ఒక గుర్రం ఊరి బయట గడ్డి మేస్తూ ఒక నత్తను చూసింది. నత్త మెల్లగా నడవడం దానికి వింతగా కన్పించింది. తన వేగాన్ని తలచుకొని నత్తను చూసి నవ్వుకొంది. దాన్ని ఎగతాళి పట్టించాలనుకొంది. నత్త దగ్గరకొచ్చి నిలబడింది. “నత్తా నత్తా బలే నడుస్తున్నావే. నాతో పరుగు పందేనికి వస్తావా?” అని నవ్వుతూ అడిగింది. గుర్రానికి పొగరు పట్టిందని నత్తకు అర్థమైంది. తనని ఆట పట్టించడానికి ఇలా పందెం అంటోందని ఆలోచించింది. “సరే! అలాగే వేసుకొందాం. అయితే దీనికి అందర్నీ పిలవాలిగా. మన పందెం అందరూ చూడకుంటే ఏం బావుంటుంది?” అంది. “ఆదివారం పందెం వేసుకొందాం సరేనా?” అని కూడా అడిగింది. గుర్రానికి చెప్పలేనంత నవ్వొచ్చింది. ఈ నత్త తనతో పందేనికి దిగుతుందా? దిగి ఏం గెలుస్తుంది? నా తడాఖా చూపిస్తా అనుకొంది. “సరే ఆదివారం ఇక్కడే పరుగుపందెం మొదలుపెడదాం.” అంది. నత్త మెల్లగా ఇంటికొచ్చింది. రాత్రికి నత్తలన్నింటినీ పిలిచింది. వాటికి గుర్రం మీద ఎక్కడలేని కోపం వచ్చింది. కుర్రనత్తలకైతే ఇక చెప్పనక్కరలేదు. అన్నీ కలిసి గుర్రం పొగరు అణచాలనుకొన్నాయి. పందేనికి రెడీ కావాలనుకొన్నాయి. నత్తలనీ ఒకే రకం చొక్కాకుట్టించుకొన్నాయి. ఒకే రకం నిక్కరు తొడుక్కొన్నాయి. బూట్లు కూడా ఒకేలా వుండేవి తెచ్చుకొన్నాయి. వాటిని వేసుకొంటే చూడ్డానికి నత్తలన్నీ ఒక్కటిగానే ఉన్నాయి. తేడా ఏం కనపడడం లేదు. ఆదివారం రానేవచ్చింది. నత్తలన్నీ ముందుగా బయలుదేరాయి. పరుగెత్తాల్సిన రోడ్డు మీద అక్కడక్కడా ఒక్కొక్కటి నిలబడ్డాయి. ఇలా వందల నత్తలు రోడ్డు చివరి వరకూ ఒక్కోచోట చేరిపోయ్యాయి. - గుర్రం వచ్చింది. 'ఏం పందేనికి రెడీనా?” అని నవ్వుతూ నత్తను అడిగింది. “నేను రెడీ. నువ్వు రెడీగా వచ్చావా?" అని ఎదురు ప్రశ్న వేసింది నత్త. గుర్రానికి ఒళ్లు మండిపోయ్యింది. రెండు నిమిషాల్లో దీనికి బుద్ధి చెపుతాననుకొంది. పందెం మొదలైంది. గుర్రం పరుగెత్తసాగింది. నత్త కూడా పరుగు మొదలెట్టింది. ఇంకేముంది! రోడ్డుమీద ఎక్కడ వున్న నత్తలు అక్కడి నుంచి పరుగులు మొదలెట్టాయి. గుర్రం కొంచెం దూరం పరుగెత్తి చూచింది. తన ముందర ఒక నత్త కనపడింది. “అరే నత్త నా కంటే ముందుకొచ్చేసిందే.” అనుకొంది. వేగం పెంచింది, మరికొంచెం సేపటికి చూస్తే అప్పుడు తనకు ముందు నత్త వుండనే ఉంది. గుర్రం ఇంకా వేగం పెంచింది, ఎంత పెంచినా నత్తే ముందు ఉంది. గుర్రం తన బలాన్నంతా కూడగట్టుకొంది. ఎప్పుడే లేనంత వేగంతో పరుగెత్తసాగింది. అయితే మాత్రం ఏం లాభం? చూస్తే నత్తే ముందు ఉంది. గుర్రం అలిసిపోసాగింది. “నత్త దగ్గర గుర్రం ఓడిపోవడమేమిటి? నత్తకింత వేగం ఎక్కడ నుంచి వచ్చింది?” అని గుర్రానికి కడుపులో దేనినట్టయ్యింది. అయితే మాత్రం ఏం చేస్తుంది? ఎంత పరుగెత్తినా లాభం కనిపించడం లేదు గుర్రానికి కాళ్లు పీకుతున్నాయి. గస పెరుగుతోంది. కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. అడుగు ముందుకు పడం లేదు. ఎంత శక్తి కూడగట్టుకొన్నా ఫలితం కనిపించడం లేదు. చూస్తే నత్త తన కంటే ఎంతో ముందుంది. “ఇంకేం లాభం లేదు.” అనుకొంది గుర్రం. అలా అనుకొంటుండగానే కాలు ముందుకు పడక కూలబడింది. నత్తలు గుర్రం దగ్గరికి చేరాయి. “ఏం గుర్రం బావా? అప్పుడే పడుకొన్నావ్. పందెం సంగతేమిటి?” అని వెక్కిరించాయి. గుర్రం ఏం మాట్లాడలేకపోయ్యింది. దాని తల ప్రాణం తోకకొచ్చినట్లుందిగా! తల దించేసుకొంది. నత్తలన్నీ నవ్వుకొంటూ పొగరుబోతు గుర్రానికి తగిన శాస్తి జరిగిందని ఇంటికెళ్లాయి. పండుగ చేసుకొన్నాయి. ఆధారం: వి. బాలసుబ్రమణ్యం