మేజర్ హోషియార్ సింగ్ - పాకిస్థాన్ సైన్యం గుండెల్లో వణుకు పుట్టించి, పరుగులు పెట్టించిన వీరుడు జననం: 5 మే, 1937 మరణం: 6 డిసెంబర్ 1998 1971 భారత్-పాక్ యుద్ధంలో మేజర్ హోషియార్ సింగ్ ప్రదర్శించిన అసాధారణ పరాక్రమం శత్రువులను భయభ్రాంతులకు గురిచేసింది. అన్ని వైపుల నుంచి ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ, తీవ్రమైన కాల్పులు, ట్యాంకుల గర్జనల మధ్య కూడా ఆయన స్థావరాన్ని వదల్లేదు. తీవ్రంగా గాయాలైనప్పటికీ వెనకడుగు వేయకుండా ఆయన దళానికి మనోధైర్యాన్ని అందించారు. ఆయన చూపిన సాహసానికి శత్రువులు యుద్ధభూమి నుంచి పారిపోయారు. శత్రువులకు ఘోర పరాజయాన్ని అందించి, పరమ వీర చక్ర అవార్డును అందుకున్న మేజర్ హోషియార్ సింగ్ వీరగాథలు, దేశసేవకు యువతను ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. ధైర్యవంతులు ర్యవంతులు ఒక్కసారే మరణిస్తారు. మీరు పోరాడాలి. మీరు విజయం సాధించాలి. బసంతర్ యుద్ధ సమయంలో సైనికులను ఉద్దేశించి మేజర్ హోషియార్ సింగ్ పలికిన ఈ మాటలు, శత్రువులను మట్టి కరిపించేందుకు స్పూర్తిని కలిగించాయి. హర్యానాలో మే 5, 1937న జన్మించిన హోషియార్ సింగ్ చిన్నతనం నుంచే క్రమశిక్షణ, గొప్ప సంకల్పం కల వ్యక్తి. చదువుతో పాటు క్రీడలు, అథ్లెటిక్స్‌లో కూడా ఆయన విశేష ప్రతిభకనబరిచారు. 1957లో హోషియార్ సింగ్ జాట్ రెజిమెంట్‌లో చేరారు. ఆ తర్వాత 3వ గ్రెనేడియర్స్లో అధికారిగా నియమితులయ్యారు. 1971 ఇండో-పాక్ యుద్ధ సమయంలో ఇరువైపులా భారీగా మైన్లు అమర్చిన ఐసంతర్ నదిపై వంతెన నిర్మించే పనిని 3వ గ్రెనేడియర్స్ బెటాలియన్‌కు అప్పగించారు. అనంతరం వంతెనను దాటి జర్పాల్ సైనిక స్థావరాన్ని స్వాధీనం చేసుకోవాలని సైనికులకు ఆదేశాలు అందాయి. 1971 డిసెంబర్ 15న గ్రెనేడియర్‌లకు నాయకత్వం వహిస్తున్న మేజర్ హోషియార్ సింగ్ శత్రువుల తీవ్రమైన కాల్పులకు వెనుకాడకుండా, వారిపై దాడికి దూసుకెళ్లారు. తీవ్రమైన పోరాటం తర్వాత లక్ష్యాలను సాధించటంలో ఆయన విజయం సాధించారు. డిసెంబర్ 16న శత్రువులు మూడుసార్లు ఎదురుదాడి చేశారు. భారీ షెల్లింగ్, ట్యాంకుల దాడులు జరుగుతున్నప్పటికీ వెనకడుగు వేయకుండా సైనికులు ధైర్యంగా శత్రువును ఎదుర్కొనేలా ప్రోత్సహించారు. ఆయన ధైర్యం, నాయకత్వ పటిమతో స్ఫూర్తిపొందిన సైనిక బృందం శత్రువులకు భారీ నష్టాన్ని కలిగిస్తూ, ప్రతి దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టింది. డిసెంబర్ 17న భారీ ఫిరంగి దళాల సహాయంతో శత్రువులు మరోసారి దాడికి పాల్పడ్డారు. శత్రువు ప్రయోగించిన షెల్ తగిలి తీవ్రంగా గాయపడినప్పటికీ, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా రక్షణ మార్గాల గుండా వెళ్తూ సైనికుల్లో మనోధైర్యాన్ని నింపారు. శత్రుపు దాడిలో ఒక మీడియం మెషిన్ గన్ (ఎంఎంజీ) ఆపరేటర్ గాయపడటంతో వెంటనే ఆ గన్ పోస్టు వద్దకు చేరుకున్నారు. ఆ ఆయుధాన్ని స్వయంగా చేతబట్టి శత్రువులపై విరుచుకుపడ్డారు. అతని పోరాట పటిమ శత్రువుల దాడిని పూర్తిగా అడ్డుకోవటమే కాక, శత్రువులు పారిపోయేలా చేసింది. శత్రు సైన్యం భారీ ప్రాణనష్టంతో వెనుతిరిగింది. వారి కమాండింగ్ ఆఫీసర్‌తో సహా 85 మంది సైనికులు ఈ పోరాటంలో మరణించారు. మేజర్ హోషియార్ సింగ్.. తీవ్రంగా గాయపడినప్పటికీ, కాల్పుల విరమణ అమల్లోకి వచ్చే వరకు స్థావరాన్ని వదిలివెళ్లలేదు. భారత సైన్య అత్యున్నత సంప్రదాయాలకు అనుగుణంగా ఆయన ప్రదర్శించిన అసాధారణ పరాక్రమానికి, అచంచలమైన స్ఫూరికి, ధైర్యంతో కూడిన నాయకత్వానికి గానూ మేజర్ హోషియార్ సింగ్ కు అత్యున్నత సైనిక పురస్కారం 'పరమ వీర చక్ర' లభించింది. ఆధారం: న్యూ ఇండియా సమాచార్