సంక్షోభాల నుండి దేశాన్ని నడిపించిన మహనీయుడు గొప్ప రాజనీతిజ్ఞుడు, విద్యావేత్త, ఆర్థికవేత్త శ్రీ గుల్జారీ లాల్ నందా భారతదేశానికి రెండు వేర్వేరు సందర్భాలలో తాత్కాలిక ప్రధాన మంత్రిగా సేవలు అందించిన ఏకైక వ్యక్తి. పదవిలో ఉన్న ప్రధాన మంత్రులు అకస్మాత్తుగా కన్నుమూసినప్పుడు, దేశం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న తరుణంలో ఆయన దేశ బాధ్యతలను స్వీకరించారు. తన నిరాడంబరతకు, దేశ సేవ పట్ల ఉన్న అచంచలమైన అంకితభావానికి మారుపేరుగా నిలిచారు. భారత ప్రభుత్వం 1997 వ సంవత్సరంలో దేశ అత్యున్నత పౌర పురస్కారం 'భారత రత్న'తో గౌరవించింది. దేశాభివృద్ధి. సమాజంలోని బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయనకు ఉన్న దూరదృష్టి నేటికీ దేశానికి స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. జననం: 4, జూలై, 1898 మరణం: 15, జనవరి, 1998 విలువలతో కూడిన రాజకీయాలకు ఒక అద్భుతమైన నిదర్శనం గుల్జారీలాల్ నందా. ఆయన రెండు సందర్భాలలో తాత్కాలిక ప్రధాన మంత్రిగా దేశాన్ని నడిపించినప్పటికీ.. ఆ ఉన్నత పదవితో వచ్చే అధికారాలను కానీ, విలాసాలను కానీ ఆయన ఎన్నడూ కోరుకోలేదు. ఒక నిబద్ధత గల స్వాతంత్య్ర సమరయోధుడిగా, భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో ఆయన జైలు శిక్షను కూడా అనుభవించారు. అలాగే తన జీవితాంతం కార్మికుల హక్కుల కోసం పట్టుదలతో పోరాడిన నాయకుడిగా నిలిచారు. ప్రభుత్వంలో అత్యున్నత పదవులను అధిష్టించినప్పటికీ, ఆయన ఎంతో నిరాడంబరమైన, వినమ్రతతో కూడిన జీవితాన్ని ఎంచుకున్నారు. ఆయన ప్రజా జీవనంలో ఎంతగానో నిమగ్నమైనప్పటికీ, అధికార ప్రలోభాలకు ఎన్నడూ లొంగలేదు. అలాగే తన నిజాయితీని, ఆదర్శాలను ఎక్కడా వదులుకోలేదు. అత్యంత నిరాడంబరమైన జీవనశైలికి పేరుగాంచిన ఆయన, దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన పలు ఉన్నత పదవులను నిర్వహించిన తర్వాత కూడా, తన జీవితమంతా అద్దె ఇళ్లలోనే గడిపారని చెబుతారు.పంజాబ్ లోని సియాల్ ్కట్లో 1898 జూలై 4న జన్మించిన గుల్జారీలాల్ నందా లాహోర్, ఆగ్రా, అలహాబాద్ లలో విద్యాభ్యాసం చేశారు. దేశ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నందుకు గాను ఆయన 1932లో జైలు శిక్ష అనుభవించారు. ఆ తర్వాత మళ్లీ 1942 నుండి 1944 వరకు జైలులో ఉన్నారు. 1937లో బాంబే లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఎన్నికైన ఆయన, 1937 నుండి 1939 వరకు బాంబే ప్రభుత్వంలో పార్లమెంటరీ కార్యదర్శిగా పని చేశారు. ఆ తర్వాత, బాంబే ప్రభుత్వంలో కార్మిక మంత్రిగా (1946-1950) ఉన్నప్పుడు, రాష్ట్ర అసెంబ్లీలో కార్మిక వివాదాల బిల్లు'ను విజయవంతంగా ప్రవేశపెట్టారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత, ఆయన జాతీయ రాజకీయాల్లో చురుగ్గా మారి వివిధ పదవులను నిర్వహించారు. 1962, 1963లలో కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రిగా, 1963 నుండి 1966 వరకు కేంద్ర హోం మంత్రిగా పని చేశారు. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ మరణానంతరం, మే 27, 1964న ఆయన భారత తాత్కాలిక ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 13 రోజుల పాటు సేవలు అందించారు. ఆ తర్వాత తాష్కెంట్ లో లాల్ బహదూర్ శాస్త్రి కన్నుమూసినప్పుడు, జనవరి 11, 1966న ఆయన మళ్లీ తాత్కాలిక ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మరో 13 రోజుల పాటు దేశాన్ని నడిపించారు. తన చివరి రోజుల్లో ఆయన రాజకీయాల నుండి పదవి విరమణ తీసుకుని, తన జీవితాన్ని సమాజ సంక్షేమానికి అంకితం చేశారు. గుల్జారీలాల్ నందా ఒక మంచి రచయిత. పలు పుస్తకాలను రచించి రచయితగా తన పాత్రను చక్కగా పోషించారు. దాదాపు 100 సంవత్సరాల వయస్సులో ఆయన 1998 జనవరి 15న తుది శ్వాస విడిచారు. తన అస్తికలను కురుక్షేత్రలో ఉంచాలనేది ఆయన చివరి కోరిక. ఆయన కోరిక మేరకు, మరణానంతరం ఆయన అస్తికలను గుల్జారీలాల్ నందా మెమోరియల్ లో ఉంచారు. కురుక్షేత్ర అభివృద్ధి బోర్డు పర్యవేక్షణలో ఈ 'గుల్జారీలాల్ నందా మెమోరియల్' శంకుస్థాపనను 1999 జూలై 4న అప్పటి ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్పేయి చేశారు. ఈ కార్యక్రమంలో వాటి కేంద్ర హోం మంత్రి ఎల్.కె. అద్వానీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ మురళీ మనోహర్ జోషి కూడా పాల్గొన్నారు. ఆధారం: న్యూ ఇండియా సమాచార్