ఆరోజు ఆదివారం. ఉదయం 11 గంటలకే ఎండ కరకరలాడుతోంది. ఎండతో బాటు రంగడికి కడుపులో ఆకలి నకనకలాడుతోంది. నిన్న సంపాదించిన డబ్బులన్నీ రాత్రి బన్ను, టీ కి సరిపోయాయి. ఆకలి తీరే మార్గం ఎలా... ఏ అమ్మా నాన్న అడిగితే అంత అన్నం పెట్టొచ్చు. నామోషీ అడ్డమెచ్చింది. ఇంతలో వాడికో ఉపాయం తట్టింది కూటి కోసం కోటి విద్యలు అన్నారు కదా మన పెద్దలు. ఎదురుగా చిన్ని గుండ్రాయి కనపడింది. దాన్ని సంచిలో వేసుకొని ఒక వీధిలోకి వెళ్లి రాతిచారు కాస్తాం రుచి చూడొచ్చు రాతిచారు కాస్తాం రుచి చూడొచ్చు అంటూ అరవ సాగాడు. రాతి చారేందో చూద్దామని ఆ వీధిలోని అమ్మలక్కలంతా పోగయ్యారు రాతి చారా ఎక్కడ వినలేదే ఎట్టాకాస్తావ్ అని అడిగిందొకామె. ఆమెనొక దబర తెమ్మన్నాడు. రెండు ఇటుక రాళ్ళు పెట్టి పొయ్యి ఏర్పరచాడు. కట్టెలు తెమ్మన్నాడు. ఒకామె కట్టెలు తెచ్చి యిచ్చింది. పొయ్యి రాజేసి రాయిని శుభ్రంగా కడిగి దబరలో వేశాడు. నీళ్లు పోశాడు. ఒకామె కొంచెం చింతపండు తెచ్చియిచ్చింది. చింతపండు రాయికేసిరుద్ది నీళ్లతో కలిపాడు. ఇప్పుడు కొంచెం కంది పప్పు వేస్తే ఇంకా బాగుంటుంది అన్నాడు ఒకామె చారుపొడి తెచ్చి అందులో వేసింది. ఇప్పుడు కొంచెం తిరగమాత వేస్తే సూపర్ గా ఉంటుంది. అన్నాడు. ఒకామె తిరగమాత వేసింది. ఇప్పుడు తినడానికి రెడీ అన్నాడు. ఒకామె అప్పుడే వండిన అన్నం, గరిట, నాలుగు అరిటాకులు తెచ్చింది. అందరూ తలా కొంచెం అన్నం పెట్టుకొని రాతిచారు వేసుకొని తిన్నారు. రంగడికి కూడా కడుపు నిండా అన్నం పెట్టారు. బాగుంది, బాగుంది అంటూ అందరూ తిన్నారు. రాతిచారు బాగా చేశావంటూ అందరూ రంగడ్ని మెచ్చుకున్నారు. రంగడు కూడా తన ఆకలి తీరినందుకు సంతోషించాడు. రాతిని కడిగి సంచిలో వేసుకొని మరొక వీధిలో రాతిచారు కాసేందుకు బయలుదేరాడు.