స్వాతంత్య్రం నుంచి గణతంత్రం వరకు ఉన్న నారీమణుల గాథలు భారత్ లో ధైర్యవంతులైన మహిళలు ఏ రంగంలోనైనా, ఏ సమయంలోనైనా పురుషుల కంటే ఎప్పుడూ వెనుకంజలో లేరు. వారి మొక్కవోని ధైర్యం, పరాక్రమం, సాధించిన విజయాలతో భారతదేశ చరిత్ర సంపూర్ణమైంది. స్వాతంత్య్ర పోరాటం నుంచి నూతన భారతావని నిర్మాణం వరకు వారు అందించిన సహకారం ఎనలేనిది. యుగయుగాలుగా వారు ప్రశంసలు అందుకుంటూనే ఉన్నారు. భారత దేశాన్ని బానిసత్వపు సంకెళ్ల నుంచి విడిపించి నూతన భారతావనిని నిర్మించేందుకు స్వాతంత్య్ర పోరాటంలో. మహిళలు అందించిన సహకారం ఎంతో ఉన్నతమైనది. చరిత్ర పేజీల్లో వీరి పేర్లు చిరస్థాయిగా నిలుస్తాయి. వారిలో ఇద్దరు ప్రముఖులు హన్సా మెహతా, దుర్గాభాయ్ దేశముఖ్. హన్సా మెహతా భారత రాజ్యాంగ రూపకల్పనలో, ఐక్యరాజ్య సమితి చేసే మానవ హక్కువ సార్వత్రిక ప్రకటనలో లింగ సమానత్వం కోసం పోరాటం చేయడంలో కీలక పాత్ర పోషించారు. దుర్గాభాయ్ దేశ్ ముఖ్ తన జీవితాన్ని స్వచ్ఛందంగా దేశ సేవకే అంకితం చేశారు. హన్సా మెహతా కృషితో ఐక్యరాజ్యసమితి చిట్టచివరికి పురుషుల హక్కుల ప్రకటనను మానవ హక్కుల సార్వత్రిక ప్రకటనగా విడుదల చేసింది. మానవ హక్కుల కోసం మెహతా చేసిన కృషికి ఆమెను ప్రపంచంలో తొలి మహిళగా పిలుస్తారు. మరోవైపు దుర్గాభాయ్ దేశ్ ముఖ్ కూడా తన అద్భుతమైన వాక్పటిమ, ధైర్య సాహసాలు, దృఢమైన వ్యక్తిత్వం వల్ల ప్రజల్లో 'జోన్ ఆఫ్ ఆర్క్'గా ప్రాచుర్యం పొందారు. ఆమె దేశానికి అందించిన అపారమైన కృషి కోట్లాది మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. హన్సా మెహతా: మానవ హక్కుల సార్వత్రిక ప్రకటన కోసం విశిష్ట కృషి సరోజిని నాయుడు నుంచి స్ఫూర్తి పొందిన హన్సా మెహతా, చిన్నతనం నుంచే మహిళా ఉద్యమాల్లో పాల్గొనడం ప్రారంభించారు. కేవలం సంస్కరణవాదిగా, సమాజవాదిగా, విద్యావేత్తగా, స్వాతంత్య్ర యోధురాలుగా, స్త్రీవాదిగా, రచయితగా మాత్రమే కాక, మహాత్మా గాంధీ శిష్యురాలిగా కూడా పేరు తెచ్చుకున్నారు. హన్సా జివ్రాజ్ మెహతా సూరత్‌లో 1897లో జూలై 3న జన్మించారు. బరోడా కాలేజీ నుంచి ఆమె తత్వశాస్త్రంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత జర్నలిజం, సోషియాలజీ చదివేందుకు ఇంగ్లాండ్‌కి వెళ్లారు. 1930లో గాంధీజీ ప్రారంభించిన స్వాతంత్య్ర ఉద్యమంలో ఆమె చేరినప్పుడే ఆమె బహుముఖ వ్యక్తిత్వం తెరపైకి వచ్చింది. స్వాతంత్య్ర ఉద్యమంలో ఆమె క్రియాశీలకంగా వ్యవహరిస్తుండటంతో 1932, 1940లో జైలు శిక్ష అనుభవించారు. జాతీయ సమగ్రతకు ఎంతో అవసరమని భావించిన ఉమ్మడి పౌర స్మృ తి విషయంలో పండిట్ నెహ్రూతో ఆమెకు విభేదాలు తలెత్తాయి. 1947–48లో ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంఘానికి ఆమె భారత ప్రతినిధిగా వ్యవహరించారు. మానవ హక్కుల చారిత్రాత్మక ప్రకటనలో లింగ సమానత్వం కోసం ఆమె గణనీయమైన సహకారాన్ని అందించారు. మెహతా భారత రాజ్యాంగ పరిషత్తులో కూడా కీలకమైన సభ్యురాలిగా ఉన్నారు. ఆగస్ట్ 14, 1947 అర్ధరాత్రి దేశ అధికారాలను భారత్‌కు అప్పగించే చారిత్రాత్మక ఘట్టంలో భారత మహిళల తరఫున ఆమె జాతీయ పతకాన్ని ప్రదర్శించారు. మానవ హక్కులకు హన్సా మెహతా అందించిన అద్భుతమైన సహకారాన్ని డిసెంబర్ 2018లో, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్స్ కొనియాడారు. ‘‘భారతదేశానికి చెందిన హన్సా మెహతా లేకుంటే, మానవ హక్కులకు బదులుగా పురుషుల హక్కుల సార్వత్రిక ప్రకటనగా మేము పిలుచుకునే వాళ్లం’అని అన్నారు. మానవ హక్కుల కోసం మాత్రమే కాక, 14 ఏళ్ల వరకు బాలికలకు ఉచితంగా, కచ్చితంగా విద్యను అందించాలని ఆమె పట్టుబట్టారు. దీన్నే హన్సా మెహతా కమిటీ సంస్కరణగా పిలుస్తారు. కులాంతర వివాహం చేసుకోవడంతో ఆమె ఎంతో వ్యతిరేకతకు గురయ్యారు. కులం నుంచి ఆమెను బహిష్కరించారు. 1959లో మెహతా పద్మ భూషణ్ చేత సత్కరించబడ్డారు. ఏప్రిల్ 4, 1995లో మెహతా కన్నుమూశారు. దుర్గా బాయ్ దేశ్‌ముఖ్: స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రముఖ నాయకురాలు 1909లో ఆంధ్ర ప్రదేశ్‌లో జన్మించిన దుర్గాబాయ్, తన తండ్రి స్ఫూర్తితో తన చిన్నతనం నుంచే సేవా మార్గాన్ని ఎంచుకున్నారు. ఆమెకు 10 ఏళ్లున్నప్పుడు, కాకినాడలో మహిళల కోసం హిందీ పాఠశాలను నెలకొల్పి, నిర్వహించారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, మహాత్మాగాంధీ తనకు తానుగా కస్తూర్బా, సి.ఎఫ్ ఆండ్రూస్‌తో కలిసి వచ్చి ఈ పాఠశాలను తనిఖీ చేశారు. అప్పుడు దుర్గాబాయ్కి పన్నెండేళ్లుంటాయి. గాంధీజీతో ఆమెకు ఏర్పడిన ఈ పరిచయం తర్వాత, ఆమె గాంధీజీ ముందే విదేశీ వస్త్రాలను తగలబెట్టారు. తన విలువైన ఆభరణాలన్నీ కూడా ఆయనకు విరాళంగా ఇచ్చారు. తనకు తానుగా స్వచ్ఛంద సేవకురాలిగా దేశానికి అంకితమయ్యారు. దుర్గాబాయ్ ప్రసంగాలు అద్భుతంగా ఉండేవి. ఆమె తన ప్రసంగాలతోనే ప్రజలను ఆకట్టుకునేవారు. ఆమె ధైర్యాన్ని, ఎవరికీ భయపడని వ్యక్తిత్వాన్ని చూసిన ప్రజలు ఆమెను ‘జోన్ ఆఫ్ ఆర్క్’గా పిలుచుకునేవారు. ‘ఉప్పు సత్యాగ్రహం’ సమయంలో 1930, 1933 మధ్య కాలంలో ఆమె మూడు సార్లు జైలుకి వెళ్లారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో కూడా ఆమె అమూల్యమైన సహకారాన్ని అందించారు. మహిళల సామాజిక పరిస్థితులను మెరుగుపర్చడంలో ఆమె కీలకంగా వ్యవహరించేవారు. ‘ఆంధ్ర మహిళా సభ’, ‘విశ్వ విద్యాలయ మహిళా సంఘ్’, ‘నారీ రక్ష సమితి’, ‘నారీ నికేతన్’ వంటి చాలా సంస్థ లతో ఆమె కలిసి పనిచేశారు. అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి, ఆలోచనాపరుడు చింతామణి దేశ్‌ముఖ్‌ను 1953లో వివాహం చేసుకున్న తర్వాత, ఆమె దుర్గాబాయ్ దేశ్‌ముఖ్‌గా పేరులోకి వచ్చారు. పెళ్లి సమయంలో ఆమె ప్రణాళికా సంఘ సభ్యురాలిగా ఉన్నారు. ఆంధ్ర ప్రదేశ్‌లోని గ్రామాలలో విద్యను వ్యాప్తి చేసినందుకు గాను ‘నెహ్రూ లిటరసీ అవార్డు’ ఆమెను వరించింది. 71 ఏళ్ల వయసులోనే మే 9, 1981న హైదరాబాద్‌లో ఆమె కన్నుమూశారు. ఆధారం: న్యూ ఇండియా సమాచార్