారో అని అంతా ఎదురు చూస్తున్నారు. మెజీషియన్ బల్లమీద ఒక గాజు గిన్నె ఉంచి నిండా నీరు పోశాడు. తనకూడా తెచ్చుకున్న ఒక ప్లాస్టిక్ కవర్ లోంచి కొన్ని రంగులేని గోళీకాయల్లాంటి బంతుల్ని బయటికి తీసి అందరికీ చూపించాడు. ఈ బంతుల్ని చూస్తున్నారుగా, వీటిని ఈ గిన్నెలోని నీటిలో పడేస్తున్నా ఇలా అంటూనే, ఆ బంతుల్ని ఒక్కొక్కటిగా నీటిలో పడేశాడు. ఆశ్చర్యం! నీటిలో వేసిన వెంటనే ఆ బంతులు కనిపించకుండా మాయమైపోయాయి. అవి నీటిలో కరిగిపోయధిపై అనుకున్నారంతా. ఇప్పుడు మాయమైపోయివ బంతుల్ని మళ్ళీ బయటికి రప్పిస్తాను చూడండి అంటూ ఒక చెంచాను గిన్నెలోని నీటిలో ముంచి బయటికి తీశాడు. మాయమైన బంతులు మళ్ళీ కన్పించాయి. ఇదే ఈ రోజు మేజిక్ అన్నాడు మెజీషియన్. ఇవేవో మాయాబంతులు అనుకున్నారు చాలామంది, సాకేత్, కార్తీక్ లకు ఏదో అనుమానం వచ్చింది. మనం స్వయంగా చూడాలనుకున్నారు. మెజీషియన్ ను అడిగారు. ఇదిగో రండి. మీకు కొన్ని బాల్స్ ఇస్తాను అన్నాడు, సాకేత్, కార్తీక్ లు చెరో రెండు బాల్స్ ని నీటిలో వేశారు. వేసినవి వేసినట్టే మాయమయ్యాయి. గిన్నెలో చేయి పెట్టి వెతికితే ఆ బాల్స్ చేతికి తగిలాయి. కంటికి కన్పించడం లేదు. బాల్స్ ని చేతిలోకి తీసుకుని నీటిలో నుంచి బయటికి తీశారు. బాల్స్ అందరికీ కన్పించాయి. ఇందులో ఏదో సైన్స్ రహస్యం ఉంది. కంటికి కన్పిస్తున్న ఈ బంతులు నీటిలో వేస్తే మాయమవుతున్నాయి. ఎందుచేత? ఇదే విషయం అక్కడే ఉన్న సైన్స్ టీచర్ లక్ష్మిని అడిగారు. మీ అనుమానం నిజమే. ఇదేమీ మాయ కాదు. ఇందులో సైన్స్ ఇమిడి ఉంది. చెబుతాను వినండి అంటూ వివరంగా చెప్పింది లక్ష్మి మేడమ్. చిన్న పిల్లలకు వాడే డైపర్లు మీకు తెలుసుకదా! వీటిలో వాడే రసాయనమే ఈ బాల్స్ లో కూడా ఉంటుంది. ఈ రసాయనం పేరు సోడియం పాలీ ఆక్రిలేట్. ఇది వాసనలేని తెల్లని చూర్ణంగా లేదా చిన్న చిన్న గుళికలుగా షాపుల్లో దొరుకుతుంది లేదా కొత్తగా కొన్న డైపరను కట్ చేస్తే బయట పడుతుంది. ఈ రసాయనానికి ఒక అద్భుతమైన లక్షణం ఉంది. అదేమిటంటే అది తన బరువుకు సుమారు 300 రెట్లు బరువున్న నీటిని పీల్చుకుంటుంది. నీటిలో పడేస్తే చిన్న స్పటికాలు నీటిని పీల్చుకుని ఉబ్బి బంతుల్లాగా తయారవుతాయి. ఈ పాలిమర్ బాల్స్ ని జెల్లీమార్బుల్స్ అని, వాటర్ బాల్స్ అని, వాటర్ క్రిష్టల్స్ అని పిలుస్తారు. సోడియం పాలి అక్రిలేట్ కు విషస్వభావం లేకపోయినా కంటిలో పడితే కళ్ళు పొడిబారిపోయి మండుతాయి. చూర్ణాన్ని పీలిస్తే ముక్కు మండుతుంది. అందుచేత జాగ్రత్తగా ఉండాలి. వాటర్ బాల్స్ ముట్టుకుంటే చేతులు కడుక్కోవాలి. ఈ మేజిక్ ను చేయడం చాలా సులభం. సోడియం పాలి ఆక్రిలేట్ స్పటికాలను ఒక చెంచా నిండా తీసుకుని ఒక ప్లాస్టిక్ లేదా గాజు కప్పులో వేయాలి. కప్పును నీటిలో నింపి కాస్త వెచ్చగా ఉన్నచోట 5 లేదా 6 గంటలపాటు ఉంచాలి. పాలిమర్ స్పటికాలు నీటిని పీల్చుకుని బాగా ఉబ్బుతాయి. వీటిని తీసుకుని నీటిలో వేస్తే కంటికి కన్పించకుండా మాయం అవుతాయి. బయటికి తీస్తే తిరిగి కన్పిస్తాయి. మెజీషియన్ చేసిన మేజిక్ ఇదే. ఇలా ఎందుకు జరుగుతుంది మేడమ్? సాకేత్ అడిగాడు. ఉందుకు కారణం ఉంది. సోడియం పాలి ఆక్రిలేట్ ఒక పాలిమర్. దీని వక్రీభవన గుణకం నీటి వక్రీభవన గుణకంతో సమానం, వాటర్ బాల్ 99 శాతం నీటితో నిండి ఉంటుంది. ఈ బాల్ ని నీటిలో పడేసినప్పుడు కాంతికిరణాలు బాల్స్ ద్వారా ఏ మాత్రం పరిక్షేపణం చెందకుండా పరిశీలకుడి కంటిని చేరతాయి. కాబట్టి నీరు, పాలిమర్ బంతుల సరిహదంను గుర్తించలేము. కాంతి కిరణాలు సజాతీయ యానకం ద్వారా ప్రయాణిస్తున్నట్లుగానే ప్రవర్తిస్తాయి. బాల్‌ను నీటి నుండి బయటికి తీస్తే, నీరు, గాలి వక్రీభవన గుణకాలు వేరుకాబట్టి కాంతికిరణాలు వక్రీభవనం చెందుతాయి. అందుచేతనే బాల్ కంటికి కన్పిస్తుంది. అర్ధమయింది మేడమ్ అన్నారు సాకేత్, కార్తీక్ తో సహా విద్యార్థులంతా, ఆధారం: డ. ఇ.ఆర్. సుబ్రహ్మణ్యం