తెలుగు సాహిత్యంలో ఎన్నో ప్రక్రియలు పిల్ల కాలువల్లా, సెలయేరుల్లా, నదుల్లా ఈనాడు ఉరుకులు పరుగులతో ప్రవహిస్తున్నాయి. ఈమధ్య బాగా వినిపిస్తున్న ప్రక్రియ పేరు గజల్. గజ్జలు కట్టుకుని మరి ఘల్ ఘల్‌మని నడుస్తోంది గజల్ సుందరి. పరాయి భాష నుంచి వచ్చినా తెలుగు భాషలో కాస్త ఒదిగి, కాస్త స్వతంత్రతను అద్దుకుని మరీ అన్ని సభలూ సమావేశాల్లో తన గొంతుకను స్వేచ్ఛగా, మధురంగా వినిపిస్తోంది. ఇదేమంత తేలికైన ప్రక్రియ కాదు. అలా అని రాయలేక పోయేంత కఠినమూ కాదు. గజల్ నాడి పట్టుకున్నాక రోజుకు ఒక్క గజలైన రాయకుండా ఉండలేని స్థితికి వస్తారు గజల్ కవులు. గజల్ ప్రక్రియలో రాసేటప్పుడు ముఖ్యంగా తీసుకోవల్సిన అంశం ప్రేమ, విరహం, తాత్వికత. ఈ భావాలను పలికించాలంటే కాస్త భావుకత్వం అక్షరాలకు అద్దాలి. జ్ఞాపకాలను కాస్త ఓపిగ్గా తవ్వి తీయాలి లేదా గొప్పగా ఊహాశక్తి అయినా ఉండాలి. ఈమధ్యన గజళ్ళలో సామాజిక అంశాలు, భక్తి గీతాలు కూడా వస్తున్నాయి. గజళ్ళు మనం ఇతరులతో సంభాషిస్తున్నట్లు ఉండాలి. అంటే ఎవరికో ఒకరికి మనం చెబుతున్నట్లు ఉండాలి. మనం రాసిన గజల్‌కు గాన యోగ్యత ఉండాలి. అంటే లయాత్మకంగా ఉండాలి. మృదువైన భావాలు మెల్లమెల్లగా సాగుతూ ఆ నడకలో లయ వినిపించాలి. పాఠకుల మనసులో చెరగని ముద్ర వేయాలి. వీటితో పాటుగా రధీఫ్, కాఫియాల నియమాలను, మాత్రా ఛందస్సును పాటించాలి. ఎంత స్వతంత్రంగా రాసినా కూడా మూలంలో ఉన్న నియమాలను పూర్తిగా గట్టున పెట్టకూడదు కదా... అప్పుడు అది గజల్ అని మనం మాత్రమే చెప్పుకోవలసి ఉంటుంది. గజల్ అంటే చాలా సున్నితంగా అక్షరాలు చదువుతుంటేనే మనసులో బాణీ కట్టేలా అతి రమ్యంగా ఉండాలి. నా దృష్టిలో గజల్ అంటే ....''గొంతు దాటిరాని గుండె ఊసులేవోఅక్షరమై కళ్ళముందు మెరవడమే...మనసులోని ఆర్ధ్రత కరిగి కరిగి ఓ హిమనదంలాకాగితాన్ని ప్రేమగా తడపడమే...'' రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బాగా గజళ్ళు రాస్తున్న వారిలో శ్రీమతి విజయ గోలి కూడా ఒకరు. ఫేస్బుక్మాధ్యమం లో ప్రతిరోజూ ఓ కొత్త గజల్‌తో ఉదయానికి స్వాగతం పలకడం ఆమె దినచర్యలో భాగం. గజళ్ళు మాత్రమే కాకుండా వచన కవిత్వం, అప్పుడప్పుడు కథలు కూడా రాస్తుంటారు. తెలుగు సాహిత్యంపై ముఖ్యంగా గజళ్ళ పైన మక్కువ ఎక్కువ అనే చెప్పాలి. గత ఏడాది మొదట వచన కవితా సంపుటి తరువాత ఒకేసారి రెండు గజళ్ళ సంపుటాలను ఆవిష్కరణ గావించారు. అవి : పిల్లన గ్రోవి, చిత్రవీణ. ఈ రెండు సంపుటాలకు ముఖ చిత్రాలు, రేఖా చిత్రాలు ప్రముఖ చిత్రాకారులు 'కూచి' వేయడం అదనపు ఆకర్షణ. 'పిల్లన గ్రోవి'లోని గజళ్ళు పాఠకుల హృదయాలను తన్మయత్వానికి గురిచేస్తాయి. సుమారు 47 గజళ్ళతో ఈ రాధా మాధవీయాన్ని 'పిల్లన గ్రోవి'గా మన ముందుంచారు. '' కన్నులలో కార్తీకం వెలుగులాయె కమనీయంకొలనులోని దీపాలే కలువలాయె కమనీయం'' పై మత్లాలో కన్నుల్లో వెలుగులు కార్తీక దీపాలుగా ప్రకాశిస్తే కొలనులో వదిలిన దీపాలేమో కలువల్లాగా శోభిస్తున్నాయని మనకో చక్కటి దృశ్యాన్ని చూపెడతారు. '' వెదురు పుల్ల రాగాలే వినిపించెను మధురముగానిను తాకిన ఆనందం నినదించెను మధురముగా'' ఈ మత్లాలో నీ మేను తాకితే కలిగే ఆనందం వేణువు వినిపించిన రాగమంత మధురమని మనోహర వర్ణన. ''పెదవులపై నీ నామమె పల్లవించు ప్రణవముగావిశ్వమంత నీ రూపమె అగుపించెను మధురముగా'' ఎటు చూసినా నీ రూపమే ఏ శబ్దమైన నీ నామమే అనడంలో అలౌకికమైన ప్రేమ దాగుంది. ''కనులు మూసి తలచితివా నీ కలలో నేనుంటామనసు తట్టి పిలిచితివా మాటలలో నేనుంటా'' కళ్ళు మూసి నిదురించే వేళ కలవై, కనులు తెరచి మెలకువగా ఉంటే మాటవై... నువ్వు తప్ప వేరే ఏమీ లేదు ఈ జగతిలో అంటారు. ''పూల బాస తెలుసుంటే పువ్వులాగ నవ్వేవుమనసు భాష ఎరిగుంటే మౌనాన్నే వీడేవు'' ఈ కవయిత్రి అన్నట్లు పూల బాసలు, మనసు భాషలు రెండు తెలియాలి ప్రేమలో. అపుడే పువ్వులాగా నవ్వడం మౌనానికి సెలవివ్వడం తెలుస్తుంది. ఇక్కడ అన్ని మత్లాల్లోనూ మనకు రసాత్మకమైన ప్రేమ కనిపిస్తుంది. రధీఫ్తో పోటీపడుతూ కాఫియాలు ఈమె గజళ్ళ నిండా కనిపిస్తాయి. ఈ సంపుటిలో అష్టవిధ నాయికలపై రాసిన ఎనిమిది గజళ్ళు ఉన్నాయి. 'చిత్రవీణ'లో మొత్తం 56 గజళ్ళు ఉన్నాయి. ప్రతి ఒక్క గజల్ ఓ ప్రేమ ధార. ఉదాహరణకు కొన్ని మత్‌లాలు చూడండి. ''చిత్రవీణ పాడినదీ చైత్రవర్ణ రాగాలేవనమంతా ఆలపించె వలపు సిరుల గానాలే!'' చిత్రవీణ స్వరాలలో వనమంతా వర్ణాలను అద్దుకోవడమే కాకుండా వలపు సిరులను కూడా వనాలకు పంచుతాయంటూ మనల్ని ఓ ఆహ్లాదకరమైన ప్రకృతిలోకి తీసుకుని వెళ్తారు. ''ఒక్క నవ్వు కానుకగా ఇవ్వలేవ ఒక్కసారికలనైనా నీరూపును చూపలేవ ఒక్కసారి'' ఒక నవ్వు నవ్వడానికి ఏమంత కష్టం. అలాగే కలలోకి రావడానికి కూడా... అంటూ సున్నితంగా అడుగుతున్నట్లు ప్రేమగా మందలిస్తున్నట్లు ఉందీ మత్లా. ''మనసెందుకొ గమ్మత్తుగ గగనవీధి తేలుతుందిఏమైనదొ తెలియకుంది ఎదచప్పుడు పెరుగుతుంది'' ఎందుకో గుండె చప్పుడు వేగం పెరుతోంది. అలాగే మనసు కూడా ఆకాశంలో తేలుతోంది. పరిపరి విధాలుగా మనసులోని అలజడులు, ఆనందాలు ప్రేమలో సాధారణమైనవే! ''గుసగుసగా ఊసులేవొ చెబుతుంటే బాగుంటదిగాలికున్న చెవులేవో వినకుంటే బాగుంటది'' ఈ మత్లాలో గమ్మత్తయిన భావన వింటుంటే ఎంతో బాగుంది కానీ ఈ పాడు గాలి మాత్రం వినకుంటే బాగుంటుంది. లేకుంటే ఈ గాలి వీచినంతమేర గుసగుసలు గుప్పుమంటాయి అనడం గమ్మత్తే కదా! ''జ్ఞాపకాల పుటలలోన నెమలీకే నా చెలియఅగరుపూల నెత్తావుల సౌగంధికే నా చెలియ'' చెలి జ్ఞాపకాలు ఎంత మధురమైనవో ఎంత పరిమళ భరితమో రసాత్మకంగా వినిపిస్తుంది ఈ మత్లాలో! ఈ కవయిత్రి తన గజల్ రచనలతో ఇలాగే సాగిపోవాలి; సరికొత్త రాగాలు పలికిస్తూ, చైత్ర వీణలా ప్రతి మదిలో పువ్వుల పరిమళాలను కురిపిస్తూ. గజళ్ళు మాత్రా ఛందస్సుతో రాయడం ఒక ఎత్తైతే లయబద్ధంగా శ్రోతల మనసు దోచుకునేలా రాయడం మరో ఎత్తు.. ఈ రెండు ఎత్తులను తన గజళ్ళలో నింపుకుని ఏకధాటిగా రాస్తున్న కవయిత్రి విజయగోలి. ఈ 'చైత్రవీణ', 'పిల్లన గ్రోవి' మంచి ప్రాచుర్యం పొందాలని ఆకాంక్షిద్దాం. - శాంతికృష్ణ ఆధారం : ప్రజాశక్తి