పులిస్వామి అనగానే పులుల్లో కూడా స్వాములుంటాయా అని మీకు అనుమానం రావచ్చు. నాకు తెలుసు మీరు అనుమానాల పుట్టలని. పులుల్లో స్వాములుండవు. ఎందుకంటారా! మనుషుల్లోలాగా పులుల్లో మోసపోయే గుణాలు ఉండవు. ఎవరూ మోసపోయ్యేవాళ్ళు లేనప్పుడు స్వాములు ఎక్కడుంటారు చెప్పండి. మన పులిస్వామి మనలాంటి మనిషే, కాకుంటే ఆయనకు పొడవాటి గడ్డం ఉంటుంది. ఒక వేషం ఉంటుంది. భక్తులుంటారు, ఆశ్రమం ఉంటుంది. పూజలు, పురస్కారాలు, క్యూలు, ప్రత్యేక ఆర్.టి.సి బస్సులు ఉంటాయి. పులిస్వామి దగ్గరికి వందలాది భక్తులు రోజు వస్తుంటారు. సంతానం లేనివారు, రోగాలు ఉన్నవాళ్ళు, ఉద్యోగాలు కావలసినవారు, పాపాలను పోగొట్టుకోవాలనుకునేవాళ్ళు ఒక్కరేమిటి సకల ప్రశ్నలకూ స్వామిగారు జవాబు చెబుతారు. పరిష్కారం చూపుతారు. స్వామివారికి కావలసినంత మంది శిష్యులున్నారు. వాళ్ళు భక్తుల నుంచి ఒక్క పైసా పుచ్చుకోరు. అంతా ఉచితమే, కాకుంటే అక్కడొక హుండీ ఉంటుంది. అందులో తోచింది వేయ్యాలి. వెయ్యకుండా మర్చిపోతే శిష్యులు గుర్తుచేస్తారు సుమా. పులిస్వామి భక్తుల ప్రశ్నలకు జవాబు చెప్పే స్టైలే వేరు. ఆయన వచ్చిన వాళ్లందరికీ ఖాళీ కవర్లు ఇస్తారు. కవరుతో పాటు రూపాయి నోటు సైజుండే తెల్ల కాగితం ముక్క ఇస్తాడు. భక్తులు తమ కోరికలు ఆ కాగితం మీద రాసి కవర్లో పెట్టి స్వామివారి ముందున్న పళ్ళెంలో పెట్టాలి. అలా అందరూ పూర్తి చేశాక కవర్లన్నీ కలిపేస్తాడు పులిస్వామి. అప్పుడొక కవరు తీసి కవరు విప్పకుండానే “సుబ్బారావు ఎవరండీ?“ అంటాడు. సుబ్బారావు లేస్తాడు. “మీరు కూతురికి పెళ్ళి ఎప్పుడవుతుందని రాశారు అవునా. “ అంటాడు. “వచ్చే సంవత్సరం అవుతుంది. “ అని సమాధానం చెప్పి ఆ తరువాత కవరు తెరిచి కాగితం కళ్ళకద్దుకొని పక్కనున్న చెత్తబుట్టలోకి వేస్తాడు. ఇప్పుడు ఇంకో కవరు తీస్తాడు. “రంగారావు ఎవరండీ? “ అంటాడు. రంగారావు నిలబడతాడు. కవరు తెరవకముందే పులిస్వామి “నీకు ఉద్యోగం ఎప్పుడొస్తుందని కదూ రాశావు, కొంచెం కష్ట పడాలయ్య, గ్రహ దోషం ఉంది. ఈ తాయత్తు కట్టుకో ఆరు నెలల్లో వస్తుంది. “ అని ఆశీర్వదిస్తాడు. ఇలా కథ నడుస్తూ ఉంటుంది. తమ కవరు తెరవకుండానే స్వామివారు తమ పేరు, ప్రశ్న ఎలా చెబుతున్నట్లు? దివ్యదృష్టి లేకపోతే ఎలా సాధ్యం అని భక్తులంతా తబ్బిబ్బులవుతారు. స్వామివారి దృష్టి కవరు మీద ఉండదు. భక్తుడి మీద ఉండదు. హుండీ మీద మాత్రం ఉండి తీరుతుంది. ఇదంతా మహత్తు కాదు, మట్టి కాదు. ఇదొక మ్యాజిక్. అసలు సంగతి ఏమంటే స్వామివారికి ఒక అసిస్టెంటు ఉంటాడు. వాడు కూడా భక్తుడిలాగానే వస్తాడు. కాగితం మీద రాసి కవర్లో పెట్టి స్వామివారి పళ్లెంలో వాడూ పెడతాడు. దాన్ని స్వామివారు తీసుకొని అన్ని కవర్లకంటే జాగ్రత్తగా (గుర్తుగా) పెట్టుకొంటారు. ఇప్పుడు పులిస్వామి ఏదో ఒక కవరు తీస్తాడు. అది సుబ్బారావుది కానేకాదు. అసిస్టెంటు మాత్రం సుబ్బారావు అని పిలవగానే లేచి నిలబడి తన ప్రశ్నకే జవాబు వచ్చినట్లు నటిస్తాడు. పులిస్వామి సుబ్బారావు కూర్చున్నాక కవరు తెరిచి కాగితం కళ్ళకద్దుకొన్నట్లు నటించి అందులోని విషయం రాసిన వారి పేర్లు చదువుకుంటాడు. అందులో రంగారావు పేరు అతడి ఉద్యోగ విషయం వుందనుకోండి. ఇప్పుడు రెండో కవరు తీసి చేతిలో పట్టుకుంటాడు. రంగారావును పిలుస్తాడు.అతడికి జవాబు చెబుతాడు (ఏదో ఒకటి). నిజానికి కవరు రంగారావుది కాదు. పులిస్వామి దాన్ని చదివి పేరు, విషయం, గుర్తించుకొని దాన్ని బుట్టలో వేసి మరో కవరు తీసుకుంటాడు. మళ్ళీ పాతకథే. ఈ పని మీరూ చెయ్యొచ్చు. మీ స్నేహితులకి కవర్లు కాగితాలు ఇచ్చి వాళ్ళకిష్టం వచ్చిన సినిమా పేర్లు రాయమనొచ్చు. ఒకడ్ని అసిస్టెంటుగా పెట్టుకొని నాటకం ఆడవచ్చు. మెదట ఒక కవరు తీసుకొని మీ అసిస్టెంటును పిలిచి అతడి సినిమా మీ ఇష్టం వచ్చింది చెబితే సరి. వాడు మీవాడేగా అవునంటాడు. ఆ తర్వాత ఆ కవర్లోని కాగితం చదివి పారెయ్యండి. ఇప్పుడింకో కవరు తీసుకొని దాన్ని విప్పకుండానే మెదటి కవరులోని స్నెహితున్ని పేరుతో పిలిచి అందులో అతడు రాసిన సినిమా చెప్పండి ఇలా కథ నడిపించండి. చేస్తారా మరి! చెయ్యండి గానీ పులిస్వాములు మాత్రం కాకండి. సరేనా! రచన: బండి శంకర్