“పిల్లలూ, ఈ రోజు ఏం చెబుతానన్నాను?” క్లాసులోకి వస్తూనే ప్రశ్నించారు విశ్వం మాస్టారు. ”స్వాతంత్రోద్యమం జరిగే రోజుల్లో ప్రజల్లో ఉన్న దేశభక్తికి సంబంధించి వివరాలు చెబుతామన్నారు మాస్టారు. ” అన్నాడు జ్ఞానేందర్. ”అవును, ఆ రోజుల్లో పసిపిల్లల నుండి ముసలివాళ్ళ వరకు బ్రిటీష్ వాళ్ళంటే తీవ్రమైన వ్యతిరేకత ఉండేది. దేశ స్వాతంత్ర్యం కోసం ఏదైనా చేద్దామని ప్రతీవారు తహతహలాడేవారు. ముందుగా ఆ రోజుల్లో పిల్లల్లో ఉండే దేశభక్తి భావనకు సంబంధించిన కొన్ని సంఘటనలు వివరిస్తాను. మీకందరికీ భగత్ సింగ్ తెలుసుకదా. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలే అర్పించిన గొప్ప దేశభక్తుడాయన. ఆయన చిన్నతనంలోని ఒక సంఘటనను వివరిస్తాను. భగత్ సింగ్ 6 ఏళ్ళ వయస్సులో ఉండగా ఒకరోజు ఆయన తండ్రి బాల భగత్ సింగ్ ను పొలానికి తీసుకెళ్ళాడు. తండ్రి పొలంలో గోధుమ విత్తనాలు నాటుతుంటే, ఆ బాలుడు పొలం గట్టున కూర్చుని చూస్తున్నాడు. కొంతసేపటికి, అకస్మాత్తుగా బాల భగత్ సింగ్ తన తండ్రిని ఇలా అడిగాడు. ”నాన్న, పొలంలో గోధుమ విత్తనాలు నాటితే ఏం వస్తాయి?” తండ్రి: గోధుమ మొక్కలు వస్తాయి. బాల భగత్ సింగ్: మరి తుపాకులు నాటితే తుపాకులు వస్తాయా? తండ్రి: కన్నా, ఈ ప్రశ్న ఎందుకు వేశావు? బాల భగత్ సింగ్: మనం దేశం నుండి బ్రిటీష్ వాళ్ళని వెళ్ళగొట్టాలి గదా. వాళ్ళని వెళ్ళగొట్టాలంటే మన దగ్గర బోలెడు తుపాకులు వచ్చాయనుకో, అప్పుడు మనం బోలెడన్ని తుపాకులు సంపాదించి బ్రిటీష్ వాళ్ళతో పోట్లాడి వాళ్ళని వెళ్ళగొడదాం. భగత్ సింగ్ తండ్రి కుమారుని ఆలోచనకు నవ్వుకున్నాడు. సంతోషించాడు. ఈ సంఘటన ఆ రోజుల్లో పసివారిలో కూడా ఉన్న బ్రిటీష్ వ్యతిరేకతను, స్వాతంత్ర్యకాంక్షను తెలియజేస్తోంది. అలాగే గాంధీగారికి బాల్యంలో ఎంత దేశభక్తి ఉండేదో తెలియజేసే ఒక సంఘటన చెబుతాను వినండి. గాంధీజీ చిన్నతనంలో బాగా బక్కగా ఉండేవాడు. అయినా బ్రిటీష్ వారిని వెళ్ళగొట్టాలనే తపన ఉండేది. తన తపనను తన అన్నగారి స్నేహితుడికి తెలియజేశాడు. అతనేమన్నాడంటే ‘మోహన్ దాస్, (గాంధీజీ అసలు పేరు) మనం బ్రిటీష్ వాళ్ళని వెళ్ళగొట్టాలంటే, వాళ్ళకంటే బలంగా ఉండాలి. ఇలా బక్కగా ఉండకూడదు. వాళ్ళ బలానికి కారణం వాళ్ళందరు మాంసం తినడం. కాబట్టి మనం కూడా మాంసం బాగా తినాలి.’ ఈ సలహా గాంధీకి నచ్చి ఒక రోజున మేక మాంసం తిన్నాడు. కాని జీవ హింసను ప్రోత్సహిస్తున్నాననే బాధ కలిగి ఆ తర్వాత తినడం మానేశాడు. ఈ సంఘటన కూడా స్వాతంత్ర్యోద్యమం రోజుల్లో ఆనాటి బాలురలో ఉండే స్వాతంత్ర్య కాంక్షను తెలియజేస్తుంది. భగత్ సింగ్, గాంధీజీ వంటి మహానాయకుల్లోనే కాదు. సామాన్య జనంలో కూడా ఎంతటి దేశభక్తి ఉండేదో తెలియజేసే ఒక సంఘటనను తెలియజేస్తాను వినండి. ఒక పట్టణంలో ఒక ముసలాయన ఉండేవాడు. ఆయనకు పెళ్లికాని కూతుళ్ళు ఆరుగురున్నారు. అవి వందేమాతరం ఉద్యమం తీవ్రంగా సాగుతున్న రోజులు. భారతీయులందరూ వందేమాతరం నినాదంతో స్వాతంత్రోద్యమంలోకి ఉరుకుతున్నారు. బ్రిటీష్ వారు బహిరంగంగా వందేమాతరం నినాదాన్ని చేసినవారిని అరెస్ట్ చేస్తున్నారు. అయినా భారతీయులందరూ అరెస్టులకు అదరక, జైలు శిక్షలకు బెదరక వెందేమాతరం అని నినాదిస్తున్నారు. ఆ పరిస్థితుల్లో ఆ ముసలాయనకు తానుకూడ బహిరంగంగా, పెద్దగా, వందేమాతరం అని నినదించాలనిపించింది. అలా చేస్తే, తనను అరెస్ట్ చేస్తే, తను కూతుళ్ళు దిక్కులేని వారవుతారని భయం కలిగింది. చివరకు ఆలోచించి ఒక ప్లాను వేశాడు. కూరగాయల మార్కట్ కు వెళ్ళాడు. అక్కడ నిమ్మకాయలు అమ్ముతున్న స్త్రీ దగ్గరకు వెళ్ళాడు. ఆమెతో “అమ్మా నిమ్మకాయలు.” అని చిన్నగా అని, “వందేమాతరం” అని పెద్దగా అరిచాడు. ”అమ్మ నిమ్మకాయలు. ” అని చిన్నదాను, ”వందేమాతరం” అని పెద్దగాను అరవసాగాడు. మార్కెట్లో ”వందేమాతరం” నినాదం ఎవరో ఇస్తున్నారని విని పోలీసులు పరుగెత్తుకు వచ్చారు. వారు ముసలాయనను అరెస్ట్ చేయబోయారు. ఆయన ”నన్నెందుకు అరెస్ట్ చేస్తున్నారు? ” అని అడిగాడు. పోలీసులు ”నీవు వందేమాతరం అంటూ బిగ్గరగా నినాదిస్తున్నావు కాబట్టి. ” అన్నారు. అప్పుడు ముసలాయన బిగ్గరగా నవ్వి ”నేను నిమ్మకాయలు వంద ఏమాత్రం? అని అడుగుతున్నానయ్య. అది కూడా తప్పేనా? ” అన్నాడు. పోలీసులు ఆయనను ఏమి చేయలేక వెళ్ళిపోయారు. పిల్లలూ, ఈ సంఘటన ఆనాడు సామాన్య ప్రజల్లో కూడా ఎంతటి దేశభక్తి ఉండేదో తెలియజేస్తుంది. అంతేకాదు, ఆ రోజుల్లో స్వాతంత్రోద్యమంలో ఒక వ్యక్తి పాల్గొని, అరెస్టయి, జైలుకెళితే, ఆయన జైలు నుండి విడుదల కాగానే, ఊరి ప్రజలంతా మేళతాళాలతో ఎదురువెళ్ళి, ఆయనను ఊరేగింపుగా ఊళ్ళోకి తీసుకువచ్చేవారు. మరి ఈనాడో? ఎవరైనా దేశం కోసం, దేశ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించి జైలుకు వెళితే, వారిని పట్టించుకునే వారే ఉండటంలేదు. ఈ పరిస్థితి మారాలి. దేశభక్తులను మీ తరంలోనైనా గౌరవించాలి. దేశ సమస్యలపై పోరాడే వారికి అండగా మేమున్నామంటూ ప్రజలంతా నిలవాలి. మీరంతా అలా ఉంటారు గదూ?” అడిగాడు మాస్టారు. ”ఉంటాం మాస్టారు. ” అన్నారు పిల్లలందరూ గట్టిగా. ”సంతోషం.” అన్నారు మాస్టారు చిరునవ్వుతో. ” ఆధారం: కె.ఎల్. కాంతారావు