ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ప్రాణనాడి హర్మూజ్ జలసంధి ప్రపంచ పటాన్ని ఒకసారి పరిశీలిస్తే, దేశాల మధ్య దూరాన్ని తగ్గించే సముద్ర మార్గాలు ఎన్నో కనిపిస్తాయి. కానీ, కొన్ని కిలోమీటర్ల వెడల్పు ఉండి, మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గమనాన్ని శాసించే శక్తి గల జలమార్గాలు చాలా తక్కువ. అటువంటి వాటిలో అత్యంత కీలకమైనది హర్మూజ్ జలసంధి (Strait of Hormuz). ఒమన్, ఇరాన్ దేశాల మధ్య ఒక ఇరుకైన సందులా ఉండే ఈ జలమార్గం, నేడు ప్రపంచ దేశాల ఇంధన భద్రతకు ఒక ప్రధాన కేంద్ర బిందువుగా మారింది. భౌగోళిక ప్రాముఖ్యత - చరిత్ర హర్మూజ్ జలసంధి భౌగోళికంగా ఉత్తరాన ఇరాన్, దక్షిణాన ఒమన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) మధ్య విస్తరించి ఉంది. ఇది పర్షియన్ గల్ఫ్ ను, గల్ఫ్ ఆఫ్ ఒమన్, అరేబియా సముద్రంతో కలిపే ఏకైక సముద్ర మార్గం. చమురు నిల్వలు పుష్కలంగా ఉన్న పర్షియన్ గల్ఫ్ దేశాల నుండి బహిరంగ సముద్రానికి చేరుకోవడానికి దీనికి మించిన మరో ప్రత్యామ్నాయం లేదు. చారిత్రక కోణంలో చూస్తే, ఈ జలసంధి శతాబ్దాలుగా వాణిజ్యానికి, సాంస్కృతిక సమ్మేళనానికి వేదికగా నిలిచింది. ప్రాచీన కాలంలో చైనా నుండి పట్టు, పింగాణీ, విలువైన వస్త్రాలు ఈ మార్గం ద్వారానే మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా వంటి ప్రాంతాలకు చేరేవి. ఆధునిక కాలానికి ముందే ఇది ఒక వ్యూహాత్మక జలమార్గంగా గుర్తింపు పొందింది. ప్రపంచ ఇంధన రక్షణ కవచం నేడు ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే చమురు, సహజ వాయువులో 20% కంటే ఎక్కువ భాగం కేవలం ఈ హర్మూజ్ జలసంధి ద్వారానే రవాణా అవుతోంది. పర్షియన్ గల్ఫ్ ను అంతర్జాతీయ జలాలతో అనుసంధానించే ఏకైక మార్గం కావడం వల్ల, ప్రపంచ ఇంధన భద్రతలో ఇది అనివార్యమైన పాత్ర పోషిస్తోంది. అందుకే. ఈ మార్గంలో నౌకల రాకపోకలు స్వేచ్ఛగా సాగేలా చూడటానికి అగ్రదేశాల నావికాదళాలు ఇక్కడ నిరంతరం నిఘా ఉంచుతాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఈ జలసంధి ఎప్పుడూ ప్రశాంతంగా ఉండదు. ఇరాన్, పాశ్చాత్య దేశాల మధ్య నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతలకు ఇది ప్రధాన వేదికగా మారింది. అంతర్జాతీయ ఒత్తిళ్లకు ప్రతిస్పందనగా ఇరాన్ ఈ జలసంధిని ఉపయోగించుకుంటుంది . గల్ఫ్ ఆఫ్ ఒమన్ లో వాణిజ్య నౌకలపై జరిగిన దాడులు ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేశాయి. ఒకవేళ ఈ మార్గంలో అంతరాయం కలిగితే, చమురు సరఫరా ఆగిపోయి, షిప్పింగ్ ఖర్చులు విపరీతంగా పెరిగే ప్రమాదం ఉంది. భారతదేశంపై దీని ప్రభావం ఎంత ? హర్మూజ్ జలసంధిలో జరిగే ఏ చిన్న మార్పు అయినా భారతదేశంపై తీవ్ర ప్రభావం. చూపుతుంది. దీనికి ప్రధాన కారణాలు: చమురు దిగుమతులు: భారతదేశం దిగుమతి చేసుకునే క్రూడ్ ఆయిల్లో సుమారు 40% ఈ జలసంధి ద్వారానే వస్తుంది.వంట గ్యాస్ (LPG): మన దేశంలో గృహ అవసరాలకు వాడే LPG లో దాదాపు 60% దిగుమతి చేసుకుంటున్నాము, అందులో అధిక భాగం ఈ మార్గం నుండే వస్తుంది. ఈ సరఫరా ఆగితే సామాన్యుడి వంటింట్లో మంట ఆగిపోయే ప్రమాదం ఉంది.సహజ వాయువు (LNG): ఖతార్ దేశం నుండి మనకు అందే సహజ వాయువులో సగభాగం ఈ మార్గం ద్వారానే చేరుతుంది. ఇది మన దేశంలోని ఎరువుల తయారీ, విద్యుత్ ఉత్పత్తి, పరిశ్రమలకు ఎంతో కీలకం. హర్మూజ్ జలసంధి ఒక నీటి మార్గం మాత్రమే కాదు; అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ జీవనాడి. ఇక్కడ నెలకొనే శాంతి పైనే అనేక దేశాల పురోగతి ఆధారపడి ఉంది. ముఖ్యంగా ఇంధన అవసరాల కోసం దిగుమతులపై ఆధారపడే భారతదేశం వంటి దేశాలకు, ఈ జలసంధిలో భద్రత, స్థిరత్వం అత్యంత అవసరం. ప్రపంచ దేశాలు సమన్వయంతో వ్యవహరించి, ఈ కీలక జలమార్గాన్ని వివాదాలకు దూరంగా ఉంచినప్పుడే అంతర్జాతీయ వాణిజ్యం, ఇంధన భద్రత సురక్షితంగా ఉంటాయి. అంత అంతర్జాతీయ సంస్థలు శాంతి క్రాంతికి వేదికలు యుద్ధం శాంతికి మార్గం చూపుతుంది. విధ్వంసం భవిష్యత్తు నిర్మాణానికి భద్రంగా ఉండాలని హెచ్చరిస్తుంది. ప్రపంచ శాంతికి.. క్రాంతికి కృషి చేసే సంస్థలు ఇటువంటి సంక్షోభ, సంక్లిష్ట సమయంలోనే పుట్టాయి. ఐక్యరాజ్యసమితి రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత.. ప్రపంచవ్యాప్తంగా శాంతిని నెలకొల్పే లక్ష్యంతో 1945లో ఏర్పడిన అంతర్జాతీయ సంస్థ ఐక్యరాజ్యసమితి. ప్రస్తుతం 193 దేశాలు ఇందులో పూర్తి కాలపు సభ్యదేశాలుగా ఉన్నాయి. హోలీ సీ (పోప్ పరిధిలో ఉన్న ప్రాంతం), స్టేట్ ఆఫ్ పాలస్తీనా దేశాలు సభ్యత్వం లేకుండా ఇందులో కొనసాగుతున్నాయి. ఐక్యరాజ్యసమితిలో గల ఆరు విభాగాల్లో సర్వసభ్య సభ ఒకటి. ఈ సంస్థ ఏం చేయాలనేది నిర్ణయించే ప్రధాన విభాగం ఇదే. ఐరాస సభ్యత్వం గల 193 దేశాలకూ ప్రాతినిధ్యం ఉన్న ఒకే ఒక్క విభాగమూ ఇదే. ఈ సర్వసభ్య సభ వార్షిక సమావేశం ప్రతి ఏటా సెప్టెంబర్లో పక్షం రోజుల పాటు న్యూయార్క్ లోని ఐరాస ప్రధాన కార్యాలయంలో జరుగుతుంది. ఈ సమావేశాల మధ్యలో నాలుగు రోజుల పాటు సాధారణ చర్చ ఉంటుంది. ఐక్యరాజ్యసమితి- విభాగాలు ఐక్యరాజ్యసమితిలో ఆరు ముఖ్యమైన సంస్థలు ఉన్నాయి. అవి: సర్వప్రతినిధి సభ భద్రతా మండలి సచివాలయం ధర్మ కర్తృత్వ మండలి ఆర్థిక, సాంఘిక మండలి అంతర్జాతీయ న్యాయస్థానం సర్వప్రతినిధి సభ ఈ సభలో సభ్యదేశాలన్నింటికీ ప్రాతినిధ్యం ఉంటుంది. ప్రతిదేశానికి ఒక ఓటు ఉంటుంది.కొత్తగా సభ్యదేశాలకు ప్రవేశం కల్పించడానికి సర్వప్రతినిధి సభకు అధికారం ఉన్నది. ఈ సభ మూడింట రెండు వంతుల మెజారిటీతో నిర్ణయాలు చేస్తుంది. భద్రతా మండలి ఐక్యరాజ్యసమితి ప్రారంభంలో ఇందులో 11 దేశాలున్నాయి. ప్రస్తుతం 15 దేశాలు ఉన్నాయి. అందులో 5 శాశ్వత సభ్యదేశాలు కాగా మిగతావి రెండేళ్ల కాలవ్యవధికి ఎన్నిక కాబడతాయి. అమెరికా, రష్యా, ఇంగ్లాండు, చైనా, ఫ్రాన్సు ఇందులో శాశ్వత సభ్యదేశాలు. వీటికి వీటో అధికారం కలదు. భద్రతా మండలికి ఆదేశాలను పాటించని రాష్ట్రాలు / దేశాలపై ఆంక్షలు మరియు సైనిక చర్య చేపట్టే అధికారమున్నది. ఆర్థిక సాంఘిక మండలి ఇది సాధారణ సభ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఇందులో 54 మంది సభ్యులుంటారు. ప్రజల విద్య, ఆరోగ్య, సాంస్కృతిక స్థాయి రంగాలలో అంతర్జాతీయ సహకారానికి కృషి చేస్తుంది.అంతర్జాతీయ న్యాయస్థానం ఐక్యరాజ్యసమితి సభ్యుల న్యాయవివాదాలు ఈ సంస్థ విచారిస్తుంది. దీని యొక్క కేంద్రం హేగ్ లో కలదు. ఈ న్యాయస్థానంలో 15 మంది న్యాయమూర్తులు ఉంటారు. వారి పదవీకాలం 9 సంవత్సరాలు ఉంటుంది. సచివాలయము ఇది ఐ.రా.స వ్యవహారాలు నిర్వహించే కార్యనిర్వాహక విభాగం. దీని ప్రధాన కార్యాలయం న్యూయార్కు లో కలదు. సచివాలయానికి ప్రధానాధికారిని సెక్రటరీ జనరల్ అంటారు. ఐక్యరాజ్యసమితి - సమస్యలు ఐక్యరాజ్యసమితి యొక్క భద్రతా మండలి సభ్యులు వీటో అధికారాన్ని దుర్వినియోగము చేస్తూ ముఖ్యమైన నిర్ణయాలను అడ్డుకుంటున్నారు.1945 లో ఐ.రా.స ఏర్పాటు తర్వాత 80 సంవత్సరాల తరువాత కూడా భద్రతా మండలిలో మార్పులు జరగలేదు. భద్రతా మండలిలో ఆసియా మరియు ఆఫ్రికా దేశాల ప్రాతినిధ్యం సరిగా లేదు. ఐ.రా.స సభ్యదేశాల మధ్య ఘర్షణలను నివారించడంలో విఫలమైంది. ఐ.రా.స- మార్పులు అవసరం భద్రతా మండలిలో ప్రస్తుతమున్న P5 స్థానాలకు బదులుగా, అభివృద్ధి చెందుతున్న దేశాలు మరియు మారుతున్న ప్రపంచ సమీకరణాలకు అనుగుణంగా భారత్, జర్మనీ, బ్రెజిల్ లాంటి దేశాలకు శాశ్వత సభ్యత్వ అవకాశం కల్పించాలి. వీటో అధికారాన్ని అత్యయిక సమయానికి మాత్రమే ఉపయోగించేలా పరిమితం చేయాలి. భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యులను పెంచాలి. ఐక్యరాజ్యసమితి - భారతదేశ పాత్ర ఐక్యరాజ్యసమితికి భారతదేశం విశేషమైన సేవలు అందించింది. భారతదేశం ఐ.రా.స శాంతి మరియు భద్రతా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటుంది. శాంతి భద్రతా కార్యక్రమాల కోసం భారతదేశం 2 లక్షల కంటే ఎక్కువ సైనికులను పంపింది. ఐక్యరాజ్యసమితికి భారతదేశం అత్యధికంగా ఆర్థికంగా సహకారాన్ని అందిస్తోంది. భారతదేశం ఐక్యరాజ్యసమితి స్థాపక సభ్యదేశాలలో ఒకటి మరియు 1945 నుండి సభ్యదేశంగా ఉంది. ప్రపంచ శాంతిని కోరే దేశంగా భారతదేశానికి భద్రతా మండలిలో ప్రాతినిధ్యం అత్యవసరం. ఆధారం: మన బడి మాస పత్రిక