స్వాతంత్య్ర పోరాటంలో కలాన్ని ఆయుధంగా మలచిన పాత్రికేయ ధీరుడు జననం: జూన్ 10, 1906మరణం: నవంబర్ 1, 1980 కెఏ దామోదర్ మీనన్ భారతదేశ స్వాతంత్య్రం కోసం సాగిన పోరాటంలో క్రియాశీల పాత్ర పోషించిన, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా శక్తిమంతమైన గళాన్ని వినిపించిన ప్రముఖ పాత్రికేయుడు, స్వాతంత్య్ర సమర యోధుడు, సామాజిక కార్యకర్త. మాతృభూమి పత్రికతో సుదీర్ఘానుబంధం కలిగిన ఆయన పలు సామాజిక, రాజకీయ అంశాలపై ప్రభావవంతమైన వ్యాసాలు రాశారు. నిర్భీతి , సమగ్రత, పక్షపాత రహిత వైఖరి, ప్రజా ప్రయోజనాల పట్ల లోతైన అవగాహన ఆయన పాత్రికేయంలో కీలకమైన లక్షణాలు. స్వాతంత్య్ర పోరాటంలో ఆయన ఈ లక్షణాలనే తిరుగులేని ఆయుధాలుగా మలుచుకున్నారు. ప్రజాసేవ అనే పవిత్రమైన లక్ష్యంతో స్వాతంత్య్రానంతరం సైతం దామోదర్ మీనన్ ప్రజా చైతన్యం, విద్య, సామాజిక సంస్కరణలకు ఎనలేని కృషి చేశారు. అవిరళ సేవలందించారు. బ్రిటిషర్లు క్రూరత్వం ప్రదర్శించిన కాలంలో సైతం దామోదర్ మీనన్ ఆయన పాత్రికేయంలో నిర్భీతిని, పక్షపాత రహిత వైఖరిని ప్రదర్శించారు. కేరళలోని (ఇప్పుడు కేరళం) కరు మల్లూర్ లో ఆయన 1906 జూన్ 10వ తేదీన జన్మించారు. సత్యం, సమగ్రత, సేవ అనే విలువలకు సజీవ నిదర్శనం మీనన్ జీవితం. తిరువనంతపురంలోని మహారాజా కళాశాలలో, ఆ తర్వాత బర్మాలోని (ప్రస్తుతం మయన్మార్) రంగూన్ విశ్వవిద్యాలయంలో ఆయన విద్యాభ్యాసం సాగింది. తదుపరి త్రివేండ్రంలో ఆయన న్యాయశాఖలో పట్టభద్రుడయ్యారు. విద్యాభ్యాసం అనంతరం ఆయన ప్రజాసేవ, జర్నలిజం వైపు ఆకర్షితులయ్యారు. మహాత్మా గాంధీ స్ఫూర్తితో ఆయన తదుపరి దశంలో స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారు. దామోదర్ మీనన్ జీవితంపై మహాత్మా గాంధీ ఆయన ఆదర్శాలు బలమైన ముద్ర వేశాయి. మహాత్మా గాంధీ నాయకత్వంలో సాగిన "ఉప్పు సత్యాగ్రహం", "శాసనోల్లంఘన" ఉద్యమాల్లో ఆయన చురుకైన పాత్ర పోషించారు. ఆయన పోషించిన క్రియాశీల పాత్ర కారణంగా జైలు శిక్ష కూడా అనుభవించారు. ఆయన "క్విట్ ఇండియా ఉద్యమం"లో సైతం పాల్గొని, ఆ ఉద్యమ కీలక నేతల్లో ఒకరుగా ఎదిగారు. ఈ కారణంగా బ్రిటిష్ అధికారులు ఆయనను మరోసారి అరెస్టు చేశారు. 1942-1945 సంవత్సరాల మధ్య కాలంలో ఆయనను నిర్బంధంలో ఉంచారు. దామోదర్ మీనన్ 1948 వరకు ప్రఖ్యాత మలయాళ పత్రిక "మాతృభూమి" సంపాదకుడిగా పని చేసిన కాలంలో పలు ప్రజా సమస్యలు వెలుగులోకి తెచ్చారు. ఆ పత్రిక ద్వారా భారతీయులపై బ్రిటిషర్ల అణచివేత ధోరణులను ఆయన తీవ్రంగా విమర్శించారు. ఆయన తన కెరీర్లో భాగంగా "సమదర్శి", "స్వతంత్ర", "కాహళం", "పవర్ శక్తి" వంటి పత్రికలకు సంపాదకత్వం వహించారు. స్వాతంత్ర్యానంతరం సైతం ఆయన జాతీయ ప్రయోజనాలే లక్ష్యంగా తన కృషి కొనసాగించారు. ఆయన లోక్ సభకు, రాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీకి కూడా ఎన్నికయ్యారు. కేరళ లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఎన్నికైన అనంతరం ఆయన రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా కూడా చేరారు. ఆయన సరళమైన ఆర్థిక విధానాలను ప్రోత్సహించారు. ఆయన కులాంతర వివాహాలే కాకుండా మతాంతర వివాహాలకు కూడా మద్దతు ఇచ్చారు. 1980 నవంబర్ 1వ తేదీన ఆయన కన్నుమూశారు. ఆధారం: న్యూ ఇండియా సమాచార్