చూడండి పిల్లలూ! ఈ వేసవి సెలవులలో సరదాగా మీరు చక్కగా ఆడుకోవడానికి చక్కటి పడవను మీ స్వత:హాగానే తయారు చేసుకొని మీ స్నేహితులతో ఆనందంగా, ఉత్సాహంగా ఆడుకోండి పిల్లలూ ! ముందుగా మీ ఇంట్లో ఉండే మూత కలిగిన వాటర్ బాటిల్ తీసుకోండి. దానిని పై భాగంలో కట్ చేయండి. సీసా అడుగు భాగాన చిన్న రంధ్రం చేయండి. ఇప్పుడు మీ వద్ద పాడైపోయిన రెండు వైపులా రంధ్రాలుండే పెన్ గుల్లను తీసుకోండి. దానికి ఒక వైపున ఒక బెలూన్ ను కట్టండి. ఆ పెన్ గుల్లకు కట్టిన బెలూన్ ను సీసాలోపలి వైపు నుండి సీసా రంధ్రం గుండా అమర్చిండి. బెలూన్ సీసా పై భాగాన మరియు మిగిలిన గుల్ల సీసా అడుగు భాగాన ఉంటుంది. ఆ గుల్ల సీసాను అంటి పెట్టుకునే విధంగా ఒక రబ్బరు గుల్లకు సీసాకు జతగా వేయండి. ఇపుడు మీరు సీసా అడుగు భాగంలో ఉన్న గుల్ల రంధ్రం గుండా గాలిని ఊదండి. బెలూన్ బాగా ఉబ్బుతుంది. దానిని తీసుకొని వెళ్ళి నీటిలో విడిచి పెట్టండి. అంతే ఎంచక్కా పడవ నీటిలో చక్కగా ప్రయాణం చేసేస్తుంది. బాగుంది. కదూ పిల్లలూ ఈ సీసాపడవ. ఇటువంటివి మీరు కూడా మరెన్నో చేయవచ్చు. చేస్తారు కదూ ! మనిషి సహాయం లేకుండానే ఈ సీసా పడవ నీటిలో పయనిస్తుంది. దానికి కారణం మంత్రం కాదు, మహత్యం కాదు దానిలో సైన్స్ ప్రిన్సిపల్ వుంది. ఈ పడవ నీటిలో ప్రయాణించడానికి కారణం గాలి ఒత్తిడినే. మనం బెలూల్ లోనికి పంపించిన గాలి నెమ్మదిగా పెన్ను గుల్ల నుండి నీటిని వెనుకకు నెడుతుంది. గాలి ఒత్తిడికి పడవ ముందుకు వెళ్తుంది. బుడగలు బుడగలుగా గాలి అయిపోగానే ఈ సీసా పడవ ప్రయాణం ఆగిపోతుంది. ఇలాంటి ప్రయోగాన్ని మీరు మీ ఇట్టి వద్ద, స్నేహితుల వద్ద చేసి ఆనందం పొందటమే కాక సైన్స్ వ్యాప్తికి కృషి చేయండి. నిర్వహణ : - సి.హెచ్. పెద్దిరాజు