నేటి సమాజంలో విలువలు అడుగంటుతున్నాయని, ఈ సమాజం ఏమైపోనుందోనని పెద్దలు వాపోతుండటం చూసే ఉంటారు. మరి ఆ విలువలు ఏమిటి? అవి ఎలా ఉంటాయి? ఎలా వస్తాయి? అనే ఆలోచన ఎప్పుడైనా చేశారా? నీతి, నిజాయితీ అనే మాటలు తరుచూ వింటూ ఉంటాం. నీతి ఏమిటి? నిజాయితీ ఏమిటి? ఎప్పుడైనా చూశామా మనం! నిజాయితీ ఎలా ఉంటుందో చూడాలంటే మనదేశం గర్వించే గొప్ప ఇంజనీరు భారతరత్నం ఆ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జీవితం ఒక గొప్ప ఉదాహరణ. ఆయన ఎంతటి గొప్ప ఇంజనీరు అయినా అతి సామాన్య జీవితం గడిపాడు. ఒకసారి మోక్షగుండం, ప్రభుత్వ పని మీద పొరుగూరు వెళ్లాడట. అక్కడ తన ఇంజనీరింగ్ పని పూర్తి కాక పొద్దుపోయి ఆ రాత్రి అక్కడే బస చేయవలసి వచ్చింది. అక్కడే ఉన్న అతిథి గృహంలో రాత్రి మకాం చేశాడు. పొద్దు పోయే వరకూ పనిచేసుకుంటూనే ఉన్నాడట. రెండు కొవ్వొత్తులు వెలిగించుకుని మరీ పనిచేశాడు. అర్థరాత్రి దాటినా లెక్కలు చేసుకుంటూనే ఉన్నాడట. పని అయిపోగానే వెలిగే రెండు కొవ్వొత్తులను ఆర్పివేసి పక్కకు తీసి పెట్టి, తన సంచిలోంచి మరో రెండు కొవ్వొత్తులు తీసి మళ్లీ వెలిగించాడట. ఆయనతో పాటు ఉన్న మరో ప్రభుత్వ ఉద్యోగికి విశ్వేశ్వరయ్య ఎందుకలా చేశాడో అర్థం కాలేదట. విశ్వేశ్వరయ్య మాత్రం తెల్లవారుజాము నాలుగు గంటల వరకూ ఏవో రాసుకుంటూనే ఉన్నాడు. పని ముగించుకుని వెలిగే కొవ్వొత్తులు ఆర్పి పడుకున్నాడట. ఇదంతా గమనించిన ఆ ప్రభుత్వ ఉద్యోగి మర్నాడు విశ్వేశ్వరయ్యని అడిగాడట. మీరేమిటి వెలిగే కొవ్వొత్తుల్ని ఆర్పి పక్కనబెట్టి సంచిలోంచి కొత్త కొవ్వొత్తుల్ని తీసి వెలిగించుకున్నారెందుకు అని! అందుకు విశ్వేశ్వరయ్య ఏమి జవాబిచ్చారో తెల్సా? అర్థరాత్రి వరకు తాను ప్రభుత్వ పనిచేశానని, ఆ తర్వాత తన స్వంత పని చేసుకున్నానని. అందుకే ప్రభుత్వం ఇచ్చిన కొవ్వొత్తుల్ని ఆర్పి, తన స్వంత పనికి తన సంచిలోని సొంత కొవ్వొత్తులను వాడానని చెప్పాడు. ఆ ఉద్యోగి ఆశ్చర్యంతో విశ్వేశ్వరయ్య నిజాయితీకి ప్రణమిల్లాడు. నిజాయితీ అంటే అది మరి. విశ్వేశ్వరయ్య వంటి గొప్ప వ్యక్తుల జీవితాలు ముందు తరాలకు మార్గదర్శనం చేస్తాయి. ఆ మహనీయుడు సెప్టెంబర్ 15న జన్మించాడు. ఆయన జన్మదినాన్ని “ఇంజనీర్స్ డే”గా దేశవ్యాపితంగా జరుపుకుంటాం! మూసీ నది వరదముంపు నుండి హైదరాబాద్ ను కాపాడిన మహనీయుడు కూడా ఆయనే. ఆధారం: కట్టా సత్య ప్రసాద్