ఒక ఊళ్ళో ఓ వస్తాదువుండేవాడు. అరటన్ను బరువుండే వస్తువులను కూడా తను అవలీలగా లేపి దూరంగా విసిరిగొట్టగలిగేవాడు. ఈ విషయంలో అతడ్ని ఓడించేవాడు ఎవరూ లేకపోవడంలో క్రమక్రమంగా అతనిలో గర్వం పెరిగిపోయింది. ఒకనాడు ఓ బక్కపల్చని వ్యక్తి అతని దగ్గరికి వచ్చి, “నువ్వు ఎంత బరువైన వస్తువునైనా ఒక 20 – 30 గజాల దూరం దాకా విసరగలవని విన్నాను. ఆ మాట నిజమేనా?”, అని అడిగాడు. “అందులో అనుమానం ఏముంది. 500 కేజీల బరువు దాకా, ఎంత బరువైన వస్తువునైనా నేను 30-40 గజాల దూరం విసరగలను”, అన్నాడు వస్తాదు గర్వంగా. “అయితే ఆ గోడకి పది గజాల దూరంలో నిలబడి, ఈ రుమాలుని ఆ గోడ బయటకు విసురు చూద్దాం. దీని బరువు కూడా ఏమంత ఎక్కువ లేదు. కేవలం పదిగ్రాములే వుంది.”, అంటూ తన జేబులోంచి ఓ పట్టు రుమాలుని తీసి వస్తాదుకు అందించాడు. ఆ రుమాలుని చూసి వస్తాదు పకపకానవ్వాడు. పెద్దపెద్ద బండరాళ్ళని విసిరిన తనకు ఇదొక లెక్కా అనుకున్నాడు. అంతచిన్న వస్తువుని విసరమని తనకు ఇచ్చినందుకు అతనికి కొంచెం కోపం కూడా వచ్చింది. అయినా, “ఇదిగో చూడు విరురుతున్నా.”, అంటూ రూమాలుని ఉండచుట్టి విసిరాడు. అయితే అది గోడను దాటిపోలేదు సరికదా, కనిసం గోడ దాకా కూడా చేరలేక పోయింది. పహిల్వాను తన కళ్ళను తాను నమ్మలేకపోయాడు. ఈసారి మరింత బలంగా రూమాలుని విసిరాడు. అయినా లాభం లేకపోయింది. అప్పటికే బోలెడంత మంది జనం అక్కడ గుమ్మికూడారు. పహిల్వాన్ కి సిగ్గుగా అన్పించింది. ఈ రుమాలు వ్యవహారం ఏమిటో అతనికి బొత్తిగా అర్థం కాలేదు. మరోసారి విసరాలని చూశాడు. “అలా నువ్వు ఎన్నిసార్లు విసిరినా లాభం లేదుగాని. ఇలా ఇవ్వు. నేను చిటికెలో దాన్ని విసిరేస్తాను.”, అంటూ బక్క వ్యక్తి ఆ రుమాలుని తన చేతిలోకి తీసుకున్నాడు. ఓ గులకరాయిని తీసుకుని దాన్ని రుమాలులో పెట్టి, దాన్ని ఉండలా చుట్టాడు. రాయితో సహా ఆ రుమాలుని విసరగానే అది సర్రుని దూసుకుపోయి గోడవతల పడింది. అసలు సంగతేమిటో అప్పటికిగాని పహిల్వాన్ కి అర్థం కాలేదు. మనిషనే వాడికి కండబలం ఒక్కటే వుంటే చాలదని, దానితో పాటు బుద్ధిబలం కూడా ఉండాలని అతను మొదటిసారిగా గుర్తించాడు. పిల్లలూ... అంతంత బరువులు అవలీలగా విసిరిన వస్తాదు. రుమాలును ఎందుకు విసరలేక పోయాడు ఆలోచించండి. మీకు తట్టకపోతే, మీ ఫిజిక్స్ టీచర్ ని అడిగి తెలుసుకోండి.